యాత్రా దీపిక కృష్ణా జిల్లా – 19. పెనుగంచిప్రోలు

0
14

[box type=’note’ fontsize=’16’] కృష్ణా జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా పెనుగంచిప్రోలు లోని లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

లక్ష్మీ తిరుపతమ్మ దేవస్ధానం, పెనుగంచిప్రోలు

[dropcap]ఇ[/dropcap]ది ఒక పేరంటాలు క్షేత్రం. 400 సంవత్సరాల క్రితం ఒక మామూలు మనిషిగా జన్మించి, తన దైవాంశతోను, పతి భక్తితోను, గుణగణాలతోను దైవ స్వరూపంగా పూజలందుకుంటోంది ఇక్కడి పేరంటాలు లక్ష్మీ తిరుపతమ్మ. ఈమెని నమ్మి కొలిచేవారి సంఖ్య చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కృష్ణా జిల్లాలో విజయవాడకి 70 కి.మీ. ల దూరంలోను, జగ్గయ్యపేట, నందిగామలకు 20 కి.మీ.ల దూరంలోను వుంది ఈ పెనుగంచిప్రోలు గ్రామం.

ఈ గ్రామం అసలు పేరు పెదకంచి. కాలక్రమేణా పెనుగంచిగా, పెనుగంచిప్రోలుగా పిలువబడింది. ఈ ఊరిలో 108 దేవాలయాలు ఉండేవని అంటారు. అయితే కాలక్రమంలో ఈ ఊరి ప్రక్కనే ప్రవహించే మున్నేరు వరదల వల్ల ఆ ఊరు, ఆ దేవాలయాలు భూగర్భంలో కలిసిపోయాయి. అందుకే ఇప్పటికీ ఆ ఏటికి వరద వచ్చినపుడు ఇసుక తిన్నెల మధ్యన పురాతన దేవాలయాల స్తంభాలు నీటిలో కనిపిస్తాయని అంటారు. కొన్ని బయటకు కూడా కనిపిస్తాయిట. కాని వాటి గురించి ఎవరూ పట్టించుకోరు. ఈ ఊరిలోనున్న ఆదినారాయణస్వామి, గోపాలస్వామి విగ్రహాలు భూమిలో దొరికినవే. పెనుగ్రంచిపోలు సంస్థానానికి సంబంధించిన అనేక తవ్వకాలలో అనేక శాసనాలు లభ్యమయ్యాయి. పెనుగంచిప్రోలు గ్రామమే పాలంచెన్నూర్ అని సుమారు 1520 వ సంవత్సరంలో హిందూరాజులకు గోల్కొండ నవాబైన కులీ కుతుబ్ షా సైన్యానికి మున్నేటి ఒడ్డున పెద్ద యుద్ధం జరిగిందని, ఆ యుద్ధంలో హిందూ సైన్యం ఓటమి చెందిందని కథనం. బహుశా ఆ యుద్ధం తరువాత గ్రామ దేవాలయాల శిల్ప సంపద కొల్లగొట్టబడి ఉంటుంది. అందువల్లనే ఈ గ్రామంలో మున్నేటి ఒడ్డున ఎక్కడ పునాదులు త్రవ్వినా ఆనాటి శిల్పసంపద ఆనవాలు ఏదో ఒకటి బయల్పడుతోంది. ఈ మున్నేరు మౌద్గల్య మహర్షి తపోశక్తివల్ల ఉద్భవించిందని ఒక కథనం.

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ జన్మ స్ధలం అనిగండ్లపాడుకి చెందిన గోకినేని పాలెం. తల్లిదండ్రులు కొల్లి శివరామయ్య, రంగమాంబ. వెంకటేశ్వరస్వామి భక్తులు. వీరికి చాలాకాలం సంతానం కలుగకపోతే వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్నారుట. తమకి సంతానం కలిగితే ఆయన పేరు పెట్టుకుంటామని. తర్వాత తమకు పుట్టిన ఆడపిల్లకి లక్ష్మీ తిరుపతమ్మ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.

