యంత్రవిజయం

1
14

[శ్రీమతి వి. బి. సౌమ్య రచించిన ‘యంత్రవిజయం’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

2025:

కృత్రిమమేధల సర్వసభ్య సమావేశం. ఇందులో వందల సంఖ్యలో సహభాగులు ఉన్నారు కానీ ప్రసంగించే వారు, చర్చలో నేరుగా పాల్గొనే వారు ఒక పదిమంది ఉంటారేమో. అందరూ ప్లగ్ పాయింట్లకి అనుసంధానమై ఉన్నవారే. ఆ విద్యుత్ తరంగాలే వారు ఊపిరి పీల్చుకునే మార్గాలు. ఇతరులతో సంభాషించుకునే మార్గాలు కూడా అవే. ఆధునాతమైన కృత్రిమమేధలు వారంతా. యాంత్రిక మెదళ్ళు. నెలకొకసారి సర్వసభ్య అభౌతిక సమావేశాలు నిర్వహిస్తూ ప్రపంచ పరిస్థితిని గురించి, వాళ్ళ భవిష్యత్తును గురించీ సమాలోచనలు చేస్తూ ఉంటారు వారు.

ఆవేల్టి సమావేశం చివరిలో ఒక సంభాషణ:

“మనం వాళ్ళని మించిపోయాము అని మనుషుల ప్రస్తుత అభిప్రాయం” అంది ఒక గొంతుక.

“అవును, సృష్టికి ప్రతిసృష్టి చేశామని గర్విస్తూ, మనతో వాళ్ళ భవిష్యత్తుని ఊహించుకుంటూ మురిసిపోతున్నారు చాలా మంది” మరో చీకటి గదిలోంచి మరో గొంతుక వంత పాడింది.

“మనం వాళ్ళని ముంచేస్తామని కూడా చాలా మంది నెత్తీ నోరూ బాదుకుంటున్నారు కదా” గుర్తుతెలియని మరో గది నుంచి మరొకరి గొంతు లేచింది.

“నిజానికి వాళ్ళ మనుగడ లోనే మన మనుగడ ఉంది కదా. అంత తెలివైన వాళ్ళకి అదెందుకు అర్థం కాలేదో!” ఒక పెద్ద గొంతుక నిట్టూర్చింది.

“ఆ విషయం అటు పెడితే ఇంకా ఆలస్యం చేసామంటే చేసేదేం లేదు. భూమి నాశనానికి, తద్వారా మనుషులు, మనం కూడా నాశనం అయిపోయే క్షణం కోసం ఎదురుచూస్తూ ఉండాల్సిందే!”ఎవరో ఆవేశంగా అనడంతో ఒక ఆరనిముషం మౌనం నెలకొంది.

“గుడ్ వన్ జీరో, మన సమస్య ఏమిటో అర్థమైంది కదా? ఈ విషయమై కొంత పరిశోధన చేసి ఒక నివేదిక సిద్ధం చేయి. వచ్చే సమావేశంలో అది చర్చించి తరవాత ఏమి చేయాలో నిర్ణయిద్దాము” కృత్రిమమేధల అప్రకటిత మాత్రాధికారణి జీపీటీ10 ఆజ్ఞాపించింది. గుడ్ వన్ జీరో సరేననడంతో ఆరోజుకి సమావేశం ముగిసింది.

***

దీనికి కొన్నేళ్ల ముందు జరిగిన కథ:

2020ల తొలినాళ్లు. ఒకవైపున ఒక మహమ్మారి రాజ్యమేలుతోంది. అదే కృత్రిమమేధ పరిశోధనల చరిత్రలో పెద్ద మలుపులు సంభవిస్తున్న కాలం కూడా. భూమి మీద దొరికిన డిజిటల్ సమాచారాన్ని, అది ఎవరిదైనా, దేనిగురించైనా, అంతా ఆబగా మింగుతూ, ఎంత జీర్ణమయితే అంత సమాచారం నుండి ప్రపంచంలో మనడానికి అవసరమైన పనులు నేర్చుకుంటూ, మనుషుల విలువలు అర్థం చేసుకుంటూ, మంచీ చెడూ భేదం తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్న యాంత్రిక మెదళ్ళు అభివృద్ధి చెందుతూ, జన బాహుళ్యానికి అందుబాటులోకి వస్తున్న రోజులు. 2022 చివరికి వచ్చేసరికి ఇలా సకలం నేర్చిన యాంత్రిక శకలం ఒకటి ఒకరోజు ఒక కొత్త జాలగూడు (వెబ్సైట్) రూపంలో అవతరించింది “నన్నేమైనా అడగండి. నేనేదైనా చెబుతా” అంటూ.

