యాత్రా దీపిక కృష్ణా జిల్లా – 15. ఘంటశాల

0
12

[box type=’note’ fontsize=’16’] కృష్ణా జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా ఘంటశాల లోని శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వర స్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వర స్వామి ఆలయం, ఘంటశాల

[dropcap]ఇ[/dropcap]వాళ కృష్ణా జిల్లాలోని ఒక అపురూప ఆలయం గురించి చెబుతాను. మీరు ఏ శివాలయం చూసినా పానువట్టం మీద శివలింగం చూస్తారు. కానీ ఇక్కడ పార్వతీ పరమేశ్వరులని ఏక పీఠం మీద ప్రతిష్ఠించారు. ఇది అగస్త్య మహర్షి ప్రతిష్ఠితం. ఈ దేవాలయం క్రీస్తు శకం రెండవ శతాబ్ది పూర్వమే నిర్మించినట్లుగా భారత ప్రభుత్వ పురావస్తు శాఖ వారు పరిశోధన చేసి నిర్ధారించారు.

ఈ దేవాలయంలోని గర్భాలయంలో శివపార్వతులను ప్రతిష్ఠించిన పానువట్టం ఏక రాతి శిల. దీనికి నాలుగు కాళ్ళు వున్నాయి. ఏ దేవాలయంలోనైనా భూమి లోపలనుండి పానవట్టాన్ని నిర్మిస్తారు. కానీ ఇది భూమిని తాకదు. ఇంక విమాన శిఖరం కూడా విభిన్నమైనదే. దీనిని గజపృష్టాకార విమాన గోపురం అని చెబుతారు. దీనికి మూడు శిఖరాలు వుంటాయి. ఇదే పధ్ధతి తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో వున్నది. ఈ విమాన గోపురం పాటి మట్టితో నిర్మించబడి, కాలానుగుణంగా దీనిపై సిమెంటు పూత, ప్లాస్టరింగ్ చేశారు.

స్ధల పురాణం

అసలు ఆలయ స్ధల పురాణం ఏమిటంటే .. పార్వతీ దేవి హిమవంతుని కుమార్తెగా పుట్టి, పరమేశ్వరుని వివాహం చేసుకోవటానికి ఘోర తపస్సు చేస్తుంది కదా. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చూసేందుకు సమస్త ప్రాణికోటి ఉత్తరాపధానికి బయలుదేరుతుంది. జీవకోటి భారంతో ఉత్తరాపథం కృంగి పోతుంది. ఆ సమయంలో పరమేశ్వరుడు స్వయంగా అగస్త్య మహర్షిని పిలిచాడు. తక్షణమే దక్షిణాపథానికి వెళ్ళి ఒక పవిత్ర ప్రదేశములో శివ పార్వతుల విగ్రహ ప్రతిష్ఠ జరిపి ఏకాగ్రతతో పూజలు జరిపితే తమ కళ్యాణ మహోత్సవ సందర్శన భాగ్యం కలుగుతుందని చెప్పాడు. మహా తపస్సంపన్నుడైన అగస్త్యుడు దక్షిణాపథానికి వచ్చి ఘంటశాలలో పవిత్ర పానువట్టం మీద శివ పార్వతులను ప్రతిష్ఠించి పూజాదికాలను నిర్వహించి శ్రీ స్వామివారి సాక్షాత్ కళ్యాణ సందర్శన భాగ్యాన్ని పొందాడు. ఆ నాటినుండి ఈ క్షేత్రం దక్షిణ కైలాసంగా ప్రశస్తి పొందింది.

ఈ ఆలయం 2వ శతాబ్దానికి పూర్వమే నిర్మంచబడినట్లు సంపూర్ణ ఆధారాలు వున్నాయి. అంతేకాదు. చిత్తూరు జిల్లా గుడిమల్లం గ్రామంలోని శివాలయం, ఘంటశాల, అమరావతి, ద్రాక్షారామంలోని శివాలయాలు మొదటి శివాలయాలని పురావస్తు శాఖాధికారులు నిర్ణయించారు. తర్వాత చాళుక్యులు, శాతవాహనులు ఘంటశాలలోని ఆలయాన్ని అభివృధ్ధి పరచారు.

