[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా తరిగొండలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
తరిగొండ
[dropcap]త[/dropcap]రిగొండ చిత్తూరు జిల్లాలో వాయల్పాడు (వాల్మీకి పురం) నుంచి గుర్రం కొండకి వెళ్ళే దోవలో, వాయల్పాడుకి దాదాపు 6 కి.మీ.ల దూరంలో వున్నది. వేల సంవత్సరాల క్రితం వెలిసిన ఈ స్వామి మూలంగా ఈ ఊరికి ఆ పేరు వచ్చినా, జన బాహుళ్యానికి ఎక్కువగా తెలిసింది మాత్రం ఇక్కడ పుట్టిన భక్తురాలు, కవయిత్రి వెంగమాంబ అద్వితీయభక్తి, అపురూప రచనల ద్వారానే.
ముందు పురాతన కాలం నుంచీ వున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి చెప్పుకుందాము. ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించినది దూర్వాస మహాముని అంటారు. అంటే ఈ ఆలయం పురాణ కాలం నాటిది. తర్వాత మళ్ళీ వెలుగులోకి వచ్చింది చోళరాజుల కాలంలో. ఆ కాలంలో భాకరాపేట సమీపంలోని చిట్టిచర్ల గ్రామంలో రామానాయుడు అనే పాలెగాడు (అప్పుడు అక్కడి జమీందార్లలాంటి వాళ్ళని అలా అనేవాళ్ళుట) వుండేవారు. వాళ్ళకి పశు సంపద ఎక్కువగా వుండేది. వారు ఆ పశువులని మేపుకుంటూ తరికుండ వచ్చేవాళ్ళు. ఆ కాలంలో ఈ ఊరు లేదు. ఈ ప్రాంతమంతా అటవీ ప్రాంతం. పశువులు ఇక్కడికి వచ్చి సేద తీరేవి. ఒక రోజు రామానాయుడు భార్య మజ్జిగ చిలుకుతూ వుండగా దానిలో నరసింహస్వామి సాలిగ్రామం వచ్చిందట. అదేదో రాయి అని పక్కన పడేశారు. మరుసటి రోజు కూడా అలాగే జరిగింది. ఆ రోజు రాత్రి రామానాయుడికి స్వామివారు స్వప్నంలో కనిపించి “నేను లక్ష్మీ నరసింహస్వామిని, తరికుండకు పశ్చిమ భాగాన, మారెళ్ళ ప్రాంతంలో ఒక కొండ గుహలో వున్నాను. అక్కడే ధనం కూడా వున్నది. ఆ ధనంతో నాకు ఆలయం నిర్మించు” అని చెప్పాడు.
మర్నాడు రామానాయుడు స్వప్న వృత్తాంతాన్ని అందరికీ తెలియజేసి స్వామి చెప్పిన ప్రదేశానికి వెళ్ళి వెతకగా అక్కడ స్వామి విగ్రహం, ధనం దొరికాయి. దానితో ఆలయాన్ని పునర్నిర్మించి మిగిలిన ధనాన్ని స్వామి సేవకి వినియోగించారు. తరి అంటే సంస్కృతంలో మజ్జిగ. మజ్జిగ కుండలో స్వామి దర్శనమిచ్చాడు గనుక ఆ ప్రాంతం తరికుండ, తర్వాత తర్వాత తరిగొండ అయింది. ఇక్కడ స్వామి మెడలో పెద్ద సుదర్శన సాలిగ్రామాల మాల వున్నది. చూపించారు.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించేటప్పుడే దూర్వాస మహర్షి తన తపోబలముతో ఇక్కడ సత్య ప్రామాణిక పీఠం నెలకొల్పారు. ఇక్కడ తప్పుడు ప్రమాణాలు చేసినవారి వంశం నిర్వీర్యం అవుతుందని ఆ మహాముని ఒకసారి శపించారుట. ఆ భయం ఇప్పటికీ అక్కడ ప్రమాణాలు చేసేవారికి వున్నది.