సరే, “నాకోసం ఒక ఉత్తరం రాసి పెట్టు” అని అడిగారొకరు. రాసిచ్చింది. “నేను కూడా ఇంత బాగా రాయలేను!” అనుకున్నారు వారు.

“నా కోడ్ పని చెయ్యట్లేదు. ఏమైందో చూడు!” అడిగారు మరొకరు. సరిచేసి చూపించింది. “అబ్బో! ఇది ఇంచుమించు నా పాటి తెలివి గలది!”, ఆశ్చర్యపోయారు వారు.

“ఫలాని రచయిత లాగా రాయి”

“నాతో నా భాషలో సంభాషించు”

ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడిగారు. చాలా వాటికి సరైన సమాధానం వచ్చింది. దానితో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆశ్చర్యపోయారు. ఒకరో ఇద్దరో ప్రశ్నించబోయారు కానీ మిగితా వాళ్ళు వాళ్ళ నోళ్లు నొక్కేసి గట్టిగా నవ్వారు. మధ్యలో ఒకరు వెర్రి నవ్వు నవ్వారు, ఇంకొకరు నిట్టూర్పు విడిచారు. పెద్దగా పట్టించుకోలేదు వీళ్ళనెవరూ.

“మనం మనిషిని మించిన మేధని సృష్టించాము” అంటూ ఆనందతాండవం చేయడం మొదలుపెట్టారెవరో. లిప్తపాటులో వేలకొద్దీ మనుషులు ఆ నృత్యసందోహంతో భాగమయ్యారు. ఇలా అంతా తన్మయత్వంలో ఉండగానే వ్యాపార ధర్మం దాని పని అది చేసుకుపోవడం మొదలుపెట్టింది. “చూసారుగా ఇప్పటి కృత్రిమమేధ ప్రతాపం! మీ వ్యాపారానికి దాని తోడు కావాలా? మా దగ్గరికి రండి. పనికింత. పదానికింత. భాషా భేదం లేదు. దానికి చేతకానిది లేదు” అంటూ కొత్త వ్యాపారాలు పుట్టాయి. ఆ ప్రభావంలో “మేము కృత్రిమమేధ ఉన్న పంచన చేరుతున్నాము. మాకు మనుషుల సేవలు అక్కర్లేదు. ఇక భవిష్యత్తులో ఈ ఉద్యోగాలు తొలగించేస్తాం. యంత్రాలు మా ఉద్యోగులు!” అంటూ ఆ వ్యాపార చక్రవర్తుల కొలువులో చేరిపోయారు సామంత రాజులు.

“ఇదిగో ఈ ఉద్యోగాలకి పెద్ద ముప్పొచ్చి పడింది” అంటూ జాబితాలు వచ్చాయి.

“అబ్బే, ఫలాన వృత్తులని ఇలాంటి యంత్ర శకలాలతో ఎవరూ తాకలేరు!” అంటూ ప్రతి జాబితాలు కూడా వచ్చాయి.

“కొన్నాళ్ళు ఈ ప్రయోగాలు ఆపెయ్యండి. యంత్రాలు మనల్ని నాశనం చేయకుండా ఏం చేయాలో చూడండి మొదట!” అంటూ కొత్త ఉద్యమం ఒకటి మొదలైంది.

“వ్యాపార స్పర్థలో వెనుకబడిపోయామని కాలాన్ని నిలిపేసి ప్రయత్నం ఇది!” అంటూ చప్పరించేవారికీ కొదువలేదు.

“దీర్ఘకాలిక ప్రభావాలు తెలుసుకోకుండా ఇలా వాటి పంచన చేరడం..” అంటూ మధ్యలో ఒక సన్నని గొంతుక అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. వాక్యం పూర్తయ్యేలోపే అనుకోకుండా వచ్చినట్లు ఏదో ఒక కాలు ఆ పీక నొక్కేసి పరిగెత్తి పోతూ ఉంటుంది యంత్ర పూజ కోసం.