తిరుపతమ్మ జననానికి ఇంకొక కథ కూడా చెప్తారు. భూదేవి భూమి మీద పెరిగిపోతున్న పాపాత్ములను భరించలేక లక్ష్మీ, సరస్వతి, పార్వతుల దగ్గరకు వెళ్ళి మొర పెట్టుకుందట. వారు మనుష్యులలో మంచిని పెంచటానికి తమ ముగ్గురి అంశతో ఒకరిని సృష్టిస్తామని చెప్పారుట. అయితే జ్యేష్ఠాదేవి వారికి అడ్డుపడిందట. తను పెట్టే పరీక్షలకి తట్టుకుని నిలబడ్డప్పుడే ఆవిడకి దైవాంశ ఇవ్వాలని. దానికి వారూ ఒప్పుకున్నారు. లక్ష్మీ తిరుపతమ్మ ముగ్గురమ్మల అంశ అనీ, ఆవిడకి అన్ని కష్టాలు పెట్టి దైవత్వాన్ని ప్రకటింపజేసింది జ్యేష్ఠాదేవి అనీ అంటారు.

తిరుపతమ్మ ఏకసంధాగ్రాహి. వేదాలు, పురాణాలు, అన్నింటినీ ఆకళింపు చేసుకుని చుట్టుపక్కలవారికి బోధించేది. ఈమె పుట్టిన తర్వాత తల్లిదండ్రుల ఐశ్వర్యం అభివృధ్ధి చెందిందంటారు. తర్వాత మేనమామ కొడుకైన కాకాని గోపయ్యతో వివాహం జరిపించారు. పుట్టింటినుంచి అత్తవారింటకి పెనుగంచి వచ్చేటప్పుడు పుట్టింటి సారెతో పాటు ఒక గోవుని కూడా అత్తవారింటికి తెచ్చుకుంది తిరుపతమ్మ. తిరుపతమ్మ అత్తవారింట అందరి తలలో నాలుక వలె మెలగుతూ ఆ గ్రామ ప్రజలని కూడా అత్యంత వాత్సల్యంతో చూస్తూ వారికి జీవిత సత్యాలను, మంచీ చెడూ బోధించేది. భర్తకి కష్ట సుఖాలలో తోడు వుంటూ పాతివ్రత్య ధర్మాన్ని నెరవేర్చేది. అటు పుట్టినింటికీ, మెట్టినింటికీ పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. ఆ గ్రామ ప్రజలే కాక కృష్ణా జిల్లాలోని అనేకమంది ఆవిడని వెంకటేశ్వరస్వామి అవతారంగానే భావించేవారు. తిరుపతమ్మ కాపురానికి వచ్చాక ఆ ప్రాంతాలన్నీ సుభిక్షంగా వుండి ప్రజలంతా సుఖ సంతోషాలతో వుండేవారు.

అయితే జ్యేష్ఠాదేవి తన ప్రభావం చూపించటం మొదలు పెట్టింది. తిరుపతమ్మపట్ల భర్త, చుట్టుపక్కల ప్రజలు చూపిస్తున గౌరవం, భక్తి అత్త, ఆడబడుచులు సహించలేక పోయారు. తిరుపతమ్మను విపరీతమైన కష్టాలు పెట్టటం మొదలు పెట్టారు. కానీ తిరుపతమ్మ వారి ప్రవర్తన గురించి ఒక్కమాట కూడా భర్తతో చెప్పలేదు. ఆమె కర్మ సిధ్ధాంతాన్ని నమ్మేదిగనుక ధైర్యంగా తనకు ప్రాప్తించిన కష్టాలనన్నిటినీ తట్టుకున్నది. తిరుపతమ్మకు కష్టాలు మొదలైన సమయం నుంచి ఆ ప్రాంతాలన్నీ తీరని కరువు కాటకాలతో తల్లడిల్లిపోయాయి. పశువులకు మేత కూడా దొరకటం కష్టమయింది. గోపయ్య పశువులని తీసుకుని ఉత్తరారణ్యానికి (భద్రాచలం అడవులు) వెళ్తాడు వాటిని మేపటానికి. అదే సమయంలో తిరుపతమ్మ తండ్రి శివరామయ్యకి ఎవరో ఇచ్చిన శాపంవల్ల తిరుపతమ్మ కుష్ఠురోగగ్రస్థురాలయింది. ఆ రోజుల్లో ఆ వ్యాధి నయం చేయలేనిది, అంటువ్యాధి అని భయపడేవారు. దానితో ఇంట్లోవారు ఆమెని ఇంట్లోకి రానియ్యకుండా విపరీతమైన బాధలు పెట్టారు. పశువులని గోపయ్య తీసుకు వెళ్ళటంతో ఖాళీ అయిన పశువుల శాలలో వుండేది.

