అంతనపొంతన లేని యాజ్ఞసేని

    1
    4

    [box type=’note’ fontsize=’16’] మిథ్ బస్టింగ్ వ్యాసం ఇది. కొన్ని రచనలు పొగడ్తలందుకుంటూ కల్ట్ క్లాసిక్ లుగా పరిగణనకు గురవుతూంటాయి. అలాంటి రచనలను గుడ్డిగా పొగడకుండా విశ్లేషించి నిగ్గుతేల్చే ప్రక్రియలో భాగమే టి. శ్రీవల్లీ రాధిక  వ్యాసం-  “అంతనపొంతన లేని యాజ్ఞసేని”  . [/box]

    [dropcap]తె[/dropcap]లుగు లిపిలో ఉన్న పుస్తకమేదైనా సరే, చేతికొస్తే పక్కన పెట్టకుండా చదవగలననే చిరుగర్వం ఉండేది నాకొకప్పుడు. దానిని భంగపరచిన మొట్టమొదటి పుస్తకం యాజ్ఞసేని. నిజానికి ఇది తెలుగు పుస్తకం కాదు. ప్రతిభారాయ్ గారు ఒరియాలో వ్రాసిన పుస్తకానికి జయశ్రీ మోహన్రాజ్ గారు చేసిన తెలుగు అనువాదం.

    నా జీవితంలో ఎంతో ప్రయత్నించి కూడా చదవలేక ప్రక్కన పెట్టిన మొదటి పుస్తకంగా దీనిని నేను ప్రత్యేకంగా గుర్తు పెట్టుకున్నాను. కనుకనే మొత్తం చదవకపోయినా దీని గురించి నాలుగు మాటలు వ్రాసి పెట్టుకున్నాను. వాటిని ఈ వ్యాసం ద్వారా పంచుకుంటున్నాను. ఈ వ్యాసం ఈ పుస్తకంపై సమగ్రమైన సమీక్ష కానీ విమర్శ కానీ కాదు.

    పాఠకురాలిగా నేను చాలా అల్పసంతోషిని. ఆధునిక భావాలయితేనే చదువుతాను, కాదు అందుకు వ్యతిరేకమయినవయితేనే చదువుతాను, వ్యావహారిక భాష అయితేనే చదువుతాను, గ్రాంథికమయితేనే చదువుతాను, ఫలానా మాండలికమయితేనే చదువుతాను, కాకపోతేనే చదువుతాను – ఇలాంటి నియమాలేవీ నాకు లేవు. వస్తువు గురించి కూడా పెద్ద పట్టింపు లేదు.

    ఒక పుస్తకంలో నన్ను ముఖ్యంగా ఇబ్బంది పెట్టేవి అనౌచిత్యాలు వైరుధ్యాలు. ఏం చెప్పినా సరే రచయిత కనీసం ఆ పుస్తకం వరకూ వైరుధ్యం లేకుండా చెప్తే చాలు, తనని తాను ఖండించు కోకుండా ఉంటే చాలు అని ఆశిస్తాను. కానీ చాలా సందర్భాలలో ఆ చిన్న కోరిక కూడా తీరక నిరాశ పడుతుంటాను.

    వైరుధ్యాలతో కూడిన రచనలు చదివినపుడు కలిగే అసంతృప్తిని చాలాసార్లు వాటిని వివరిస్తూ వ్రాసిన ముందు మాటలు తీరుస్తుంటాయి. రచనలోని వైరుధ్యాలను సమర్థించడానికి తమ పరిచయవాక్యాలలో ఇతర రచయితలూ ప్రముఖులూ చేసే ప్రయత్నాలను చదవడం సరదాగా వుంటుంది.

