యాత్రా దీపిక కృష్ణా జిల్లా – 22. శ్రీకాకుళం

0
12

[box type=’note’ fontsize=’16’] కృష్ణా జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా శ్రీకాకుళం లోని ఆంద్ర మహావిష్ణువు ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

శ్రీకాకుళం

[dropcap]కృ[/dropcap]ష్ణాజిల్లా, విజయవాడకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఘంటసాల మండలంలో వున్నది శ్రీకాకుళం. తెలుగునాట తొలి రాజులుగా చెప్పబడే ఆంధ్ర శాతవాహనుల రాజధాని ఇది. చారిత్రక ఆధారాల సహాయంతో ఇది తెలుగువారి మొదటి రాజధాని అంటారు. అంతే కాదు. వైష్ణవులు అత్యంత భక్తి భావంతో దర్శించే 108 దివ్య తిరుపతులలో ఇది 57వది. ఇక్కడ ఆంద్ర మహావిష్ణువు ఆలయం వుంది. ఇది చాలా ప్రాచీన ఆలయం. ఇందులోని మహావిష్ణువు ఆంద్ర భాషా ప్రియుడని అంటారు. ఆ మహావిష్ణువుని ముందుగా బ్రహ్మ ప్రతిష్ఠించి పూజించాడు.

ఆ కధేమిటంటే కలియుగ ప్రారంభంలో కలియుగంలో భూలోక వాసుల కష్టాలు తగ్గించటానికి ఇక్కడ కృష్ణానదీ తీరంలో శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు బ్రహ్మ భూలోక వాసుల పాపం పోగొట్టటానికి ఆయనని అర్చామూర్తిగా అక్కడే వుండమనీ, అయితే ఆ క్షేత్రం తన పేరుతో వుండేటట్లు అనుగ్రహించమనీ కోరాడు. అందుకే దానిని కాకుళం అన్నారుట. క అంటే బ్రహ్మ, కుళం అంటే స్నానంట. తర్వాత కాలంలో శ్రీ ముందు చేరింది.

ఇంకొక కథ ప్రకారం పూర్వం అక్కడ నిశుంభుడనే రాక్షసుడు వుండేవాడుట. వాడి బాధలు పడలేక ప్రజలు కళ్యాణ నగరాన్ని పాలించే ఆంధ్రనాయకుడిని ఆశ్రయించారు. ఆయన నిశుంభుడిని సంహరించి తర్వాత దానినే రాజధానిగా చేసుకుని ప్రజలకు చక్కని పరిపాలన అందించాడుట. ఆయనచే పూజిపబడ్డాడు గనుక ఆ స్వామిని ఆయన పేర్లతోనే పిలిచేవారంటారు. ఈయన శ్రీకాకుళేశ్వరుడు అన్న పేరుతో ప్రఖ్యాతి చెందాడు. ఇంకా ఈ స్వామివారిని ఆంద్ర విష్ణువు, ఆంధ్రనాయకుడు మొదలైన పేర్లతో కూడా పిలవబడ్డాడని పురాణాల ఆధారంగా తెలుస్తోంది.

ఆలయం విశాలమైన ఆవరణలో వుంది. అయిదు అంతస్తుల ఎత్తయిన రాజగోపురస్థంభం మీద ఉన్న శాసనం ద్వారా ఈ గోపురాన్ని చోళరాజైన అనంత దండపాలుడు శాలివాహన శకం 1081లో నిర్మించాడని తెలుస్తుంది. తరువాత శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ. 1519లో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న మండపంలో కూర్చుని స్వామిని స్మరిస్తూ ఆముక్తమాల్యద గ్రంథాన్ని రచించాడని తెలుస్తుంది. దానికి చిహ్నంగానేమో అక్కడ శ్రీకృష్ణదేవరాయలది పెద్ద విగ్రహం వున్నది. ఆ మండపాన్ని ఆముక్తమాల్యద మండపంగా పిలుస్తున్నారు. దీనిని ఈ మధ్య పునర్నిర్మించారు.

శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయం మూడు భాగాలుగా ఉంటుంది. రంగమంటపం, అంతరాలయం, గర్భగుడి. రంగమంటపంలో నాలుగు స్తంభాల మధ్య నర్తకి నాట్యం చేయడానికి వీలుగా గుండ్రని వేదిక వుంటుంది. గర్భగుడిపై ఉన్న విమానానికి భద్రకోటి విమానం అని పేరు. ఆలయానికి తూర్పు, దక్షిణ గాలిగోపురాలు ఉన్నాయి. రంగమంటపంలో ఉత్తరాభిముఖంగా దక్షిణగోడలోని గూడులో భాగ్యలక్ష్మి అమ్మవారు దర్శనం ఇస్తారు. ఈవిడకి ఎదురుగా ఆంజనేయస్వామి. ఈ రెండు విగ్రహాలు కాకతీయుల కాలం నాటివి.

స్వామివారి ఉత్తరభాగ ఉపాలయంలో భూసమేత చెన్నకేశవస్వామివారు కొలువై ఉన్నారు. మహావిష్ణువు ఆలయం పూర్వం ద్వీపంలో వుండేదిట. కృష్ణానది వరదల మూలంగా తర్వాత పునర్నిర్మించారుట. ఈ ఆలయంకన్నా ముందునుంచే చెన్నకేశవస్వామి ఆలయం ఇక్కడ వున్నదిట. ఇక్కడ ఒక వేదికమీద ఆళ్వారులతోబాటు వీరాసనాశీనుడైన మీసాల శ్రీరామచంద్రుడు సీతాదేవితో దర్శనమిస్తాడు.

ఈ ఆలయంలో నిత్యాగ్నిహోత్రం ఒక ప్రత్యేకత. ఏనాడో వెలిగించిన హోమగుండంలోని అగ్నిహోత్రం ఇప్పటికీ ఆవు పిడకలు, వరి పొట్టు, రావి సమిధలతో సంరక్షిస్తుంటారు. పురాతన కాలంనుంచీ నిత్యాగ్నిహోత్రం సంరక్షించబడే ఆలయం తెలుగునాట ఇదేనేమో.

ఆలయంలో స్వామి విశాల నేత్రాలతో, చతుర్భుజుడుగా శంఖ చక్రలతో, అభయ వరద హస్తాలతో దర్శనమిస్తాడు. అమ్మవారు రాజ్యలక్ష్మి.

పురాణాల ప్రకారం ఈ శ్రీకాకుళ క్షేత్రం సాక్షాత్తూ బ్రహ్మదేవుని ప్రయత్నం మేరకే ఉద్భవించినా, చారిత్రకంగా కూడా ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయం, కాలగమనంతో దేవరకొండ (చల్లపల్లి) ప్రభువుల వశమైంది. వారి కాలంలో దేవాలయం ఎంతో వైభవాన్ని అనుభవించింది. శ్రీనాథుడు మొదలైన ఎందరో కవులు తమ కావ్యాలలో ఈ క్షేత్రాన్ని గురించి, స్వామియొక్క మహత్యం గురించి గొప్పగా వర్ణిస్తూ వ్రాశారు. విజయనగర పతనానంతరం ఈ ప్రాంతం అంతా గోల్కొండ నవాబుల పాలనలోకి వెళ్ళిపోయింది.

ఆ తరువాత దేవరకొండ ప్రభువు అయిన యార్లగడ్డ కోదండ రామన్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చరిత్ర. ఇప్పటికీ చల్లపల్లి జమీందారులైన యార్లగడ్డ వంశీయులే అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీకాకుళేశ్వరస్వామిని ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని ఇక్కడివారి నమ్మకం. ప్రతి ఏటా వైశాఖమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

ఇక్కడే ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జునస్వామి ఆలయం వుంది. ఈయన ఈ క్షేత్ర పాలకుడు. అమ్మవారు బాలా త్రిపుర సుందరి.

ఇప్పటిదాకా కృష్ణా జిల్లాలో నేను చూసిన ఆలయాలు పూర్తయ్యాయి. మళ్ళీ కలుస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here