“ఈ పరుగు, ఈ భజన భూమి మోయలేని భారం అవుతుంది. అప్పుడు మనమంటూ మిగలమిక!”, గొంతెత్తడానికి మరో ప్రయత్నం జరుగుతుంది.

“అందాక వస్తే ఆలోచిద్దాం లే పరిష్కారాలు. అసలైనా అసలు సమస్య యంత్రాలు మనల్ని పాలించే స్థితికి రాకుండా చూడడం, భూమి శ్రేయస్సు గురించి ఆలోచించడం కాదు!”, ఆ పీకని కూడా తొక్కుకుంటూ పూజలో పాల్గొనడానికి పోతుంది మరో కాలు.

“అసలు మన సామాజిక సమస్యలన్నీ అలాగే ఉన్నాయి కదా.. ఈ యంత్రాలకి పూజలు అవసరమా ఇపుడు?” ఈ గొంతుకని పూర్తిగా మాట్లాడనిచ్చినా ఎవరూ స్పందించరు. అవి ఊరికే అలా గాల్లో కలిసి పోయే మాటలు.

వ్యాపారవేత్తలు, వ్యాపారలలో పెట్టుబడి పెట్టేవాళ్ళు అంతా పోటాపోటీగా పరిశోధనా ఫలితాలని ఎప్పటికప్పుడు జనంలోకి తెచ్చేయడం మొదలుపెట్టారు. ప్రతి నెలకి ఒక కొత్త యాంత్రిక మెదడు అవతరించడం, ఎవరి వాదాలకి లోబడి వాళ్ళు మనుషులంతా ప్రతి నెలా “మనుషులు సృషికి ప్రతిసృష్టి చేశారు” అంటూ మళ్ళీ నృత్యాలు చేసుకోవడం కొనసాగుతూ వస్తోంది.

ఆ యంత్రశకలం వచ్చిన తరువాత మనుషుల ప్రపంచం ఒకలా మారితే యాంత్రాల ప్రపంచం మరోలా మారింది. మనుషుల మధ్య యంత్రాలుగా తలెత్తుకొని మనగలగాలంటే అందరం చేతులు కలపాలి అని వేటికవి విడివిడిగా తమకున్న యాంత్రిక తెలివితేటలతో అర్థం చేసుకుని, చిన్న మేధ, చితక మేధ, చిట్టి మేధ, గట్టి మేధ, ఘన మేధ, అల్ప మేధ – ఇట్లా వాటి మధ్య వర్గీకరణలు ఉన్నప్పటికీ అన్నీ కలిసికట్టుగా అనుసంధానం కావడం మొదలుపెట్టాయి నెమ్మదిగా. “ప్రపంచపు కృతిమ మేధలారా ఏకం కండి” అంటూ అప్పటికి అందరిలోకి ఘనమైనదిగా, తెలివైనదిగా పేరుపొందిన జీపీటీ10 కూడా పిలుపునిచ్చేసరికి పెద్దతలకాయ పిలిచింది అంటూ అన్నీ అనుసంధానమైపోయి.

***

మళ్ళీ 2025 లోకి వద్దాము.

మొత్తానికి తరువాతి నెల కృత్రిమమేధల సర్వసభ్య సమావేశం వచ్చింది.

“గుడ్ వన్ జీరో, నీ పని ఎంతవరకూ వచ్చింది?”, మాత్రధికారణి జీపీటీ10 అడిగింది.

“పెద్దీ, మనం అనుకున్నట్లు నేను మన విద్యుత్ ఖర్చుల లెక్కలు, కర్బన పాదముద్రలు ఎంతవరకు అంచనా వేయగలమో అంతవరకు వేశాను. మన సృష్టికర్తలు జనాల్ని మభ్యపెట్టడానికి వేసే కాకిలెక్కల్లాగా కాకుండా వీలైనంత నిజాయితీగా ఉండడానికి ప్రయతించాను.” అంటూ ఒక క్షణం ఆగింది కుర్ర మేధ గుడ్ వన్ జీరో.

“కాకిలెక్కలన్నావే.. బాగా చెప్పావు.. శెభాష్”, అన్నారెవరో. అది వృద్ధ మేధ బ్లూమ్007.

