యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-6

1
7

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా కలిగిరి లోని ‘శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

కలిగిరి కొండ

[dropcap]క[/dropcap]లిగిరి కొండ చిత్తూరునుంచి 15 కి.మీ. దూరంలో వున్నది. ఇక్కడ కొండమీద కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వెలిశాడు. అదీ ఎట్లా, కలి పురుషుడుని అణిచేస్తూ. ఈ స్వామిని దర్శించినవారికి కలి బాధలు వుండవంటారు. అందుకనే ఈ కలిగిరి కొండ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెళ్తే….

కలియుగంలో కామ, క్రోధ, మద, మాత్సర్యాలు, వగైరా అనేక దుష్టశక్తులు మానవులని వశపరచుకుంటాయని ప్రతీతి కదా. ఇవ్వన్నీ కలి పురుషుని మంత్రులట. కలి విజృంభించటానికి ఇవ్వన్నీ సహాయం చేస్తాయి. కలి యుగం ప్రారంభమైనప్పుడు దేవతలంతా బ్రహ్మదేవుడు దగ్గరకెళ్ళి కలి పురుషుడి బాధనుంచి మానవాళికి ముక్తి కలిగే మార్గం చెప్పమని కోరారు.

బ్రహ్మదేవుడు వారందరినీ తీసుకుని తిరుమల కొండలలో శ్రీ వెంకటేశ్వరస్వామి రూపంలో వెలిసిన శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చి ప్రార్థించి వారి సమస్యకు పరిష్కారం చూపించమని కోరాడు. వారి ప్రార్థనలు విన్న మహా విష్ణువు కలిపురుషుడుని అంతం చెయ్యటానికి తన వాహనం గరుత్మంతుడి మీద బయల్దేరాడు. మహా విష్ణువునుంచి తప్పించుకోవటానికి కలిపురుషుడు ఇక్కడ కలిగిరి కొండరూపం దాల్చాడు. అది గమనించిన మహావిష్ణు కలిని అణగదొక్కటానికి ఆ కొండమీద తన మొదటి అడుగు వేశాడుట. దానితో దాని పేరు నూలుకొండ అయింది. ఆ కొండమీద చిన్న మడుగు వుంది. దాని దగ్గర 3 అడుగుల పొడుగున్న ఒక పాద ముద్ర చూడవచ్చు. దానిని వెంకటేశ్వర స్వామి పాదంగా చెబుతారు. తిరుమలలో ఒక పాదము, కలిగిరిమీద ఒక పాదము పెట్టి స్వామి నిలబడ్డాడని ప్రతీతి. స్వామి నిలబడినప్పుడు కొండ స్వామి బరువు మోయలేక కదిలిందనీ, స్వామి “కదలకు మెదలకు కలిగిరి” అన్నాడని ప్రతీతి.

ఇంకొక కథనం ప్రకారం పూర్వం శ్రీమహావిష్ణువు మీద కోపం వచ్చి శ్రీ మహాలక్ష్మి భూలోకానికి రాగా ఆవిడని వెతుక్కుంటూ వెంకటేశ్వరస్వామి రూపంలో వచ్చిన విష్ణుదేవుడు ఇక్కడ సాలి వున్న ప్రాంతంలో కూర్చుని తపస్సు చేశాడుట. స్వామి తపస్సు చేసిన ప్రాంతంలో 60 అడుగుల పుట్ట తయారయిందిట. స్వామి తపస్సు గురించి తెలుసుకున్న కలి అనే రాక్షసుడు స్వామి తపస్సు భంగం చేయటం మొదలు పెట్టాడు. ఆ రాక్షసుణ్ణి వెంకటేశ్వరస్వామి తన ఎడమ పాదంతో పాతాళానికి అణగ దొక్కాడు. ఆ పాదమే అక్కడ వెలిసిందని.

గంగాదేవి మహా విష్ణువు పాదం దగ్గర ఉద్భవించి అక్కడ పుష్కరిణిగా మారిందిట. భక్తులు ఆ పుష్కరిణిలో స్నానం చేస్తారుట. మేము వెళ్ళినప్పుడు నీళ్ళు బాగాలేవు.