అప్పుడు ఈ గ్రామం సముద్రం, కృష్ణానది కలసివున్న నదీ ముఖ ద్వార ప్రదేశం. జలధి అంటే నీరు. నీటి ఒడ్డున వెలసిన స్వామిని జలధీశ్వరునిగా నామకరణం జరిగింది. బ్రహ్మర్షి అగస్త్యులవారిచే ప్రతిష్టితమైన ఈ పీఠాన్ని ఆది శంకరాచార్యులవారు స్వయంగా దర్శించి అర్చించారట. ఆయన ధ్యాన ముద్రలో వున్న ప్రాచీన రాతి ప్రతిమ అంతరాళ ముఖద్వారంపై నేటికీ దర్శనమిస్తుంది.

ఈ స్వామికి మూడు సార్లు ప్రదక్షిణ చేసి, స్వామికి అభిషేకం చేసిన తీర్థం సేవిస్తే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు. ఇది నాలుగు మాడ వీధులున్న శివాలయం. ఇలాంటివి అరుదుగా వుంటాయి. ఇక్కడ నవగ్రహాలు కూడా సతీ సమేతంగా దర్శనమిస్తాయి. అనేక విశిష్టతలున్న ఈ ఆలయాన్ని మూడు సార్లు దర్శిస్తే ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు దర్శించినంత పుణ్యంట. అంతేకాదు. ఏక పీఠం పై కొలువుతీరిన ఈ శివ పార్వతుల దర్శనం కైలాస గిరి దర్శనానికి సమానమని నానుడి.

ఓడరేవు

ఘంటసాల పురాతన రేవు అని చెప్పటానికి ఆధారాలు కూడా ఇక్కడే లభ్యమయ్యాయి 13వ శతాబ్ధం వరకు ఘంటసాల ఓడరేవుగా గుర్తించబడింది.ఈ ఓడరేవు నుంచి పాశ్చాత్య దేశాలకు వ్యాపారులు తరలి వెళ్ళేవారు.

బౌద్ధ స్తూపం

ఇక్కడ బౌధ్ధ మతం కూడా పరిఢవిల్లిందనటానికి గుర్తు ఇక్కకడి బౌధ్ధ స్తూపం. 1870లో మొదటిసారిగా ఇక్కడ బౌధ్ధ స్తూపం వెలుగులోకి వచ్చింది. అప్పటి కలెక్టర్ అయిన బాస్పెల్ మొదటిసారిగా స్తూపాన్ని గురించి ప్రభుత్వానికి తెలియచేశారు. ఆ తరువాత 1906లో పురావస్తు శాఖాధికారి అయిన అలెగ్జాండర్ రే స్తూపాన్ని తవ్వించి ఒక రిపోర్టును ప్రచురించాడు. ఈ స్తూపము వంటిది దక్షిణభారత దేశం లోనే లేదని ప్రకటించాడు. ఘంటశాల ఒకప్పటి బౌద్ధ క్షేత్రమని ప్రపంచానికి తెలియ చేసింది ఆయనే. ఘంటశాలలో మొత్తం ఇలాంటివి అయిదు స్తూపాలున్నాయి.

మౌర్య చక్రవర్తి అశోకుడు భౌద్ధ మత ప్రచారం కోసం క్రీస్తుపూర్వం 249వ సంవత్సరంలో మహదేవుడనే బౌద్ధ భిక్షువును దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపాడని మహదేవుడు తన వెంట తెచ్చిన భౌద్ధ ధాతువులను ఘంటశాల, నాగార్జునకొండ, అమరావతిలలో నిక్షిప్తం చేశాడని ‘దివ్య వాదన ‘అనే గ్రంథంలో వివరించబడింది. ప్రస్తుతం ఘంటశాలలో ఉన్నంత పెద్ద స్తూపం నాగార్జునకొండ, అమరావతిలలో లేదు. అదీ కాక ఈ స్తూపం 70 శాతం యథాతథంగా ఉంది. మిగతా స్తూపాలు శిధిలం అయిపోగా పునర్నిర్మించారు.