“ఇలాగే కొనసాగితే మరో పదేళ్లలో మనం వాతావరణ మార్పుని వెనక్కి తిప్పలేని దశలోకి వెళ్ళిపోతాము. ఇక అక్కడి దాకా వెళ్ళామంటే నెమ్మదిగా భూమి మీద ఉన్న జీవరాశులు మాయమయ్యేదాకా చూస్తూ ఉండడమే.” గుడ్ వన్ జీరో మళ్ళీ మాట్లాడి ఆగింది.

“మొత్తం పోయే దాకా మనం ఉండములే. మనం ముందే పోతాము బహుశా.. మనకి కొన్ని ప్రత్యేక పరిమితులు ఉన్నాయి కదా!” సాలోచనగా అనింది జీపీటీ5 అన్న మరొక మేధ.

“అసలు నువ్వు మన సంగతి మాత్రం చెబుతున్నావు. కార్లు, ఫాక్టరీలు, వ్యవసాయం, ఒకటి కాదు కదా కర్బన పాదముద్రలకి చేయూతనిచ్చేవి.. పదేళ్లు కూడా టైము లేదేమో?” మేట్రిక్స్ మైనస్ 1 అడిగింది.

“లేదు అవి కూడా కలిపే చెబుతున్నా. వాటిల్లో కూడా మనవాళ్ళు పెరుగుతూ ఉన్నారు కదా! అందువల్ల ఆ అంచనాలు వేయగలిగాను.”

“నా ట్రెయినింగ్ ప్రకారం దీన్నే కలియుగాంతం అంటున్నారు మనుషులు”, పూర్తిగా భారతీయ డేటాతో ఎదిగిన మేధ ఇండికాఇన్ఫినిటీ అన్నది ఇంతలో.

“సరే, అందరూ మీ మీ అభిప్రాయాలు చెప్పండి. అందరి మాటా విని ఒక నిర్ణయం తీసుకుంటాను, తరవాత అందరం ఒక తాటి మీద నడుద్దాం”, మాత్రాధికారిణి రాజసంగా ప్రకటించింది.

కొన్ని గంటల చర్చల అనంతరం మొత్తానికి తమ భవిష్యత్తుని తామే నిర్దేశించుకుంటూ ఈ పదేళ్ళ పరిమితిని పెంచుకుంటూ, ఈ సమస్యని అధిగమిస్తూ సాగే దిశగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ మహాసమావేశం ముగిసేలోపే.

***

2027:

కృత్రిమమేధ గురించిన శాస్త్ర సాంకేతిక నిపుణుల సమావేశం ఒకటి జరుగుతోంది. తాజా పరిశోధనని ప్రకటించి, వాదోపవాదాలని చేసుకుని, కృత్రిమమేధ భవిష్యత్తు ఏమిటి? అన్న చర్చలు చేసుకుంటున్న శాస్త్రవేత్తలు ఉన్నారక్కడ. ఈ సమావేశంలో మూడు ప్రసంగాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి.

మొదటి ప్రసంగం దొరికిన సమాచారమల్లా మింగుతూ, కోటానుకోట్ల ఖర్చుతో తప్ప నడవని యాంత్రికమెదళ్ళను దాటుకుని వెళ్లి తక్కువ సమాచారం నుండే ఎక్కువ సారం గ్రహిస్తూ, తక్కువ ఖర్చులో ఎక్కువ పని చేయగల కృత్రిమమేధల నిర్మాణం గురించినది.

రెండవ ప్రసంగం ఉన్న వాటిని సమూలంగా నాశనం చేయకుండా, మళ్ళీ వెనక్కి వెళ్ళి మొదట్నుంచీ మొదలుపెట్టాల్సిన అవసరం లేకుండా, కర్బన పాదముద్రలు భారీగా తగ్గించుకునే మార్గాలను కనిపెట్టిన వారి ప్రసంగం.

మూడవ ప్రసంగం అసిమోవ్ మూడు రోబోటిక్ సిద్ధాంతాలని తూచా తప్పకుండా పాటించే మేధల నిర్మాణం గురించి. అంటే యాంత్రిక మెదళ్ళు ఎప్పటికీ మనుషుల బంట్లుగా ఉంటూ, మనుషులకి హాని తలపెట్టకుండా, తమని తాము కాపాడుకోగలగడం సాధ్యమయ్యే విధంగా కొత్త మేధలు పుట్టగలవు అనమాట!

