‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-6

2
6

[dropcap]ఎ[/dropcap]ప్పటిలానే ‘యాత్ర’ 6వ ఎపిసోడ్ కూడా ఒక రైలుని, స్టేషన్లో రైల్వే సిబ్బందినీ, ప్లాట్‌ఫామ్ మీద ప్రయాణీకులని చూపిస్తూ, రైల్వేలందిస్తున్న సేవల గురించి ఒకటి రెండు వ్యాఖ్యలతో ప్రారంభమవుతుంది. తాను దొంగల వెంట పడినప్పుడు, వేణుగోపాల్‌ని వెంబడిస్తున్నవారు అతన్ని లాక్కుపోయారంటూ నాయర్ వాయిస్‌ఓవర్‌లో చెప్తాడు. తమ ప్రయాణంలో ఆ రాత్రికి తాము ఆగ్రా చేరుతామని చెబుతాడు.

టైటిల్స్ ముగియగానే, రైలు ఇటార్సీ స్టేషన్‌లో ఆగుతుంది.

“నేను వేణుగోపాల్ మిస్సింగ్ గురించి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను. మీ శిష్యుడిని తోడు తీసుకువెళ్ళనా? ఇప్పుడే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాం” అని స్వామిజీని నాయర్ అడుగుతాడు.

స్వామీజీ సరేనంటారు. నాయర్, శిష్యుడు కలిసి స్టేషన్ మాస్టర్‌ని కలవడానికి వెళ్ళి, తామొక రిపోర్ట్ రాయడానికి వచ్చామని చెప్తారు. తమ రైల్లో ఒక ప్రయాణీకుడి జాడ తెలియడంలేదని, ఆ మేరకు రిపోర్ట్ చేద్దామని వచ్చామని అంటారు. ఏం జరిగిందో పూర్తిగా చెప్పమంటారు స్టేషన్ మాస్టర్. ముందు స్టేషన్‌కీ, ఈ స్టేషన్‌కీ మధ్యన రాత్రి దొంగతనానికి ప్రయత్నం జరిగినప్పుడు ఎవరో ఇద్దరు వేణుగోపాల్‌ని ఎత్తుకుపోవడం గురించి, వాళ్ళు అతన్ని రేణిగుంట నుంచి వెంబడించడం గురించి చెప్తారు. అయితే కంప్లైంట్ రాసివ్వండి అని స్టేషన్ మాస్టర్ అంటారు. తాను అప్పటికే రాసుకొచ్చిన కంప్లైంట్ పేపర్‌ని ఆయనకి ఇస్తాడు నాయర్. దానిపై సంతకం చేసి ఉన్నా, తన ముందు మళ్ళీ చేయమంటాడు స్టేషన్ మాస్టర్. “వేణుగోపాల్ బ్యాగ్ నా దగ్గరే ఉంది, అది మీ దర్యాప్తులో ఉపయోగపడుతుందనుకుంటే తెచ్చిస్తాను” అంటాడు నాయర్. ఇవ్వమని అంటారు స్టేషన్ మాస్టర్. నేను తెస్తానంటూ శిష్యుడు వెళ్తాడు. అలాగే రేణిగుంట స్టేషన్ మాస్టర్‌కి కూడా సమాచారం అందిస్తే, వాళ్ళ కుటుంబ సభ్యులకు విషయం తెలియజేయచ్చు అని సూచిస్తాడు. తనిచ్చిన ఫిర్యాదులోనే తన చిరునామా ఉందని ఏదైనా అవసరమైతే సంప్రదించవచ్చని చెబుతాడు. ఈలోపు శిష్యుడు వేణుగోపాల్ బ్యాగ్, ఫైల్ తెచ్చి స్టేషన్ మాస్టర్‌కి ఇస్తాడు.

“అతనేమయినా మీ బంధువా” అని అడుగుతారు స్టేషన్ మాస్టర్.

“లేదండీ! రైల్లోనే పరిచయం” అంటాడు నాయర్.

“సరే, నేను పోలీసులకు తెలియజేస్తాను” అంటారు స్టేషన్ మాస్టర్.

ఆయనకి ధన్యవాదాలు తెలిపి రైలెక్కుతారిద్దరూ.

ఇక్కడ ఇద్దరు యువదంపతులు కూపేలోకి ఎక్కుతారు. మరో యువజంట పరిగెత్తుతూ వచ్చి రైలెక్కుతారు.