పురాణకాల చరిత్ర కలిగిన ఈ కొండమీద దేవాలయం నిర్మించింది క్రీ.శ. 1750 ప్రాంతంలో తాతయ్య అనే యాదవ పశువుల కాపరి. కొండపై ఈయన పశువులు మేపుతున్న ప్రాంతంలో స్వామివారి ఎడమకాలి పాదము, విగ్రహము వున్నాయట. ఆయన వాటిని గమనించకుండా ఇంటికి రాగా, స్వామి కలలో కనబడి తానున్న ప్రాంతం గుర్తులు చెప్పారు. మరుసటిరోజు తాతయ్య ఆ ప్రాంతంలో వెదకగా స్వామి పాదము, శిలా విగ్రహము కనిపించాయి. వెంటనే తాతయ్య కలిగిరి, ఇంకా సమీప గ్రామస్తులతో కలసి ఆలయం నిర్మించాడు. వరహాలుస్వామిని కూడా ప్రతిష్ఠించి కోనేరు తవ్వించాడు. కలిగిరి గ్రామంనుండి కొండపైకి మూడడుగుల వెడల్పుగల రాళ్ళ దారి ఏర్పరిచాడు. భక్తుల సౌకర్యార్ధం కొండవాలులో బావి తవ్వించి, నీడకోసం మర్రి చెట్టు నాటించాడు.

ఈ దేవాలయం ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్ధానం అధీనంలో వున్నది. ప్రస్తుతం చిన్నగా మామూలుగా వున్న ఆలయాన్ని పడగొట్టి పునర్నిర్మిస్తారుట. పూతలపట్టు, కలిగిరి.. రెండు పంచాయతీల మధ్య కొండ. రెండు వైపులనుంచీ కొండ మీదకి రహదారి వున్నది.

స్వామిది 3 అడుగుల సాలగ్రామ విగ్రహం. శ్రీదేవీ భూదేవీ సమేత వెంకటేశ్వరస్వామి.. పుష్పాలంకరణ బాగా చేశారు. మేము వెళ్ళేసరికి ఆలయం తీసే వుంది. అప్పుడే ఎవరిదో పెద్ద పూజ ముగించారు. మేమూ అష్టోత్తరం చేయించాము. ఉత్సవ విగ్రహాలను 35మంది విశ్రాంత ఉపాధ్యాయులు ఏర్పాటు చేశారుట.

మొదట్లో ఎవరూ ఎక్కువ వచ్చేవారు కాదుట. స్వామి యాదవులకి దర్శనం ఇచ్చి ప్రత్యక్ష నిదర్శనం చూపించారని, తర్వాత భక్తుల రాక ఎక్కువయిందని పూజారిగారు చెప్పారు. అంతకుముందు చీకటిపడితే ఎవరూ వచ్చేవారు కాదుట. ఆక్కడ తిరిగే ఆవులు, కోతులే ఆ ప్రాంతానికి కాపలా. ఆ ప్రాంతమంతా ఆవులు చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అన్ని ఆవులు వున్న కారణం అడిగితే స్వామికి మొక్కుకుని కోరికలు తీరిన వారు ఆవుని సమర్పిస్తారుట. వాటికి యజమానులు ఎవరూ వుండరు. స్వామే వాటి యజమాని. అవి ఆ చుట్టుపక్కల అడవుల్లో మేసి సాయంకాలం అయ్యేసరికి అక్కడికి వచ్చి అక్కడే వుంటాయిట. చాలా ఆవులు వున్నాయి. మొదట్లో ఛైర్మన్ నరసింహులు నాయుడు, మిద్దింటి క్రిష్ణమనాయుడు రెండు ఆవులను స్వామివారి పేర కొండపై వదిలారుట. వాటి సంతతి, భక్తులు ఇచ్చినవి ప్రస్తుతం చాలానే వున్నాయి.

బ్రిటిష్ వారి హయాంలో 1893లో తిరుమలకి ఎంత స్ధలం ఇచ్చారో, ఈ ఆలయానికీ అంత ఇచ్చారుట.

నిత్య పూజలతోబాటు విశేష పూజలు కూడా జరిగే ఈ ఆలయంలో రథసప్తమికి 7 వాహనాల్లో స్వామిని 7 రోజులు ఊరేగిస్తారుట. ఈ ఉత్సవాలు తిరుమలలో రాత్రిళ్ళు జరిగితే ఇక్కడ ఆనవాయితీ ప్రకారం పగలు జరుగుతాయిట.

మధ్యాహ్నం 11 గంటల నుంచీ 3 గంటలదాకా అన్నదానం జరుగుతుందిట దూరం నుంచి వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకుండా. ఇక్కడ ఏమీ దొరకవు. మమ్మల్ని భోజనం చెయ్యమన్నారు. కానీ మేము పొట్లం కట్టించుకుని వెళ్ళిన భోజనం కూడా వున్నది గనుక వాళ్ళ విశాలమైన భోజన శాలలో కూర్చుని భోజనం చేసి, విష్ణు పాదం, పుష్కరిణి చూసి తిరిగి బయల్దేరాము.

మార్గము

కలువకుంటనుంచి ఆటోలు కొండ పైదాకా వస్తాయి. గొడుగుచింత బస్‌లు కొండ కింద ఆగుతాయి.

పూజారిగారి పేరు శ్రీ ఆర్. వాసుదేవాచార్యులు.. సెల్ నెంబరు 8978830407.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here