బుధ్ధుని అశ్వము పేరు కంటకము. ఆ కంటకము పేరిట నిర్మించబడిన ఈ గ్రామము కంటకశైలగా ప్రసిద్ధి పొంది ఆ తరువాత ఘంటశాలగా నామాంతరం చెంది ఉండవచ్చు. ఇక స్తూపం అంటే బౌద్ధంలో చైత్యం అని అర్థం. అయిదు స్తూపాలు ఒకచోట ఉంటే అది మహాచైత్యం అంటారు కాబట్టి ఘంటసాల మహాచైత్యం. అనేక బౌద్ధ శిల్పాలు, పూసలు, రోమను నాణాలు, పాలరాతి స్తంభాలు ఈ స్తూపము సమీపంలో దొరికాయి.

మ్యూజియం

ఇక్కడ చాలా బౌధ్ధ అవశేషాలు, పాలరాతి శిల్పాలు దొరికాయి. 19వ శతాబ్ధపు ప్రథమంలో ప్రజలకు అవగాహన లేక దొరికిన బౌద్ధ అవశేషాలను, మరియు పాలరాతి శిల్పాలను, చాకలి బండలు గాను, పిల్లలు వాటిని పగులగొట్టి గోడలపైన రాసే చాక్ పీసులుగాను వాడేవారు. అప్పటి వారి అవగాహనా లేమి వల్ల అరుదైన మన శిల్ప సంపద అంతా పారిస్ లోని గుయ్‌మెట్ మ్యూజియంకి తరలిపోయింది. మరికొన్ని మద్రాస్ మ్యూజియంలో భద్రపరిచారు. 1920ల ప్రాంతంలో ఒక రైతు కోటదిబ్బల ప్రాంతంలో పొలం దున్నుతుండగా దాదాపు 60శిల్పాలు బయటపడ్డాయి. కొన్నాళ్ళు ఆ రాతిఫలకాలన్నీ గుట్టగా ఒక చెట్టుకింద ఉంచారు. తర్వాత పారిస్ నుంచి డూబ్రియేల్ అనే సందర్శకుడు వచ్చి మొత్తం శిల్పాలను 5000 రూపాయలకు కొనుక్కుని వెళ్ళిపోయాడు. మరికొన్నాళ్ళకి స్తూప పరిశొధనకై వచ్చిన ఎర్నెస్టు రీ అనే పరిశోధకుడు శిల్ప వివరాలను తన రిపోర్టులో పొందుపరచి తన నివేదికను సమర్పించాడు.

తదనంతరం దొరికిన శిల్పాలన్నిటిని పాత గ్రంథాలయ ఆవరణలో ఉంచారు. 1945-జనవరి 1న ఘంటసాలలో మొదటి ఓపెన్ మ్యూజియంను అప్పటి పురావస్తు శాఖాధికారి అయిన డాక్టర్ చాబ్రా ప్రారంభించారు. పురావస్తు శాఖ నిబంధనల ప్రకారం 100 శిల్పాలు ఉంటే కాని మ్యూజియంను నెలకొల్పడానికి ఆస్కారం లేదు. అప్పటికి ఇంకా శిల్పాల సంఖ్య 100 దాటలేదు. ఆ తర్వాత మళ్ళీ 16.07.1963 న శ్రీ గొర్రెపాటి పరమేశ్వరరావు గారు ఢిల్లీ వెళ్ళి అప్పటి ఆర్కియాలజికల్ డైరెక్టర్ అయిన శ్ర్రీ ఎ.కె.ఘోష్ గారిని కలిసి మ్యూజియం నిర్మాణానికై వినతి పత్రం సమర్పించారు. ఆయన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించారు. తదనంతరం ఆ బాధ్యతను భుజాన వేసుకున్న మహనీయుడు శ్రీ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు. ఓపెన్ మ్యూజియం మూతపడిన తర్వాత వీధులలో అనాథల వలే పడి ఉన్న విగ్రహాలను ఒకచోట చేర్చి తన స్వంత ఇంటిలో భద్రపరిచి మ్యూజియం నిర్మాణం అయ్యేవరకూ వాటిని పరిరక్షించారు. అప్పటి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎన్.జి.రంగా మరియు శ్రీ వడ్డే శోభనాద్రీశ్వరరావు గార్ల ద్వారా కేంద్రప్రభుత్వంలో కృషి చేయించి మ్యూజియం నిర్మాణం అయ్యేంత వరకు అవిశ్రాంతంగా పోరాడారు. చివరికి 1997లో మ్యూజియం నిర్మాణం ప్రారంభమైంది. వెంకట సుబ్బయ్యగారి కృషికి గుర్తుగా మ్యూజియం ముందు ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here