***

రైలు బయలుదేరుతుంది.

నాయర్, శిష్యుడు వచ్చి కూర్చుంటారు. స్వామిజీ కులాసాగా ఉండడం చూసి శిష్యుడు ‘హమ్మయ్య’ అనుకుంటాడు. “గురువుగారంటే మీకు చాలా అభిమానంలా ఉంది, ఎన్నాళ్ళ నుంచి వీరితో కలిసున్నారు?” అని శిష్యుడిని అడుగుతాడు నాయర్.

“పదేళ్ళ నుంచి స్వామీజీతో ఉంటున్నాను. నా చిన్నప్పుడు వీరి ఆశ్రమానికి తరచూ వెళ్ళేవాడిని” అంటూ తాను ఆయనపట్ల ఎట్లా ఆకర్షితుడయ్యాడో చెప్తాడు శిష్యుడు.

తనకిప్పుడు వారే తల్లీ తండ్రూ గురువు అన్నీ… అని అంటాడు శిష్యుడు. స్వామీజీ లేకపోతే నా పరిస్థితి ఏంటో నాకే తెలియదు అంటాడు.

“నాయనా, రామకృష్ణులంటారు – ఎవరిపట్లనైనా ప్రేమ పెంచుకుంటే, అదెలా ఉండాలంటే తన యజమానురాలి పిల్లల పైన సేవకురాలు పెంచుకునే ప్రేమలా ఉండాలి. ఉద్యోగం వదిలేయనే, బంధం సడలిపోవాలి – అని” స్వామిజీ అంటారు.

“ఇందుకు ఎంతో సాధన కావాలి” అంటాడు శిష్యుడు.

“సాధనదేముంది? అంతా యోగమే…” అంటారు స్వామీజీ.

“యోగమంటే – పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకుని…” అంటూ ఏదో చెప్పబోతాడు నాయర్.

“సొంత లాభం ఆలోచించకుండా, ఇతరుల కోసం చేసేదంతా యోగమే. ఇలా చేసేవారినే కర్మయోగి అని అంటారు” చెప్తారు స్వామీజీ.

“అయితే వేణుగోపాల్‌ని కర్మయోగి అనచ్చా?” అడుగుతాడు నాయర్.

“కొంత వరకూ…” అంటారు స్వామీజీ.

“కొంత వరకే ఎందుకు? తానేం చేయాలనుకున్నాడో వేణుగోపాల్ అది చేసి చూపించాడు. సాధువులు మాత్రం కేవలం మాటలు చెప్తారు…” అంటాడు నాయర్.

శిష్యుడు అభ్యంతరం చెప్తాడు.

“క్షమించండి. స్వామీజీ ఒట్టి మాటలు చెప్పరు. ఆయన ప్రపంచాన్ని చూశారు. ఈయన యువకుడిగా ఉన్నప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీరిని అడవుల గుండా జపాన్ పంపించారు శిక్షణ కోసం… బయల్దేరినప్పుడు 25 మంది ఉంటే, గమ్యం చేరేసరికి ఇద్దరే మిగిలారు. స్వతంత్ర్యం వచ్చాకా అన్నీ వదిలేసి, రామకృష్ణమఠంలో చేరారు. ఎక్కడ వరదలొచ్చినా, కరువొచ్చినా, తుఫాను వచ్చినా మఠం తరపున స్వామీజీ సేవలందించారు” చెప్పాడు శిష్యుడు.

“స్వామీజీ ఐఎన్‌ఎలో పనిచేసారా?”

“అవును”

ముగ్గురూ మౌనంగా ఉండిపోతారు.

***

ఇటార్సీలో రైలెక్కిన జంటలలో ఒక జంట వచ్చి రాహుల్ ఉన్న కూపేలో కూర్చుంటారు. మాటల సందర్భంలో వాళ్ళు ఇంట్లోంచి పారిపోయి వచ్చారని తెలుస్తుంది. వాళ్ళిద్దరూ తమ భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుకుంటారు. రాహుల్  తమ మాటలు వింటున్నాడని ఆమె అతనికి సూచిస్తుంది.

“మీరు పైకెక్కి పడుకుంటే, మేమిద్దరం ఈ రెండు లోయర్ బెర్త్‌లలో పడుకుంటాం, మీకు అభ్యంతరం లేకపోతే..” అడుగుతుందామె.