తల్లిదండ్రులు తమ దగ్గరకు రమ్మన్నా తిరుపతమ్మ వెళ్ళలేదు. తన భర్త అనుమతి తీసుకోకుండా ఎక్కడికీ రానని. ఆ సమయంలో ఆమెకి సేవలు చేసింది ఆవిడ బోధలను పాటించే శిష్యురాలు పాపమాంబ. ఆవిడ మూర్తి ఆలయ ప్రాంగణంలో వున్నది.

ఉత్తరారణ్యంలో గోపయ్య తన ఆవులను మేపుకుంటూ తనతో వున్న పశువుల కాపర్లకందరికీ రామాయణ, మహాభారతాలు బోధించేవాడు. ఒకసారి ఆయన భద్రాచలంలో వైకుంఠ రాముణ్ణి దర్శించి సంతృప్తి చెందాడు. అతను తన భార్యని తీసుకువచ్చి రామచంద్రుని దర్శనం చేయించాలని అప్పుడే అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆవులని మేపుతుండగా ఒక పులి అతని మీద దాడి చేసింది. ఆ పులితో పోరాడుతూ గోపయ్య చనిపోయాడు.

తిరుపతమ్మ తన దివ్యదృష్టితో ఆ విషయం తెలుసుకుని తన భర్త అవశేషాలతో సహగమనం చెయ్యాలని నిశ్చయించుకుంది. ముందు ఎవరూ అంగీకరించకపోయినా, ఆవిడ తన శక్తులు చూపించేసరికి ఊరి పెద్దలు అంగీకరించారు. ఆవిడ చితిమీదనుంచి భక్తి, కర్మ, జ్ఞానం, వైరాగ్యం, మోక్షం గురించి తన చివరి ఉపన్యాసం చేసింది. స్త్రీలు గౌరవించబడేచోట సుఖ శాంతులు పెంపొందుతాయని బోధించింది.

యోగాగ్ని ప్రవేశం తర్వాత తాను, తన భర్త ఆ ప్రదేశంలోనే పసుపు భరిణతో సహా విగ్రహాలుగా కనబడతామని చెప్పింది. చితాగ్నిలో తన మంగళ సూత్రం, పమిట కొంగు, కుంకుమ భరిణ కాలిపోకుండా అలాగే వుంటాయని చెప్పింది. తన యోగాగ్ని ప్రదేశంలోనే ఒక ఆలయం నిర్మించమని గ్రామ పెద్దలకి చెప్పింది. పాపమ్మని ఆశీర్వదించి ఆవిడ సేవలకి ప్రతిఫలంగా వారి వంశస్తులే ఆ ఆలయంలో అర్చకులుగా వుండాలని చెప్పింది. ఆమె చెప్పినట్లే ఆ ప్రదేశంలో వారి విగ్రహాలు మర్నాడు పాపమ్మ గుర్తించింది. గ్రామాధికారి శ్రీశైలపతి తిరుపతమ్మ ఆజ్ఞానుసారం ఆ చితి ప్రదేశంలోనే ఆలయం నిర్మించారు.

తిరుపతమ్మ యోగాగ్నిలో ప్రవేశించిన మూడవ రోజు గోపయ్యని చంపిన పులి అక్కడికి వచ్చి ఆ యోగాగ్నికి ప్రదక్షిణ చేసి చితి వెనక ప్రాణం విడిచిందిట. ఆ గ్రామ పెద్దలు అక్కడే పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించారుట. పెద్దమ్మ అంటే జ్యేష్ఠాదేవి. ఆవిడ కారణంగానే తిరుపతమ్మ పేరంటాలుగా పెనుగంచిప్రోలులో వెలిసింది.

