యథాస్థితి

0
11

[dropcap]బా[/dropcap]ల్కనీలో కూర్చుని దినపత్రిక చదువుతూ, కాఫీ త్రాగుతున్నాను.

మెట్లమీద ఎవరో నడచి వస్తున్న చప్పుడైతే, అటుతిరిగి చూశాను.

వాచ్‌మన్.. సింహాచలం నన్ను చూడగానే మెలికలు తిరుగుతూ, నవ్వుతూ నా దగ్గరకొచ్చి నుంచున్నాడు.

ఏదైనా అవసరం పడినప్పుడు అతని ప్రవర్తన తీరు అలానే వుంటుంది. అతి వినయం అని కాకపోయినా అవసరానికి తగ్గట్లు మారుతుంటాడు. లిఫ్టున్నా, ఇప్పుడు మెట్లెక్కి రావటం కూడ అందులో భాగమే.

“ఏంటి సింహాచలం! ఇలా పొద్దున్నే వచ్చావు, ఏమిటో చెప్పు.” అన్నాను.

ఏదో గొణిగాడు. నాకు వినపడలేదు.

“గట్టిగా చెప్పు. నాకు అసలే చెముడు.” అన్నాను.

“జీతం పెంచాలి” అన్నాడు.

“ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాం.” అన్నాను.

“అవును, ఆరు వేలు చెయ్యండి” అన్నాడు.

“చాలా?” అని “అపార్టుమెంటు మీటింగులో మాట్లాడి చెప్తాలే” అన్నాను.

“అలాగే” అని చేతులు నలుపుకుంటూ వెళ్ళిపోయాడు.

ఈ జీతం పెంపు డిమాండు వెనుక ఓ కథ వుంది.

రెండు వారాల క్రితం, పొద్దున్నే ఏదో కంపెనీ సేల్స్‌మన్ అపార్టుమెంట్లో ప్రతి ఫ్లాట్‌కి వెళ్ళి వాళ్ళ ప్రోడక్టు గురించి చెప్పేస్తున్నాడు.

అలా ఎవర్ని పడితే వాళ్ళని అపార్టుమెంట్లోకి రానివ్వద్దని వాచ్‌మన్‌కి ఎప్పుడో చెప్పాం. సేల్సుమన్ వచ్చిన సమయంలో వాచ్‌మన్, అతని భార్య ఇద్దరూ అపార్టుమెంట్లో లేక పోవటంతో ఇలా జరిగింది. వాచ్‌మన్ ప్రక్కింట్లో బట్టలు ఉతకటానికి, అతని భార్య వేరే ఇంట్లో పనికి, ఇద్దరూ ఒకేసారి బయటకు వెళ్ళారు.

ఈ విషయం మీద పెద్ద గొడవే జరిగింది. సింహచలాన్ని అందరూ తప్పుపట్టారు. దానికి సింహాచలం కూడ రెచ్చిపోయి మాట్లాడాడు. చివరకు అసలు సింహాచలం, అతని భార్య బయట ఎవరి ఇళ్ళల్లో పనిచేయకూడదని తీర్మానించారు.

ఈ కారణంగా, సింహాచలానికి అపార్టుమెంట్లో వచ్చే జీతం తప్ప, బయట పని చేసుకుంటే వచ్చే ఆదాయం లేకుండా పోయింది.

అది ఇప్పుడు ‘జీతం పెంపు డిమాండు’ రూపంలో బయట పడింది.

సరే, ఆదివారం రోజు ఎనిమిది ఫ్లాటు ఓనర్లు కలసి మాట్లాడాం. సింహాచలం జీతం పెంచాలంటే, మేము ప్రతి నెలా ఇచ్చే అపార్టుమెంటు మెయింటెనెన్స్ వెయ్యి నుంచి పదిహేను వందలకు పెంచాలి.

పోనీ, సింహాచలాన్ని తీసేసి మరో కొత్త వాచ్‌మన్‌ని పెట్టినా, అతను నాలుగు వేలకంటే ఎక్కువే డిమాండు యొచ్చు. కొత్తతను ఎలాంటి వాడొస్తాడో! సింహాచలం మంచివాడే. త్రాగుడు అలవాటు లేదు. నమ్మకస్తుడు. ఎవరే పని చెప్పినా చేస్తాడు.

మొత్తానికి అందరం సింహాచలాన్నే కొనసాగించాలి, జీతం పెంపు లేకుండానే అనుకున్నాం.

అదెలా సాధ్యం? ‘మీరే ఏదో ఒకటి చేయండి’ అంటూ అందరూ నా మీదే భారం మోపారు.

ఇక చేసేదేముంది? సింహాచలాన్ని పిలిచాను.

“నువ్వు, నీ భార్య ఇద్దరూ ఒకేసారి బయట పనులకు వెళ్ళిపోతే ఎలా? ఎవరో ఒకరు అపార్టుమెంట్లో లేకపోతే, ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తుంటారు. ఒకరు వచ్చాక ఒకరు వెళ్తే ఇబ్బంది ఉండదు” అన్నాను.

అంతే, సింహాచలం, అతని భార్య మళ్ళీ బయట పనులకు వెళ్తున్నారు. సింహాచలం జీతం పెంపు విషయం మళ్ళీ ప్రస్తావించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here