సరేనంటూ, అతను లేచి బయటకు వస్తాడు.

రాహుల్ ఇలా బయటకు రాగానే, అతను లేచి కూపే తలుపులు మూసేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యా అసలైన సంభాషణ ప్రారంభమవుతుంది. అప్పటిదాక ఎదురుగా ఉన్న రాహుల్ వింటున్నాడని పారిపోయి వస్తున్న ప్రేమికుల్లా నటిస్తారు.

“నేను వద్దన్నా కూపే ఎందుకు బుక్ చేసావ్?” అంటూ ఆమె అతనిపై కోపగించుకుంటుంది.

“నేనేమీ కూపే బుక్ చేయమనలేదు పర్వీన్, వాళ్ళే బుక్ చేశారు” అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడతను

“ఈ ప్రయాణం తొందరగా ముగిస్తే బావుండు. ఇంకా ఇలా ఉండడం నా వల్ల కాదు” అంటుందామె.

“పర్వీన్, అలాంటప్పుడు ఎందుకొచ్చావ్?” అని అడుగుతాడతను.

“అయినా అసలు మనం విడిపోదామని నిర్ణయించుకున్నాకా, మీ నాన్నగారి ముందు ఎందుకు అనవసరంగా కలిసి ఉన్నట్టు నటించడం?” అంటుందామె.

తాను విడిపోదలచలేదంటాడతను. అతనితో కలిసి జీవించలేనంటుంది ఆమె.

“పర్వీన్, మా  నాన్నకి నువ్వంటే ఎంత అభిమానమో నీకు తెలుసుగా? అలాంటప్పుడు ఆయన ఫంక్షన్‌కి నువ్వు రాకపోతే, ఆయన మనసు విరిగిపోతుంది. పైగా ఇలాంటి వేడుకలు ఎప్పుడూ రావు” అంటాడు.

“నువ్వొక్కడివే వెళ్ళొచ్చుగా, పర్వీన్ రాలేకపోయిందని చెప్పొచ్చుగా…” అంటుంది.

వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు కొనసాగుతూనే ఉంటాయి.

వీళ్ళు కూపే తలుపులేసేసుకోడం, ఎంత కొట్టినా తలుపులు తీయకపోవడంతో, రాహుల్ వెళ్ళి బోగీ తలుపు తీసి బయటకు చూస్తూంటాడు. మీనాక్షిని తలచుకుని ఊహల్లో తేలిపోతాడు. తమ వివాహమైనట్టుగా భావించుకుంటాడు.

రైలు ముందుకు సాగుతునే ఉంటుంది.

***

ఓ స్టేషన్‌లో సిబ్బంది పనిచేయడం చూపిస్తారు. నాయర్ వాళ్ళ రైలు అప్పటికే ఆలస్యంగా నడుస్తుంది కాబట్టి, దానికి సిగ్నల్స్ వేసి ఆపద్దని అధికారులు సూచిస్తారు.

***

“మీ పుట్టబోయే పిల్లాడికి ఏం పేరు పెడదామనుకుంటున్నావ్?” మరాఠీ వనిత నీనా గుప్తాని అడుగుతుంది.

“ఆ విషయం మా అత్తగారు చూసుకుంటారు” అంటుంది నీనాగుప్తా.

“అమ్మాయి అయితే? పేర్లు పెట్టడంలో కూడా అత్తగారి…”

“అమ్మాయి అయితే ముందే నేనే చిదిమేస్తాను. అనవసరంగా ఎందుకు పెరిగి పెద్దయి నాలా కష్టాలు అనుభవించడం…”

“తప్పమ్మా! అలా అనకు! ఆడపిల్లలు తల్లిదండ్రుల్ని అబ్బాయిల కంటే ఎక్కువ ఇష్టంగా, బాగా చూసుకుంటారు.”

“కానీ ఏం ప్రయోజనం? పెళ్ళయ్యాకా ఎలాంటివాడొస్తాడో తెలియదు, కష్టాలొస్తాయో, సుఖాలుంటాయో తెలియదు… జీవింతాంతం పుట్టింటికి వెళ్ళడానికి మనసు ఉవ్విళ్ళూరుతూనే ఉంటుంది. అలాంటి బాధ ఎవరికీ వద్దు. నేను నా పాపకి అటువంటి ఇబ్బందులు కలిగించను” అంటుంది నీనాగుప్తా విరక్తిగా.

