యాత్రా దీపిక చిత్తూరు జిల్లా – 62 – రాజనాల బండ

0
12

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా రాజనాల బండలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

రాజనాల బండ ఆంజనేయస్వామి ఆలయం

[dropcap]చి[/dropcap]త్తూరు జిల్లాలో వున్న అనేక విశేషాలలో ఒకటి ప్రమాణాలు. ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, దొంగతనాలు ఇలాంటి పలు కేసులని ప్రమాణాల ద్వారా పరిష్కరించుకుంటారు. కొన్నిసార్లు కోర్టులకి వెళ్ళిన కేసులు, పోలీసుల దగ్గరకెళ్ళిన కేసులు కూడా ఈ ప్రమాణాల మీద నమ్మకంతో ఇక్కడ పరిష్కరించుకుంటామని అనుమతి తీసుకుని వస్తారు. అలా ప్రమాణం చేసే ప్రదేశాలు ఈ జిల్లాలో 3 వున్నాయి. కాణిపాకం వినాయకస్వామి ఆలయం, తరిగొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, రాజనాల బండ ఆంజనేయస్వామి ఆలయం. ఇక్కడ ప్ర్రమాణాలు చేసేవారు అబధ్ధపు సాక్ష్యం చెప్పరని, ఒక వేళ చెబితే, అతి తక్కువ సమయంలో వాళ్ళకి భగవంతుడే తప్పక శిక్ష విధిస్తాడని భక్తుల నమ్మకం. అంత మహిమాన్విత ఆలయాలలో ఇప్పుడు రాజనాల బండ ఆంజనేయస్వామి గురించి చెప్తాను.

ఈ ఆలయం 500 సంవత్సరాల క్రితం పుంగనూరు జమీందార్లు కట్టించినది. ఈయన వీరాంజనేయస్వామి. చాలా మహత్యంకల దేవుడని ఈ జిల్లాలోనే కాదు, చుట్టుపక్కల కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రలలో కూడా ప్రఖ్యాతి చెందినాయన. అంటే ఆయా రాష్ట్రలనుంచీ కూడా ఈ ఆలయానికి న్యాయం కోసం వస్తారు. అంతే కాదు. ఇక్కడ కుల, మత బేధాలు లేకుండా అవసరమైనవారు వచ్చి ఫిర్యాదు చేస్తారు. ఈ ఆలయానికి చేరుకోవాలంటే పెద్దకొండమరి మండలంలో చౌడేపల్లి వెళ్ళే మార్గంలో కనబడే కమానులోంచి వెళ్ళాలి.

మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 1-35. మిట్ట మధ్యాహ్నం. ఆలయం మూసి వున్నది. ప్రహరీ గేటు తీసే వుంది. దానిలోంచి లోపలకి వెళ్ళాము. ఆలయం బయట వరండాలో నిలువెత్తు ఆంజనేయస్వామి విగ్రహాలు రెండు వున్నాయి. లోపల ఆంజనేయస్వామిది చిన్న విగ్రహమేగానీ అద్భుతమైన పూమాలల అలంకరణతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్నది. పక్కనే శివలింగం, ముందు అమ్మవారు. అన్నీ కటకటాల తలుపుల నుంచే దర్శనం. ఆంజనేయస్వామి ముందు ఒక పీఠంలాగా వుంది. అది న్యాయ పీఠం. రాజీ న్యాయాల బండ. అంటే తగాదా పడ్డ ఇరు పక్షాలవారు ఇక్కడ చేసే ప్రమాణాల ద్వారా రాజీపడి, న్యాయం జరిగిందని తృప్తి చెందుతారు. తర్వాత తర్వాత జనవాడుకలో రాజనాల బండ అయింది.

ఇక్కడ న్యాయం కోసం వచ్చినవారు ముందు దేవస్ధానానికి రూ. 1116 లు కట్టి రశీదు పొందాలి. ఆ రశీదు తీసుకున్నారంటేనే, అవతల పార్టీవారికి వణుకు మొదలవుతుంది తప్పు వారివైపు వుంటే. సాధారణంగా ఈ సమయంలోనే చాలా కేసులు పరిష్కారమవుతాయి. దేవస్ధానంవారు ఒక శనివారం నాడు వీరి సమస్యా పరిష్కారానికి సమయం ఇస్తారు. ఈ లోపల ఇరు పక్షాలవారిని సామరస్యంగా సమస్యా పరిష్కారం చేసుకొమ్మంటారు. అలా పరిష్కారమయ్యే కేసులు కూడా ఎక్కువే. అలా పరిష్కారానికి రాకపోతే ఇరు పక్షాలవారు ఆ సమయానికి అక్కడికి వస్తారు. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీవారు, అక్కడ చేరి వాద ప్రతివాదులకు గుడి చరిత్ర, అక్కడి ప్రమాణాల విలువ తెలియజేస్తారు. వాద ప్రతివాదులను విడి విడిగా విచారిస్తారు. ఆ సమయంలోనూ, తేదీ నిర్ణయించే లోపలే, తప్పు చేసిన వారు సాధారణంగా ఒప్పుకుంటారు. సాధారణంగా 75 శాతం తగాదాలు ఇలా సమసి పోతాయి.

తప్పు ఒప్పుకోనివారు అక్కడ కోనేట్లో స్నానం చేసి తడి బట్టలతో, ఆంజనేయస్వామి ముందు వున్న పీఠం ఎక్కి, ఆ ఆంజనేయస్వామి సాక్షిగా, లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా (ఆంజనేయస్వామి ఆలయానికి ఎదురుగా 3 కి.మీ. ల దూరంలో కొండమీద నరసింహ స్వామి ఆలయం వున్నది), పంచ భూతాల సాక్షిగా తాను తప్పు చెయ్యలేదని ప్రమాణం చెయ్యాలి. ఇక్కడ ఎవరూ తప్పుడు ప్రమాణం చెయ్యరు. ప్రమాణం చేసినవారికి మూడు వారాలు సమయం ఇస్తారు. ఆ మూడు వారాలలో వాళ్ళు చేసిన ప్రమాణం అబద్ధమయితే వారికి తప్పక ఏదో ఒక హాని ఖచ్చితంగా జరుగుతుంది. అలా జరిగినప్పుడు వారే వచ్చి తాము తప్పుడు ప్రమాణం చెయ్యటం వల్లనే ఆ కష్టం వచ్చిందని చెబుతారు. ఆ భయంతో ఎవరూ తప్పుడు ప్రమాణం చెయ్యటానికి సాహసించరు. ఆలయంవారు మానవత్వానికి విలువనిచ్చి ఇరు పక్షాలవారిని విడి విడిగా (అందరి ముందూ కాకుండా) ప్రశ్నించి వివరాలు తెలుసుకుంటారు. నిందితుడు నేరం ఒప్పుకున్నా దాని గురించి అందరికీ చెప్పరు. అది తొలి తప్పుగా భావించి, తర్వాత కాలంలో తప్పులు చెయ్యద్దని చెప్తారు.

మొత్తానికి ఈ న్యాయ పీఠాల ద్వారా ప్రజలలో సత్ప్రవర్తన పెరుగుతుంది, నిజాయితీ విలువ పెరుగుతుంది, కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు, సమయం నష్టపోవటం తగ్గుతుంది అనుకుంటూ అక్కడనుండి బయల్దేరాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here