ఇక్కడ మూడు శాసనాలు వున్నాయి. వీటిలో మొదటిది క్రీ.శ. 1559లో విజయనగర చక్రవర్తి సదాశివదేవరాయ చేసిన శిస్తు రద్దు శాసనం. దీనినిబట్టి ఈ ఆలయం క్రీ.శ. 1557లో నిర్మింపబడిందని తెలుస్తోంది. రెండవ శాసనం ప్రకారం క్రీ.శ. 1846లో ఇక్కడ హోమశాల, వంటశాల గురు భాస్కరాచార్య శిష్యుడైన ఎర్రప్ప నిర్మించినట్లు తెలుస్తున్నది. మూడవ శాసనం ప్రకారం క్రీ.శ. 1862లో లక్ష్మీ నరసింహస్వామ కళ్యాణం కోసం క్రిష్ణమశెట్టి కళ్యాణ మండపాన్ని నిర్మించారని తెలుస్తున్నది. ఈ శాసనాలు తప్పితే ఈ ఆలయాన్ని ఖచ్చితంగా ఎప్పుడు, ఎవరు నిర్మించారో తెలిపే ఆధారాలు లేవు. మొత్తానికి 16వ శతాబ్దంలో, ఆలయం, ఊరు రాయదుర్గం రామనాయమి చేత నిర్మించబడ్డాయని భావిస్తున్నారు.
తరిగొండ వెంగమాంబ
వెంగమాబ వాశిష్ట గోత్రీకులైన కానాల మంగమాంబ, కృష్ణయామాత్య అనే నందవరీక బ్రాహ్మణ దంపతులకు 1730లో జన్మించింది. చిన్నప్పటునుంచీ అందరి పిల్లల్లా ఆట పాటలతో గడపక, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తిలో మునిగి, ఆయనే లోకంగా వుండేది. చిన్న వయసులోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురముగా గానము చేసేది. తండ్రి ఆమె భక్తి శ్రద్ధలను గమనించి సుబ్రహ్మణ్య దీక్షితులు అనే గురువు వద్దకు శిక్షణకు పంపాడు. ఆమె ప్రతిభను గుర్తించిన ఆయన తనకు తెలిసిన పరిజ్ఞానమంతా వెంగమాంబకు బోధించాడు. అనతి కాలములోనే వెంగమాంబ ప్రశస్తి నలుమూలలకీ పాకడంతో తల్లితండ్రులు ఆమె విద్యాభ్యాసాన్ని మాన్పించి ఆమెకి చిన్నప్పుడే పెళ్ళి చేశారు. కానీ ఆమె భర్త కొన్నాళ్ళకే అకాల మరణం చెందాడు.
అయినా ఆమె వెంకటేశ్వరస్వామినే భర్తగా భావించింది గనుక సుమంగళి చిహ్నాలను తీసివెయ్యలేదు. వాటిని చెరపాలని ప్రయత్నించిన సమాజాన్ని ఎదిరించి నిలిచింది. అధిక సమయం తపస్సులో గడిపేది. లక్ష్మీనరసింహస్వామిని ఆరాధించేది. ఆ ఆలయంలో వున్న ఉపాలయంలో ప్రసన్న ఆంజనేయస్వామిది పెద్ద విగ్రహం వుంది. ఆ విగ్రహం వెనుక ఇదివరకు ఒక సొరంగం వుండేదిట. వెంగమాంబ రోజూ ఆ విగ్రహం వెనక కూర్చుని తపస్సు చేసుకునేదిట. అంతేకాదు రాత్రిళ్ళు ఆ సొరంగ మార్గాన తిరుమల వెళ్ళి అక్కడ స్వామిని అర్చించి వచ్చేదిట.
కొన్నాళ్ళ తర్వాత ఆవిడ నివాసం తిరుపతికి మార్చింది. అక్కడ వెంకటేశ్వస్వామిని అర్చించి, హారతి ఇచ్చేదిట. ఒకసారి ఆవిడ హారతి ఇవ్వటం చూసి అర్చకులు మిగతా పెద్దలు ఆవిడని దూషించారుట. ఇంతమంది వుండగా స్వామికి హారతి ఒక విధవరాలు ఇవ్వాలా అని ఈసడించారు. ఆవిడ తన నివాసానికి వెళ్ళి బాధపడుతూ కూర్చున్నదిట. ఆ సమయంలో స్వామివారి ఊరేగింపు ఆవిడ ఇంటి ముందునుంచి వెళ్తూంటే రథం అక్కడ ఆగిందట. ఎన్న విధాల ప్రయత్నించినా రథం కదలలేదుట. అక్కడవున్నవారిలో కొందరు రథం కదలకపోవటానికి కారణం ఊహించారు. మునుపు వెంగమాంబ హారతి ఇస్తుంటే నిరసించారు. అది ఇష్టంలేక స్వామి ఇలా ఆవిడని కరుణిస్తున్నాడు. ఆవిడ హారతి ఇస్తేనే రథం అక్కడనుంచి కదులుతుందని వెళ్ళి ఆవిడని తీసుకువచ్చి హారతి