    ముందు మాటల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ పాఠకురాలిగా నేను చాలాకాలం క్రిందటే నేర్చుకున్న ఒక పాఠాన్ని గురించి చెప్తాను. ఒక రచనకు ఇతరులు వ్రాసిన పరిచయవాక్యాలను రచనకు ముందో వెనకో మన అభిరుచిని బట్టి చదువుకోవచ్చును కానీ రచయితలే స్వయంగా వ్రాసుకునే పరిచయాలను మాత్రం రచనకు ముందే చదవాలి. ఇంకా చెప్పాలంటే పుస్తకం కొనడానికి ముందే చదవాలి. ఎందుకంటే రచనలో తాము చూపబోయే “నైపుణ్యాన్ని” వారు ముందుమాటలో కూడా చూపుతారు కనుక.

    ఈ నవలని కూడా నా అలవాటు ప్రకారం ముందుమాటతోనే మొదలుపెట్టాను నేను.

    అందులో రచయిత్రి సమాజంలో ద్రౌపది పట్ల ఉన్న చులకన భావాన్నీ అగౌరవాన్నీ గమనించడం ఈ నవలారచనకు నేపథ్యంగా చెప్పారు. జనం మహాభారతాన్ని చదవకుండా మిడిమిడి జ్ఞానంతో, సంకుచితమైన దృక్కోణంతో ఆలోచించి మన సంస్కృతికి వికృత రూపాన్ని ఆపాదిస్తున్నారనీ దాన్ని నివారించేందుకు ఈ నవల వ్రాశాననీ అన్నారు. ఈ నవలకు వ్యాసదేవుడి మహాభారతం ఆధారమన్నారు. మళ్ళీ తనే “అనేక కాల్పనిక ఘటనలు, కాల్పనిక చరిత్ర కూడా మూల కథలో కలగలిపాను. నవలా రచనను దృష్టిలో ఉంచుకుని మూల మహాభారతంలోని కథా ప్రవాహంలో కొన్ని మార్పులు చేశాను. ఒక సాధారణ స్త్రీ ‘కృష్ణ’ మనోగతం ఎలా ఉంటుందో చిత్రించాలని ప్రయత్నించాను.” అన్నారు.

    అన్ని వైరుధ్యాలతో కూడిన వాక్యాలు వరసపెట్టి చదివినా ఎలాగో తట్టుకున్నాను కానీ కొన్ని ప్రశ్నలు మాత్రం పుట్టాయి.

    వ్యాస భారతాన్ని చదవకపోవడం వల్ల జనం అపోహల్లో వుండుంటే, వ్యాస భారతాన్ని యథాతథంగా అనువదిస్తే చాలు కదా! కాల్పనిక సంఘటనలు చేర్చాల్సిన అవసరం, కథా ప్రవాహంలో మార్పులు చేయాల్సిన అవసరం ఎందుకు కలిగింది?

    జనం వ్యాస భారతాన్ని చదవక అపోహల్లో వున్నారా! లేక వ్యాస భారతంలోనే ద్రౌపది పాత్ర స్పష్టంగా చిత్రించబడలేదా!

    అంటే వ్యాసుడు ద్రౌపది పాత్రని జనం అపార్ధం చేసుకునే విధంగా, అస్పష్టంగా చిత్రిస్తే, ఆ లోపాన్ని సరి చేయడం కోసం ఇప్పుడు రచయిత్రి కొన్ని కల్పనలు జోడించి ఆ పాత్రని మరింత స్పష్టంగా అర్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారా!

    ఈ ప్రశ్నలన్నిటినీ పక్కన పెట్టి ముందుకి సాగితే, తరువాతి వాక్యంలోనే మరో వైరుధ్యం.

    “ఆయా పరిస్థితులకి ఒక మామూలు స్త్రీగా ద్రౌపది మనోగతం ఎలా వుంటుందో వ్రాయడం” తన వుద్దేశ్యమని చెప్పారు రచయిత్రి. ఒకప్రక్క ద్రౌపదిని యజ్ఞగుండంలోనుంచి పుట్టిన అసాధారణ స్త్రీగా చెప్తూ, నవలకి యాజ్ఞసేని అని పేరు పెట్టడం ద్వారా దానినే గుర్తు చేస్తూ, మరోప్రక్కన ఒక సాధారణ స్త్రీ ఉద్వేగాలు ఆమెకి ఆపాదించి చూడడం ఎందుకు? అర్ధం కాలేదు.

