యాత్రా దీపిక కృష్ణా జిల్లా – 21. కొండపల్లి

0
14

[box type=’note’ fontsize=’16’] కృష్ణా జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా కొండపల్లి లోని విరూపాక్ష దేవాలయం గురించి, కొండపల్లి కోట గురించి, అక్కడి బొమ్మల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

కొండపల్లి

[dropcap]కృ[/dropcap]ష్ణా జిల్లాలో విజయవాడ నగరానికి పశ్చిమాన వున్న కొండ శ్రేణిలో వున్నది కొండపల్లి. ఈ కొండ శ్రేణి, సుమారు 24 కి.మీ. పొడవున, నందిగామ, విజయవాడల మధ్య విస్తరించి ఉంది. కొండపల్లి కొండమీద వున్న కోటకేగాక చేతితో తయారు చేసిన కొయ్య బొమ్మలకు కూడా చాలా ప్రసిధ్ధి చెందింది

ముసునూరి కమ్మ రాజులు కాలంలో ఈ కోట నిర్మితమైంది. ఢిల్లీ సుల్తానులను పారద్రోలి ఈ దేశాన్ని పరాయిపాలన నుంచి విముక్తి చేసిన తెలుగు వీరుడు ముసునూరి ప్రోలయ రాజ్యాన్ని సుభిక్షంగా, శత్రు దుర్బేధ్యంగా మలచే ప్రయత్నంలో ఈ త్రిలింగ దేశంలో అనేక కోటల నిర్మాణాలు చేపట్టాడు. అందులో భాగంగా కొండపల్లి కోట నిర్మాణానికి పూనుకున్నాడు.

ఈ కోట నిర్మాణం ప్రోలయ వారసుడైన కాపయ కాలంలో పూర్తి అయింది. కాపయ ఈ కోట నిర్మాణం దిగ్విజయంగా పూర్తి చేసి గుంటూరు జిల్లా కొల్లూరులో శాసనం వేయించాడు. ముసునూరు (పెమ్మసాని), గుంటుపల్లి, అడపా, దాసరి, అట్లూరి, వాసిరెడ్డి అనే ఇంటి పేర్లు కలిగిన కమ్మరాజులు సుమారు 300 ఏళ్లు ఈ కోటని పాలించారు. ఈ కమ్మ వంశాల రాజులని కొండపల్లి కమ్మరాజులు అని అంటారు.

ఈ కోటలో వరుసగా మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రధాన ప్రవేశ ద్వారం ఒకే గ్రానైట్ బ్లాకుతో నిర్మించారు. దీన్ని ‘దర్గా దర్వాజా’ అంటారు. ఇది 12 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తూ ఉంటుంది. ఇక్కడ వున్న, యుద్ధంలో చంపబడిన గులాబ్ షా దర్గా మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది.

బలమైన కోట గోడకు వున్న బురుజులలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడ విరూపాక్ష దేవాలయం ఉంది.

కొండ చుట్టూ శత్రుదుర్భేద్యమైన ప్రాకారం ఉంది. రాజమహల్ గోడలపై కళాఖండాలను తీర్చిదిద్దారు. దర్బారు నిర్వహించే రాజమహల్, రాణి, పరివారం నివాసముండే రాణీమహల్, నర్తనశాల, నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజ కుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలివెళ్లడానికి, ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం – ఇవన్నీ కొండపైనే ఉన్నాయి.

ప్యాలెస్ సమీపంలో లోతైన జలాశయం ఉంది. ఒక ఊట నుండి దీని లోకి నీళ్ళు వస్తాయి. జలాశయంలోని నీరు చాలా చల్లగా ఉంటుందని, దీని వలన జ్వరం వస్తుందనీ అంటారు. కోట ప్రాంతంలో అనేక ఇతర చెరువులున్నయి. ఇవి వేసవిలో ఎండిపోతాయి. జలాశయానికి ఆవల ఉన్న పాత ధాన్యాగారం ప్రస్తుతం శిథిలావస్థకు చేరి, గబ్బిలాలకు నివాసంగా ఉంది.

కోట ఆవరణలో ఒక ఇంగ్లీష్ బ్యారక్ ఇప్పటికీ ఉంది. ఇందులో ఎనిమిది పెద్ద గదులున్నాయి. పక్కనే ఒక ఇల్లు కూడా ఉంది. కోటలో ఆంగ్లేయుల శ్మశానం కూడా ఉంది.

క్రీ.శ. 1766లో జనరల్ కాలియేడ్ కోటను ఆక్రమించి, కెప్టెన్ మాడ్గే ఆధ్వర్యంలో ఈ కోటకు కొన్ని మరమ్మతులు చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. చివరగా కీశ 1767లో బ్రిటిష్ వారు కొండపల్లి కోటను తమ ఆధీనంలోకి తీసుకుని తమ సిపాయీలకు శిక్షణ పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే ఆర్థిక సమస్యలతో క్రీ.శ. 1859లో ఈ శిక్షణ పాఠశాలను మూసివేశారు. ఆ తరువాత దీనిని పట్టించుకున్నవారు లేరు. 1962 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోకి వచ్చాక రక్షిత కట్టడంగా ప్రకటించారు.