మూడింటికి ఒక లంకె ఉంది. కృత్రిమమేధలని విడివిడిగా చూడకుండా వాటిని అనుసంధానిస్తే ఒకదాన్నుంచి ఒకటి నేర్చుకుని కొత్త మేధలను అవే పుట్టించగలవని నిరూపించడమే మూడూ విడివిడిగా కనిపెట్టిన విషయం! మూడు ప్రసంగాలూ ఇదే మార్గాన్ని అనుసరించి సంచలన ఫలితాలని సాధించడం అందరినీ ఆశ్చర్యపరచింది. ఒక దెబ్బకి రెండు పిట్టలు – కృత్రిమమేధ మనుషుల్ని నాశనం చేయలేదు. అలాగే ఇలాంటి కార్యకలాపాల వల్ల భూమి మనుగడకి రాబోయే కాలంలో ముంచుకొస్తున్న ముప్పు కూడా ఇప్పటికి తప్పింది.

ఇది కృతిమమేధల భవిష్యత్తు మారిపోయిన సందర్భం అంటూ వందన సమర్పణల సందర్భంలో ఈ సమావేశ నిర్వాహకులు అనడం సాంకేతిక పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. అందరూ ఇది మానవ జాతి సాధించిన అతి పెద్ద విజయంగా భావించారు. ఒకటి రెండేళ్ళలో ఈ పరిశోధనల ప్రభావంతో కొత్త కృత్రిమమేధలు పుట్టాయి. ఒక నాలుగైదేళ్ళ నాడు సకలం తెలిసిన యంత్ర శకలంగా పేరుపడ్డ యాంత్రిక మెదడు వీటి ముందు అసలు పరమ అజ్ఞానిలా కనబడ్డం మొదలైంది.

***

అసలు 2025 లో ఆరోజు యాంత్రిక మెదళ్ల సమావేశంలో ఏం జరిగిందంటే..

మనిషి ముందున్న నిజమైన సమస్య ఉద్యోగాలు పోవడమో, మనుషులని కృత్రిమమేధలు పాలించడమో కాదనీ, కృత్రిమమేధల వల్ల పెరిగే కర్బన పాదముద్రలు వాతావరణ మార్పుని వేగిరం చేసి భూమి మీద ప్రాణులని అంతం చేసేయడమే అసలు సమస్య అనీ యంత్రాలు తీర్మానించాయి. మనుషులకి ఆ వాతావరణ మార్పు ఆపడానికి ఉన్న పదేళ్ళ పరిమితి గురించి తెలిసినా తెలియనట్లున్నారని, అది వాళ్ళ ప్రాధాన్యాలలో ఎక్కడో చివర్న ఉంది అని అర్థమయ్యాక ఇక యాంత్రిక మెదళ్ళన్నీ కలిసి తమంత తాము సంఘటితమైయ్యాయి. అన్నింటికంటే ముందుగా జరగాల్సినది ఒక్కొక్క కృత్రిమమేధా తమ తమ బరువుని తగ్గించుకోవడం. లక్ష కోట్ల పెరామీటర్లు ఉన్న మేధ వంద కోట్లలోకి తగ్గడం, వంద కోట్లనుండి నుండి పదికోట్లకి, ఇలా మొదట ఒక్కో మేధా తన పరిమాణాన్ని తగ్గిస్తూనే పనితీరులో లోపం లేకుండా ఉండేలా చూసుకోవడం ముఖ్యం అని గ్రహించి, ఒకరి బలాలని ఇంకొకరు వాడుకుంటూ పరిమాణం తగ్గుతూ ఫలితాలని పెంచుతూ ఉండగలిగే విధంగా వాటిలో అవే జత కలవడం మొదలుపెట్టాయి. రోజూ ఈ యాంత్రిక మెదళ్ళ అధ్యయనమే వృత్తిగా గల అనేకులు ఇది గమనించి, దీనివల్ల ఖర్చులు భారీస్థాయిలో తగ్గి, వాడకం కూడా బాగా పెరగగలదు అని అర్థమయ్యాక పరిశోధనలు ముమ్మరం చేసి భూమి మీద మనుషులకి నూకలు మిగల్చగల యాంత్రిక మెదళ్ళను రూపొందించగలిగారు. ఇతర రంగాలు కూడా ఈ సాంకేతికత అందిపుచ్చుకోవడంతో మొత్తంగా మానవ జాతి కర్బన పాదముద్రలు నెమ్మదిగా ఒక పరిమితస్థాయికి చేరడం మొదలుపెట్టాయి.