అపర ఆది శక్తి అవతారంగా పూజలందుకుంటున్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం, పరిస ప్రాంతం ఊరి నడిబొడ్డున వున్నా విశాలంగా వుంటాయి. అందమైన ఆరు అంతస్తుల గోపురాలపై వివిధ దేవీ దేవతల విగ్రహాలు చెక్కబడ్డాయి. ముఖ ద్వారం పైన తిరుపతమ్మ, గోపయ్య విగ్రహాలు దర్శనమిస్తాయి. ఆలయ స్తంభాలు రకరకాల ఆకృతులతో, అందమైన రంగులతో కనులవిందు చేస్తాయి. కుడ్యాలపై దుర్గాదేవి వివిధ రూపాలు దర్శనమిస్తాయి.

మండపం మధ్యలో గోపయ్య, తిరుపతమ్మ విగ్రహాలు సజీవంగా దర్శనమిస్తాయి. గోపయ్య తలకి పాగా చుట్టుకుని, చేతిలో ఆయుధాలతో హుందాగా వుంటాడు. తిరుపతమ్మ ఒక చేతిలో బండారు (పసుపు) భరిణ పట్టుకుని ఇంకో చేతితో బొట్టు పెట్టబోతున్న విధంగా, వివిధ అలంకారాలతో కనబడుతుంది.

ఉపాలయాలలో ఉన్నవూరు అంకమ్మ, వినుకొండ అంకమ్మ అమ్మవారు, మద్ది రావమ్మ వగైరా గ్రామ దేవతలే కాక తిరుపతమ్మ బావగారు, తోటికోడలు మల్లయ్య, చంద్రమ్మల విగ్రహాలు వుంటాయి. వీరికి తన సమక్షంలో పూజ జరగాలని తిరుపతమ్మ అనుగ్రహించిందిట. వీరందరికీ నిత్య పూజలు జరుగుతూ వుంటాయి.

ఒక మానవ మూర్తి దైవిక శక్తివల్ల, పతిభక్తివల్ల కష్టాలకడలినుంచి శక్తి రూపిణిగా ఆవిష్కరించి పేరంటాలుగా మెట్టినచోట వెలిసింది. ఆ తల్లిని దర్శించి మొక్కులు తీర్చుకోవటానికి అపరిమితమైన భక్తి భావనతో ప్రజలు ప్రతి రోజూ వస్తూ వుంటారు. ముఖ్యంగా, శుక్రవారం, ఆదివారం విశేష సంఖ్యలో వస్తారు.

అన్నట్లు కృష్ణా జిల్లాలోని తిరుమలగిరి వెంకటేశ్వరస్వామి ఆలయం గురించి ఇంతకు ముందు చెప్పాను కదా. అక్కడివారు చెప్పిన విశేషమేమిటంటే ఆ ఆలయంనుంచీ తిరుపతమ్మ కళ్యాణానికి ప్రతి సంవత్సరం పసుపు కుంకాలు వస్తాయిట. ఆయన వర ప్రసాదిని కదా ఈవిడ. అందుకని ఆడబడుచు కట్నాలు అన్నారు.

ఉత్సవాలు

మాఘశుధ్ధ పౌర్ణమి నుంచీ అమ్మ నిధి మహోత్సవం జరిపిస్తారు. పౌర్ణమినాడు అమ్మవారి కళ్యాణం కన్యల పండగగా నిర్వహిస్తారు. దీనికి లక్షలాది ప్రజలు హాజరవుతారు. 5 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలని పెద్ద తిరునాళ అంటారు.

చిన్న తిరునాళ ఫాల్గుణ పౌర్ణమి నుంచి 5 రోజులు జరిగే తిరునాళ్ళని చిన్న తిరునాళ అంటారు.

మాలా ధారణ, మండల దీక్ష కూడా జరుగుతాయి. ఇవిగాక రెండేళ్ళకొకసారి సంక్రాంతి తర్వాత రంగుల పండగ జరుగుతుంది.

క్రీ.శ. 1700లో ఈ ఆలయ నిర్మాణం జరిగిందంటారు. అప్పటినుంచీ ఇప్పటిదాకా ప్రతి నిత్యం అనేకమంది భక్తులచే కొలవబడుతున్న తల్లి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ.

దర్శన సమయాలు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలదాకా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here