యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-45 – శ్రీకాళహస్తి

0
7

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి లోని పురాతన శివాలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

ప్రత్యేకతల నిలయం శ్రీ కాళహస్తీశ్వరాలయం

[dropcap]జ[/dropcap]గమెరిగిన దేవుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామికి 40 కి.మీ.ల దూరంలో వున్న శ్రీకాళహస్తి ప్రసిధ్ధి చెందిన పురాతన శైవ క్షేత్రం. ఇది చిత్తూరు జిల్లాలో ఒక పట్టణం, మండల కేంద్రం కూడా. ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా చెప్పబడే పంచభూతలింగాలలో ఇది నాల్గవది. ఇక్కడి శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. మిగతా నాలుగు కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో అగ్ని లింగేశ్వరుడు చిదంబరం ఆకాశలింగము. ఇక్కడ స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని ఒక దీపం కదులుతూ వుంటుందని చెప్తారు.

క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో తమిళ సంగం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రమును గురించి దక్షిణ కాశీగా ప్రస్తావన ఉంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూర్‌కు చెందిన శ్రీరామలింగ స్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రమును సందర్శించారంటారు.

స్థలపురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, కన్నప్ప వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి. ఈ కథలు అందరికీ తెలిసినవే అవటంతో మళ్ళీ ఇక్కడ చెప్పటం లేదు.

ఆలయ నిర్మాణం

శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అంటారు. ఈ దేవాలయము చాలా పెద్దది. క్రీస్తుశకం 1529లో అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు. 1912లో దేవకోట్టైకి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుదిరూపునిచ్చారు.

శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు. ఆది శంకరాచార్యులవారు ఇక్కడ శ్రీచక్రము స్థాపించారు. ఈ క్షేత్రానికి ఇంకా దక్షిణకైలాసమని, సత్య మహా భాస్కరక్షేత్రమని, సద్యోముక్తిక్షేత్రమని, శివానందైక నిలయమనే పేర్లు కూడా వున్నాయి.

దేవాలయ ప్రాంతములోనే పాతాళ విఘ్నేశ్వరాలయము ఉంది. భక్తులు ముందు ఈ స్వామిని దర్శించి, తర్వాత మిగతా దేవతలను దర్శించుకుంటారు. దేవాలయానికి సమీపములో వున్న కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని తరువాత చోళులు మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను, నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు.

గోపురాలు

ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు, 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం (కృష్ణదేరాయలు కట్టించినది) ఉన్నాయి. ఇక్కడ ఉన్న మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా, శిల్పకారుల పనితనానికి నిలువెత్తు రూపాలుగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మించబడింది. ఈ గోపురాన్ని 1516వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు శాసనాల వల్ల తెలుస్తోంది. ఈ గోపురం 2010 మే 26 న కూలిపోయింది. పది సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడా పగుళ్ళు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మత్తులు చేయిస్తూ వస్తున్నారు. అయితే కూలిపోక ముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒక వైపు బాగా బీటలు వారింది. మరో రెండు రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.

స్వామి గ్రామోత్సవం ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా “తేరు వీధి”కి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురంనుండి వస్తాడు. జంగమరూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి “బిచ్చాలు” దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్పు గోపురాన్ని “బాల జ్ఞానాంబి గోపురం” అని, ఉత్తరం గోపురాన్ని “శివయ్య గోపురం” అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని “తిరుమంజన గోపురం” అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడినైపున “సూర్య పుష్కరిణి”, ఎడమవైపున “చంద్ర పుష్కరిణి” ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురంనుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణ గోపురంనుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును.

మంటపములు

ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు, ప్రత్యేకంగా చూపరులను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపుసాని మంటపము, నూరుకాళ్ళ మంటపము (శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినది), పదహారు కాళ్ళ మంటపము, కోట మంటపము వాటిలో కొన్ని. నూరుకాళ్ళ మంటపం చక్కని శిల్పాలకు నిలయం. పదహారు కాళ్ళ మంటపంలో 1529లో అచ్యుత దేవరాయలు (కృష్ణదేవరాయలు సోదరుడు) పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తర లింగ ముఖద్వారం పైకప్పులో చక్కని చిత్రాలున్నాయి.

దేవతలు

శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు) గాను ఉన్నారు.

ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది.

ఇతర శివలింగాలు, పరివార దేవతలు

ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠింపబడినవిగా భావిస్తారు. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, శని గ్రహ మూర్తులు ఉన్నారు. వేంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం, 64 నాయనార్ల లోహ విగ్రహాలున్నాయి.

రాహు కేతు క్షేత్రము

ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గురైన వశిష్ఠ మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి “రాహు కేతు క్షేత్రము” అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచానికి అలంకారములు చేస్తారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ వివిధ సర్ప దోష నివారణలకోసం పూజలు చేస్తారు.

దక్షిణామూర్తి

దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారంనుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందుకొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనుపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయానికి ప్రముఖస్థానం ఉంది.

పట్టణం నడిబొడ్డులోగల పెళ్ళి మంటపంలో జరిగే స్వామి కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. పెద్ద ఖర్చులు భరించి పెళ్ళి చేసుకోలేని పేదలు స్వామి, అమ్మవారి కళ్యాణంతో పాటుగా పెళ్ళి చేసుకోవడం తరతరాలుగా ఇక్కడ వస్తున్న ఆనవాయితీ.

తిరుపతి వచ్చిన భక్తులంతా ఈ క్షేత్ర దర్శనం కూడా చేసుకుంటారు. తిరుపతినుంచి బస్సులు చాలా వున్నాయి.

Photo Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here