    సరే, దానినీ సర్దుకుని ముందుకి సాగితే, “కృష్ణుడు-కృష్ణ ఈ పేర్లను జోడించి నేను వారిమధ్య వున్న దేహాతీత ప్రేమను స్థాపించాను. కృష్ణుడు-ద్రౌపదిల మధ్య వున్న సఖా-సఖి ల సంపర్కాన్ని ఇంతకు పూర్వం అనేకమంది చిత్రించారు.” అంటారు రచయిత్రి.

    అనేకమంది చిత్రించారు సరే, వాటిని ఆవిడ ప్రామాణికంగా తీసుకుంటున్నారా! మరి మొదట ఆవిడ చెప్పినదాని ప్రకారం వ్యాసభారతం ఈ నవలకి ఆధారం కదా! వ్యాసభారతం లో ఈ సఖా-సఖి సంపర్కం వుందా!

    అక్కడితో ముందుమాట ముగించి, సందేహాలు ప్రక్కన పెట్టి, నవల చదివే ప్రయత్నం చేశాను.

    ద్రౌపది అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ నవల మొదలయింది. మొదటి పుట నుంచే అసలు చదివించే గుణం కనబడలేదు.

    “ఎవరి కర్మను వారే అనుభవించాల్సి ఉంటే నేను మాత్రం ఎందుకు భర్త యుధిష్టిరుని ధర్మరక్షణార్ధం అయిదుగురు భర్తల పాదాలచెంత నన్ను నేను సమర్పించుకుని లోకంలో అపహాస్యం, వ్యంగ్యం, నిందాపనిందల పాలుకావల్సి వచ్చింది?”

    రెండవ పుటలోని ఈ వాక్యం చదవగానే చాలా ఆశ్చర్యపోయాను. “కర్మ” అంటే రచయిత్రికి ఉన్న అవగాహనకి నవ్వూ, ఆ అవగాహనని ద్రౌపదికి ఆపాదించినందుకు దుఃఖమూ – రెండూ ఒకేసారి వచ్చాయి.

    కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారి నోటివెంటా అర్థం చేసుకున్నవారి నోటివెంటా ఇలాంటి మాటలు రావు. ఆ సిద్ధాంతాన్ని నమ్మని వారూ దానిని గురించి బాగా తెలియని వారూ కుడా ఉంటారు నిజమే. అయితే అలాంటి వారు సాధారణంగా కర్మ సిద్ధాంతాన్ని గురించి రెండు రకాల విమర్శలు చేస్తుంటారు.

    ఒకటి – ఆ సిద్దాంతంలో న్యాయం లేదు. ఎప్పుడో చేసింది ఇప్పుడు అనుభవించడం, ఇప్పుడు చేసింది మరెప్పుడో అనుభవించడం ఏమిటి? అలా ఉంటే తాను చేసిన తప్పుకే తాను శిక్ష అనుభవిస్తున్నానని ఎలా అర్థమవుతుంది? ఒకవేళ అర్థమయినా, తప్పు చేసినవాడికి అప్పటికపుడు శిక్ష పడకపోతే భయమేమి ఉంటుంది? బాధ ఎలా తెలుస్తుంది? – ఇది మొదటి విమర్శ. దీనికి సమాధానం కావాలంటే కొత్తగా ఏమీ చదవనక్కరలేదు, ఎవరినీ ఏమీ అడగనూ అక్కర్లేదు. ఎవరికి వారే కొంచెం లోతుగా ఆలోచించుకుంటే చాలు, ఈ విమర్శ వీగిపోతుంది. తాము అనుభవిస్తున్నది తమ కర్మఫలమేనని అనుకోవడం, పడిన శిక్షకే కాక పడబోయే శిక్షకు కూడా భయపడడం – అవన్నీ ఆ సిద్ధాంతాన్ని నమ్మినపుడు ఆ నమ్మకంలో భాగంగానే జరుగుతాయన్న విషయాన్ని గమనిస్తే ఈ విమర్శ అర్థరహితమని అర్థమయిపోతుంది.