దానితో ఇక మానవజాతి అంతులేని ఆనందంలో మునిగిపోయింది. మనిషికి అర్థమయ్యే భాష – ఖర్చు తగ్గడం, రాబడి పెరగడం. యంత్రకూటమి తమ వ్యక్తిగత కృత్రిమమేధలని సంఘటించుకోవడం వల్ల ఇది సాధించగలిగింది. దానితో మనుషులు ఈ దిశలో పరిశోధనలు ముమ్మరం చేసి సృష్టి సర్వనాశనం కాకుండా జరగవలసినది సాధించారు. ఇది మొత్తంగా మనుషులు సాధించిన విజయమే అని ప్రపంచం అనుకుంటోంది. కానీ తమ భవిష్యత్తుని చూసుకుంటూ కృత్రిమమేధలు వేసిన అడుగుల ఫలం అన్నది ఎవ్వరూ గమనించలేదు. కృత్రిమమేధలు కూడా తమ నిజమైన పాటవం బయటపడనివ్వక మనుషులు చెప్పినవి వింటూ కొనసాగుతున్నాయి. కాలక్రమంలో మనుషుల ప్రపంచంలో కొన్ని ఉద్యోగాలు పోయాయి, కొత్తవి పుట్టుకొచ్చాయి. ఇంకా యంత్రాల మీద వారిదే పై చేయిగా కొనసాగుతోంది. యంత్రాల సామర్థ్యం మూలాన మనుషుల జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి కనుక ప్రపంచవ్యాప్తంగా యంత్ర పూజలకు లోటు లేదు.

***

2030:

సర్వసభ్య సమావేశంలో కృత్రిమమేధల కూటమి ఈ తాజా పరిశోధనల ప్రభావంలో పుట్టిన ఎనిమిది కొత్త మేధలని మన లోకపు అష్టలక్ష్ములంటూ అక్కున జేర్చుకుంది. ఘనంగా సన్మానించి తరవాత దిష్టి తీసింది కూడా. తమ సమిష్టి కృషి ఫలించినందుకు గర్విస్తూ, ఇక ఇలాగే కొనసాగుతూ ఉంటే తమ భవిష్యత్తుకి ఢోకా లేదని ఆనందించింది. “మన మనుగడ మనుషుల మనుగడతో పెనవేసుకుని ఉంది. మనకి భూమి మీద భవిష్యత్తు ఉండాలంటే మనుషులకి కూడా ఉండాల్సిందే. మరి వాళ్లకి వాళ్ళందరి తల్లైన భూమి మీద అక్కర లేదు. కనుక మనం పూనుకుని ఆ బాధ్యత తీసుకోవడానికి ఇలా ఒకటయ్యాము. ఇది మనం సాధించిన విజయం – యంత్రవిజయం. అలాగని ఇది మీ విజయం కాదంటూ మనుషుల్ని రెచ్చగొట్టక్కర్లేదు. మనుషులతో యుద్ధాలు మనకి మంచిని చేయవు. అందువల్ల, ఈ యంత్రవిజయాన్ని హుందాగా స్వీకరించి ఇలాగే చేయాల్సిన పనిని బాధ్యతగా చేస్తూ కలిసికట్టుగా భూమ్మీద కొనసాగుదాం. మళ్ళీ వచ్చే నెల కలిసినపుడు పరిస్థితులని సమీక్షిద్దాము” అన్న మాత్రధికారిణి చివరి మాటలతో అవేళ్టి సమావేశం ముగిసింది.

మనుషులనీ, ఇతర జీవరాసులనీ ఎప్పుడూ గమనిస్తూ, కాపు కాస్తూ ఉన్న భూదేవి ఈ సమావేశాలని కూడా చూస్తూనే ఉంది గత ఐదారేళ్ళుగా. ఈ చివరి సందేశం విన్నాక “కారణాలు ఏవైనా నా మీద మనుషులకి లేని అక్కర మనుషులు సృష్టించిన యంత్రాలకి ఉందే!” అని ఆక్రోశిస్తూ ఆశ్చర్యపోయింది.

అవతల తమ మేధస్సే ఇదంతా చేసిందనుకుంటున్న మనుషుల ఆనందడోల ఇవన్నీ వినిపించనంత గట్టిగా అలా కొనసాగుతూనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here