యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-38 – తిరుపతి

0
9

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా తిరుపతి గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

సాక్షాత్తు వైకుంఠం తిరుపతి

[dropcap]తి[/dropcap]రుపతి గురించి తెలియనివారు ప్రస్తుతం భారత దేశంలో చాలా తక్కువమందు వుంటారు. అందుకే నేను ఆ ఊరు గురించి, ఆ ఆలయం గురించి చెప్పటంలేదు. కానీ నేనీమధ్య చదివిన శ్రీ వేంకటాచల మహాత్మ్యము అనే పుస్తకము నుంచి (వరాహ పురాణాంతర్గతమైన ఈ శ్రీ వేంకటాచల మహాత్మ్యము శ్రీ తూ.వెం.చూడామణి గారిచే ఆంధ్రీకరింపబడినది) తిరుపతి గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇక్కడ ముచ్చటిస్తాను. విషయమంతా ఆ పుస్తకములోనిదే అని గ్రహించ ప్రార్థన.

శ్రీ వైకుంఠమునుండి భగవంతుని క్రీడా పర్వతమును తెచ్చుట

ప్రళయము తర్వాత సృష్టి మొదలు కావాలి కదా. శ్వేత వరాహమూర్తి భూమిని మునుపటివలె నిలిపి, సప్త సాగరములను, సప్త లోకములను వేరు వేరుగా విభజించి, చతుర్ముఖుని పిలిచి మునుపటివలెనే జగత్తును సృష్టించమని ఆజ్ఞాపించాడు.

ఆ శ్రీమహావిష్ణువు లోకాన్ననుగ్రహించటానికి తాను కూడా భూలోకంలో వుండాలని నిశ్చయించుకొని, దానికి తగిన స్ధలాన్ని నిర్ణయించుకుని గరుడుడిన వైకుంఠమునుంచి అపూర్వమైన క్రీడాచలమును, విష్వక్సేనాది పరివారజనాన్ని దేవతలను అక్కడికు తీసుకురమ్మని పంపించాడు.

గరుడుడు శ్రీమన్నారాయణుని క్రీడా పర్వతము, మూడు యోజనముల వెడల్పు, 30 యోజనముల పొడవు కలిగి, ఆదిశేషుని ఆకారముతోనున్నది, సర్వ ప్ర్రాణులకు పూజించదగినది, చూచినంతనే మోక్షదాయకమైనది, హరికి మాత్రమే వశమై వుండే ఆ మహత్తర పర్వతాన్ని తీసుకువచ్చి వరాహమూర్తి చెప్పినచోట వుంచాడు.

అనంతరము శ్వేత వరాహరూపుడగు స్వామి ఆ పర్వతాన్ని అధిరోహించి స్వామి పుష్కరిణికి దక్షిణ భాగమున గల వజ్ర వైఢూర్యాలతో నిర్మింపబడిన అపురూపమైన మందిరంలో శంఖ చక్ర గదాధారుడై కొలువుతీరాడు.

అక్కడికి పార్వతీ పరమేశ్వరులు, సప్త ఋషులు, ఇతర మునులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులును, నలభై తొమ్మిదిమంది వాయువులు, మిగతా దేవతలు అందరూ వచ్చారు. వారు హృషీకేశుడును, జగత్ప్రభువునగు ఆ వరాహరూపధారియగు మహా విష్ణువును అనేక విధముల ప్రార్థించి లోకముల ననుగ్రహించుటకు నువ్వీ పర్వతముపైనే నివసించియుండుము అని కోరారు. దేవతలు, మునులు నీ రూపమును చూసి భయభ్రాంతులగుచున్నారు గాన శాంతించమని ప్రార్థించగా, శ్రీవరాహమూర్తి శాంతించి నాలుగు భుజములతోను, శ్రీ, భూమి నాయికలతోను సౌమ్య రూపముతో దర్శనమిచ్చి అందరినీ పిలిచి ఈ వెంకటాచలము వైకుంఠముకంటే వుత్తమమైనది. నేను శ్రీ, భూదేవులతో మనుషుల కోర్కెలు తీరుస్తూ ఇక్కడే వుంటాను అని చెప్పి బ్రహ్మాది దేవతలనందరినీ తగు రీతిలో ఆజ్ఞాపించి అక్కడే అంతర్ధానమయ్యాడు. దేవతలు, మునులు అందరూ తమ తమ నివాసాలకి వెళ్ళారు.

ఈ కధ ప్రకారం శ్రీనివాసుడు నెలకొన్న కొండ సాక్షాత్తూ వైకంఠంనుంచి వచ్చినది. ఎంత పుణ్యప్రదమైనదోకదా. అంతేకాదు. ప్రళయం తర్వాత సృష్టి ప్రారంభమైనప్పటినుంచీ శ్రీనివాసుడు ఆ కొండమీదే వున్నాడు.

వచ్చేవారం శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చిన విశేషం తెలుసుకుందాము. తర్వాత మిగతా ప్రాంతాలకి వెళ్దాము.

(ఈ పుస్తకాన్ని సేకరించి మాకందజేసిన మా నాన్నగారు కీ.శే. శ్రీ పులిగడ్డ జనార్దనరావుగారికి ఆత్మీయ అభివందనములతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here