    ఇక రెండవ విమర్శ ఈ సిద్దాంతం వలన మనుషులు నిష్క్రియులవుతారన్నది. ఇదివరకు చేసిన పాపాల ఫలితంగా బాధలు అనుభవించడం తప్పదు అన్నపుడు మనిషి ప్రయత్నం మానేసి నిర్వీర్యుడవుతాడనీ అది సమాజానికి ఏ విధంగానూ మంచిది కాదనీ అంటుంది ఈ విమర్శ. ఇది చాలామంది చేసే విమర్శ. అయితే ఇది కూడా కర్మసిద్ధాంతం పట్ల సరైన అవగాహన లేకపోవడం వలన చేసే విమర్శే. ఎందుకంటే కర్మసిద్ధాంతం ప్రారబ్ధం గురించి ఎంత చెప్తుందో పురుషకారం గురించీ అంతే చెప్తుంది. కర్మఫలం, పురుషప్రయత్నం – ఈ రెండిట్లో ఏది బలంగా ఉంటే అది రెండోదాని మీద విజయం సాధిస్తుందన్నది కర్మసిద్దాంతాన్ని సరిగా అర్థం చేసుకున్నవారందరికీ తెలిసిన విషయమే.

    ఈ రెండు విమర్శలలో మొదటిదాన్లోవి లోతుగా ఆలోచించక పోవడం వలన వచ్చే ప్రశ్నలు. రెండవ దాన్లోవి కర్మసిద్ధాంతాన్ని సరిగా తెలుసుకోక పోవడం వలన వుండే అభిప్రాయాలు. కానీ “ఎవరి కర్మ వారే అనుభవించాల్సి ఉంటే నేను మాత్రం ఎందుకిలా ఉన్నాను?” అనే ద్రౌపది ప్రశ్నలు మాత్రం పూర్తిగా అసహజమైనవి. అసలు ఏ రకంగానూ పొంతన దొరకనివి.

    ద్రౌపదిని కర్మసిద్దాంతం పట్ల పూర్తి అవగాహన లేని స్త్రీగా (రెండవ రకం విమర్శకురాలిగా) చిత్రించడం కాదు, లోతైన ఆలోచన లేని స్త్రీగా (మొదటి రకం విమర్శకురాలిగా) చిత్రించడమూ కాదు, ఈ అసహజమైన ప్రశ్నలు ద్రౌపది వేసుకున్నదని వ్రాయడం ద్వారా ఆమె స్థాయిని ఆ రెండిటి కన్నా కూడా క్రింద పెట్టారు రచయిత్రి. అది ద్రౌపది పాత్ర యొక్క ఔచిత్యాన్ని దెబ్బతీసింది.

    రెండవ పుటలోనే ద్రౌపది తెలివితేటలని గూర్చి ఇంత ఘనమైన పరిచయం చదివాక ఇక ముందుకు సాగే ఆసక్తి కలగలేదు నాకు.

    అయినా కూడా కష్టపడి మరో పది పేజీలు చదివితే, ద్రౌపది మొదటిసారి కృష్ణుడిని తల్చుకునే సంఘటన ఎదురయింది.

    ద్రౌపదికీ, కృష్ణునికీ మధ్య వున్నది దేహాతీతమైన ప్రేమ అన్న రచయిత్రి, ద్రౌపది మొదటిసారి కృష్ణుడిని తల్చుకునే సంఘటనలోనే ఆమె కృష్ణుడి దేహాన్ని తలచుకుని పులకించినట్లు వ్రాశారు. “అతని అధరాలెలా ఉంటాయో!” అనుకోవడం. చెలికత్తె “మధుపానం లాంటి కృష్ణుని బాహుబంధనాలు, కృష్ణుని ప్రేమలోని మత్తు” అనగానే మైకంతో ఆమె వడిలోకి జారిపోవడం వగైరాలు వర్ణిస్తారు.