కొండపల్లి కమ్మరాజుల పరిపాలన కాలంలో ఈ ప్రాంతంలో వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ కోటకు మరమ్మత్తులు చేపట్టారన్నారు.

కొండపల్లి బొమ్మలు

ఇప్పటికీ ఈ గ్రామం పేరు విదేశాలలో సైతం వినిపిస్తోందంటే కారణం ఇక్కడ మాత్రమే తయారయ్యే చెక్క బొమ్మలు. చూసిన వెంటనే గుర్తు పట్టవచ్చు ఇవి కొండపల్లి బొమ్మలని. అంత ప్రత్యేకత కలిగి వుంటాయి. ఈ కొండ శ్రేణిలోని అటవీ ప్రాంతంలో ‘పొణుకు’ అని పిలువబడే ఒక రకమైన చెక్క విరివిగా లభిస్తుంది. ప్రసిద్ధ కొండపల్లి బొమ్మలను ఈ చెక్క తోనే తయారు చేస్తారు.

తేలికైన పొణుకు చెక్కతో చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను అలరిస్తున్నాయి. ఈ బొమ్మలు దేనికి దానినే ప్రత్యేకంగా తయారు చేయవలసినదే. ఒకసారి తయారు చేసిన దానిని మూసగా పోసి చేసే వీలులేదు. ఒకసారి తయారు చేసి దానిని ముద్రగుద్దే అవకాశం లేదు. వంద ఒకే రకం బొమ్మలు తయారు చేసినా, దేనికదే విడివిడిగా చెయ్యవలసినదే. మేము వెళ్ళినప్పుడు చూశాము. ఎవరో పెళ్ళికి వచ్చిన బంధువులకివ్వటానికి 200 పల్లకీలో వెళ్తున్న పెళ్ళికూతురు బొమ్మలు ఆర్డరు చేశారు. అన్ని బొమ్మలు ఒక్కచోట చూడటానికి ఎంత ముచ్చట వేసిందో. అప్పుడు తెలిసింది వాళ్ళు పడే కష్టం. మొదటిదానికి ఎంత సమయం వెచ్చిస్తారో, ఎంత కళాదృష్టి, ఏకాగ్రతతో చేస్తారో రెండవదీ అంతే సమయం, దృష్టి, ఏకాగ్రతలతో చేయవలసిందే.

కొండపల్లి కళాకారులకి మాత్రమే సాధ్యమైన గొప్ప కళాసృష్టి కొండపల్లి బొమ్మ. పెళ్ళిళ్ళల్లో ఖరీదైన ఏ వెండి భరిణో, ఖరీదైన బట్టలో వచ్చిన బంధువులకు పెట్టేబదులు ఇలాంటి కళాఖండాలిస్తే వాళ్ళు అందంగా ఇంట్లో అలంకరించుకుంటారు, కళాకారుల్ని ప్రోత్సహిస్తున్నామనే సంతృప్తి మనకీ వుంటుంది. అవి చూసి నాకదే అనిపించింది.

ఈ బొమ్మలు తయారు చేయటానికి ముందుగా చెక్క మీద తయారు చేయవలసిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. తరువాత రంపపు పొట్టు, చింత గింజల పొడితో కావలసిన ఆకారములో మలుస్తారు. బొమ్మలకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు, మార్పులు చేస్తారు. తరువాత వాటికి సున్నం పూసి ఎండపెడతారు. ఆ తరువాత ఆరిన సున్నంపై రంగులు పూస్తారు. కొండపల్లి బొమ్మలలో ప్రసిద్ధి చెందినవి ఏనుగు అంబారి-మావటివాడు, నాట్యం చేస్తున్న నృత్యకళాకారుల బొమ్మలు (తల, నడుము ఊగుతూ వుంటాయి), ధాన్యం బస్తాలు తీసుకు వస్తున్న ఎడ్ల బళ్ళు, పల్లెలలో తలపాగా పంచె కట్టుకొన్న పురుషులు చీరలు కట్టుకొన్న స్త్రీలు, వారి పనులు, వాద్య కళాకారులు, పెళ్ళిళ్ళు, ఉత్సవాలు, లక్క పిడతలు, ఒకటేమిటి జీవనవ్యవస్థ సూచించే ప్రజల బొమ్మలు ఎన్నో చూడవచ్చు. పౌరాణిక ప్రముఖులు, పక్షులు, జంతువులు, పండ్లు, కూరగాయలు, ఇళ్ళు మొదలైన ఎన్నో రూపాల్లో ఈ బొమ్మలు తయారు చేస్తారు. అన్ని తీర్థయాత్రా స్థలాల్లోను, హస్తకళా కేంద్రాలలోను ఇవి లభిస్తాయి. ఈ బొమ్మల తయారీలో ఉన్న శైలి, 17వ శతాబ్దంలో రాజస్ధాన్ రాష్ట్రంలో బొమ్మల తయారీ శైలి ఒకే విధంగా ఉండడం వల్ల ఈ కళాకారులు రాజస్ధాన్ నుండి ఇక్కడకు వలస వచ్చారని భావిస్తారు.

అవకాశం వస్తే మాత్రం బొమ్మలకోసమన్నా తప్పక చూడవలసిన ఊరు కొండపల్లి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here