ఇప్పించారుట. అప్పుడు రథం కదిలిందిట. అప్పటినుంచీ స్వామి ఊరేగింపుగా వచ్చినప్పుడు వెంగమాంబ వెండి పళ్ళెంలో ముత్యాల హారతి ఇచ్చేదిట. రోజూ స్వామికి తను హారతి ఇవ్వాలని కోరగా స్వామి ప్రతిరోజూ చివర జరిగే పవళింపు సేవలో తనకి హారతి ఇవ్వమని అనుగ్రహం చూపించారు. అదే సమయంలో తాళ్ళపాక అన్నమాచార్య లాలి పాట పాడేవారు. అందుకే తిరుపతిలో అన్నమాచార్య లాలి, వెంగమాంబ హారతి అనే నానుడి వచ్చిందంటారు. ఇప్పటికూ వీరిద్దరి వంశజులే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
వెంగమాంబ గురించి ఎన్నో విషయాలు ప్రచారంలో వున్నాయి. వాటిలో ఇంకొకటి. ఆవిడ భర్త చనిపోయినా ఐదవతన చిహ్నాలు ధరించటం చూసి సహించలేనివారు ఆవిడకి ఎన్నో విధాల చెప్పి చూశారుట. ఆవిడ వినలేదు. ఒక సారి పుష్పగిరి పీఠాధిపతి అక్కడికి వస్తే ఈ విషయం ఆయనకి విన్నవించారుడ. ఆయన చెప్పి చూస్తాను పిలిపించండి అన్నారు. ఆయన దర్శనానికి అనేకమంది వచ్చి నమస్కరిస్తున్నారు. వెంగమాంబ వచ్చిందిగానీ ఆయనకి నమస్కరించలేదు. ఆయన సున్నితంగా హెచ్చరించారు. అప్పుడు వెంగమాంబ మీరు పక్కకి జరగండి, ఆ పీఠానికి నమస్కరిస్తాను అన్నదట. అదేమిటో చూద్దామని ఆయన లేచారు. ఆవిడ ఆయన కూర్చున్న ఆసనానికి నమస్కరిస్తే అది కాలిపోయిందట. ఆ స్వామి ఆవిడ జోలికి వెళ్ళవద్దు. ఆవిడ సాధారణ స్త్రీ కాదు. గొప్ప భక్తురాలు అని ఊరివారిని హెచ్చరించారుట.
వెంగమాంబ ఎక్కువగా తపస్సు చేసుకోవటం, భక్తి గీతాలు రాసి, పాడటం చేసేది. ఆవిడ వెంకటాచల మహాత్యం, ద్విపదభాగవతము వంటి అనేక ఆధ్యాత్మిక కావ్యాలు రాసింది.
ఈమె తిరుమలలో తుంబురు కోన దగ్గర దట్టమైన అడవులలో యోగాభ్యాసం చేస్తూ గడపినట్లు తెలుస్తున్నది. ఈమెకు వేంకటేశ్వరుడు కలలో కనిపిస్తూ ఉంటాడని అనేవారు. తిరుమలలో వరాహస్వామి ఆలయం సమీపంలో ఈమె సమాధి ఇప్పటికీ ఉంది.
ఈమె ప్రతిరాత్రి ఊరేగింపుగా తన ఇంటిముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో ముత్యాల హారతి ఇస్తూ ఉండేదట. ఇందుకోసం ఒక్కొక్కదినం నగిషీలు చెక్కబడిన వెండిపళ్ళెంలో ఒక్కొక్క దశావతార ఘట్టాన్ని సమర్పించేదట. ఈ విషయం 1890లో ఈస్ట్ ఇండియా కంపెనీవారు తయారు చేసిన కైంకర్య పట్టీ లో వున్నదట. ఈమె తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించింది. చివరకు 1817 ఈశ్వర సంవత్సరం శ్రావణ శుద్ధ నవమినాడు తరిగొండ వెంగమాంబ వేంకటేశ్వరస్వామిని స్మరిస్తూ సజీవ సమాధి చెందింది. కానీ ఆవిడ నేటికీ అదృశ్య రూపంలో స్వామి వారి పవళింపు సేవలో పాల్గొంటుందిట. అలా స్వామి ఆవిడక వరం ఇచ్చారుట. ధన్యజీవి.
క్రీ.శ. 1940లో తరిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముందు భాగంలో తరిగొండ వెంగమాంబకి ప్రత్యేక ఉపాలయం ఏర్పాటు చేసి నిత్య పూజలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
ఈవిడ గొప్పతనాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆవిడ బొమ్మతో తెలుగు కవయిత్రి అని తపాలా బిళ్ళని విడుదల చేసింది.