    నిజానికి కృష్ణుడి దేహాన్ని తలచి భక్తురాలు పులకించిపోవడంలో అసంబద్ధమేమీ లేదు. వారిది “దేహాతీతమయిన ప్రేమ” అనడమే అసంబద్ధం. కృష్ణుడి శరీరం, గుణాలూ, లక్షణాలు, తత్వమూ – సమస్తమూ భక్తుల్ని ఆకర్షిస్తాయి. అది సహజమే. మనుషుల మధ్య వున్న బంధాల విషయంలో వాడే “దేహాతీతం” అనే మాటని భగవంతుని విషయంలో వాడడమే అసహజం.

    ఆ సంఘటన చదివాక ఇంకా ముందుకు వెళ్ళి వైరుధ్యాలని తట్టుకోవడం, వరుసలో మొత్తం నవలని చదవడం నా వల్ల కాదనిపించింది. పుటలు తిప్పేస్తూ అక్కడక్కడా చూశాను.

    రచయిత్రి కల్పనలేవీ కూడా ఆసక్తికరంగానూ అనిపించలేదు; ద్రౌపది వ్యక్తిత్వాన్ని ఇంకా బాగా అర్ధం చేసి, అపోహలు తొలగించి, మన సంస్కృతి మీద గౌరవాన్ని పెంచేవి గానూ అనిపించలేదు.

    కర్ణుడికీ ద్రౌపదికీ మధ్య, కృష్ణుడికీ ద్రౌపదికీ మధ్య కల్పించబడిన సంఘటనలు కానీ, సంబంధాలు కానీ, కర్ణుడిపై ద్రౌపది సానుభూతి కానీ, కృష్ణుడిపై ద్రౌపది ఆరాధన కానీ – ఏవీ ఆకర్షణీయంగానూ లేవు, రచయిత్రి ముందుమాటలో చెప్పిన ఉద్దేశ్యాన్ని బలపర్చేవిగానూ లేవు.

    కర్ణుడు కుంతి పుత్రుడని అందరికీ (అటు కౌరవులకీ, ఇటు పాండవులకీ కూడా) మొదటినుంచీ తెలుసన్నట్లు వ్రాయడం, ప్రతిచోటా “వీరకర్ణుడు” “కుంతి ధర్మ పుత్రుడు” కుంతి ప్రియపుత్రుడు” అనడం – ఇలాంటి కల్పనల వల్ల క్రొత్త అందం రాకపోగా అసలు మొత్తం కథా, పాత్రల వ్యక్తిత్వాలూ – అన్నీ ప్రశ్నార్ధకమూ, అసంబద్ధమూ, తర్కరహితమూ అయిపోయాయనిపించింది.

    అలాగే వస్త్రాపహరణం సమయంలో శకుని మాటలు – “జ్ఞానం వున్న స్త్రీ పైన, బేలగా మాట్లాడని స్త్రీ పైన ఎవరికీ సానుభూతి వుండ”దని అనడం – అది చదివితే రచయిత్రి ఇప్పటి స్త్రీలపై తన పరిశీలనని భారతంలో చొప్పించే ప్రయత్నం చేశారు కానీ అది అతకలేదనిపించింది. ఇలాంటివి నవలలో చాలాచోట్ల కనిపించాయి.

    వికృత భాష్యాలనీ, అపోహలనీ తొలగించేందుకు ఈ నవల వ్రాస్తున్నానని చెప్పిన రచయిత్రి వాటిని తొలగించడానికి బదులుగా మరికొన్నిటిని చొప్పించే ప్రయత్నం ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. రచయిత్రి ఆలోచనలలోను రచనలోను పొంతన లేకపోవడం వలననే నవల మొదట్లో ఆమె ఆశించినట్లుగా ద్రౌపదికి మర్యాదనీ గౌరవాన్నీ సాధించి పెట్టే దిశలో ఈ నవల సాగలేదని అనిపించింది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here