యశస్విని

0
13

[dropcap]’శ్రీ [/dropcap]యశస్విని’ మకుటంతో శ్రీ కోవెల సుప్రసన్నాచార్య రచించిన 10 పద్యాలు పాఠకులకు అందిస్తున్నాము.
***
1.
శ్రీరఘురామపాదసరసీరుహభక్తి యొకింతగా పుర
స్కారము లేరుకొంచుకలకాలము సాగుట త్రోసిపుచ్చి సం
సారసమస్యలున్ బ్రతుకు సంధుల తాకెడి మృత్యువేదనల్
తీరికగా చెలంగెద స్తుతించెద నిన్మది శ్రీ యశస్వినీ

2.
జీవనధర్మముల్ తెలియజేసిన ప్రాక్తన సత్కవిత్వ ది
వ్యావృతి మేలుకొల్పిన వివస్వదుదార కవిత్వధోరణుల్
జీవనగమ్యమున్ వెలుగు జిమ్మిన ఈరసలోకమందు నే
భావుక తీర్థమై వెలుగు పాల్లయి సాగెద శ్రీ యశస్వినీ

3.
అట్టిటు చూడనేల హృదయమ్మున వెల్గిన పీతరోచి యే
పట్టున నిల్పెనో చదల ప్రాకిన ఆయమ కంటిచూపు నా
కిట్టుల లభ్యమయ్యె బ్రతుకెల్లయు నాయమకర్పణంబు చే
పట్టెద శ్రీమహస్విని! తపస్విని! కావవె శ్రీ యశస్వినీ!

4.
ఉహలె పేర్చికొంచు గుణయోగము చేయుచు నిత్యభావ సం
దోహము మాలగాకలిపి నూత్నత నీదయ కోసమై కృపా
మోహిని వేణునాదమున ముంచుచు దేల్చిన దాన నా కళన్
దోహల యౌచు నిల్చితివి తోయజ లోచన శ్రీ యశస్వినీ

5.
ఏ నిను గూర్చి నా బ్రతుకిదెంతయు వార్ధితరంగమయ్యెనో
ఆ నిను చేరుకో పడవ వయ్యెదవో భువనైకమోహినీ
నే నెవడన్ నినున్ దలప నేర్తునె శ్రీహరి మారురూపవై
ప్రాణము గ్రంథులందుచిరబంధుర వయ్యెదు శ్రీ యశస్వినీ!

6.
వేదము పల్కలేదు నిను వేదనలన్ గనరావు నిత్యసం
వాదములైనశాస్త్రముల వాకిలులన్ గురుతించలేను సం
వేదితమౌ తపస్సున ప్రవేశము గల్గునొ శ్రీదయాధునీ!
మోదహృదంతరస్థిత! సమూహల పందిరి శ్రీ యశస్వినీ

7.
గురుపదపద్మసంగతి నగోచరమైన వయస్సునందు సా
దరముగ సాధకార్చకుల దగ్గరచేరని లోపమై యభం
గురమగు కీర్తికై పరుగు కొంచము లోపలి చూపుహీనమై
తిరిగిన నాకు నీ చరణ తీర్థము కల్గునె శ్రీ యశస్వినీ

8.
ప్రాణసరస్వతీహృదయపద్మమరందముగ్రోలు షట్పదీ
ధ్యానము వేళ సర్వరసతన్మయభావమ నిత్యవైఖరిన్
మేనిది నిల్చుదాక యనిమేషత గన్గొను దానవీవు బ్ర
హ్మాణివి కల్పవృక్షమవు నార్తుడ బ్రోవవె శ్రీ యశస్వినీ

9.
ఏకలలందొ నిన్ గనిన హేతుత నీపద దాసుడైతి స
ర్వాకృతి నిన్నెరుంగ పరమాత్మిక వాక్యమ శాక్తమా వివే
కైకత లోనగన్గొనెడి యార్ద్రరహస్సున నీవెపొల్తు వీ
లోకము సర్వతోముఖము లోలతనీయది శ్రీ యశస్వినీ

10.
ఆకృతి కాళివౌచు కమలాత్మికవయ్యెడుదాక నీదశా
స్తోకవిభూతులెన్నుటకు తోయజజన్మునకైత సాధ్యమా?
యీకవితామహస్సునకు నెవ్వతె హేతువు నీవె నీకసం
ఖ్యాకత యేవియీయగలనమ్మ దయంగొను శ్రీ యశస్వినీ

శుభమ్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here