“నేను మా అమ్మయి శుభని అబ్బాయిలా పెంచాను. తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకునేది. కానీ చాలా బలహీనురాలై పోయింది. మొదటిసారే ఓటమి అంగీకరించింది… లేకుంటే ఇప్పటికీ బ్రతికి ఉండేది…” అంటూ మరాఠీ వనిత కన్నీళ్ళు పెట్టుకుంటుంది.

“మా తప్పు ఉంది. పెళ్ళయిపోయాక, తన పట్ల మాకేమీ బాధ్యత లేదనుకున్నాం. పెళ్ళయి వేరే ఇంటికి వెళ్ళినా, తనకంటూ ఓ అస్తిత్వం ఉంటుందిగా…” అంటాడు మరాఠీ వృద్ధుడు బాధగా.

“పిల్లే లేకుండా పోయాకా, ఈ మాటలెందుకు?” అంటుందామె.

***

ఇక్కడ డ్రామా ట్రూప్ వాళ్ళు నాటకం డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూంటారు. హరీష్ ప్రతీసారి తప్పు చెప్పడమో, డైలాగ్ మరిచిపోవడమో జరుతుతుంది. అతన్ని కాన్‌సన్‌ట్రేట్ చెయ్యమని దర్శకుడు బతిమాలుకుంటాడు. ప్రాంప్టింగ్ ఇచ్చినా నాలుగు లైన్ల డైలాగ్ చెప్పలేకపోతున్నాడని ‘ఇలా అరుణ్’ విసుక్కుంటుంది.

“కానీ నువ్వే కదా అశ్వత్థామ పాత్రని కెడి (హరీష్)తో వేయిద్దామన్నావ్?” అంటాడు దర్శకుడు గుప్తా.

వాళ్ళ మధ్య వాదన జరుగుతుంది. వాదన పెరుగుతుంది. తనకి నటించడం రాదు అంటూ హరీష్ అక్కడ్నించి లేచి తలుపు దగ్గరకి వస్తాడు. తలుపు తీసి బయటకు చూస్తూ నిలుచుంటాడు.

***

కెమెరా రాహుల్ వైపు మళ్ళుతుంది. బోగీ తలుపు దగ్గరున్న రాహుల్ తనలో తాను కవిత్వం చెప్పుకుంటూంటాడు. ఈలోపు మైకంలో ఉన్న హరీష్ రైల్లోంచి కిందపడిపోవడం చూస్తాడు. “బండి ఆపండి, రైల్లోంచి ఎవరో పడిపోయారు” అని అరుస్తాడు. చైన్ లాగుతాడు. అదే సమయంలో డ్రామూ ట్రూప్ వాళ్ళు కూడా హరీష్ పడిపోయాడన్న సంగతి గమనించి లేచి తలుపుల దగ్గరికి వస్తారు. రైలు కొంచెం ముందుకు వెళ్ళి ఆగుతుంది.

రాహుల్ దిగగానే, గార్డు వస్తాడు. సెకండ్ క్లాస్ బోగీ నుంచి ఎవరో పడిపోయారు అంటూ గార్డ్‌కి చెప్తాడు. ఇద్దరూ ముందుకు నడుస్తూంటే డ్రామా ట్రూప్ కూడా కిందకి దిగి హరీష్ కోసం వెతుకుతుంటారు.

కింద పడిన హరీష్‌కి పెద్దగా దెబ్బలేమీ తగలవు. పైకి లేచి నాటకం డైలాగులు చెప్పుకుంటూ పట్టాల మీద నడుస్తుంటాడు. వాళ్ళ వాళ్ళొచ్చి అతన్ని తీసుకుని బోగీలో కూర్చోబెడతారు. తాగున్నాడు, మీ మీద కేసు పెడతానంటాడు గార్డు. ట్రూప్ వాళ్ళు అతి కష్టం మీద ఆయనకు నచ్చజెప్తారు. మళ్ళీ అందరూ రైలెక్కుతారు. రైలు గట్టిగా కూతవేసి బయల్దేరుతుంది. ట్రూప్ లోని సభ్యులంతా హరీష్‌ని ఆటపట్టిస్తారు. ఇంక తాగుడు మానేస్తానంటాడు హరీష్. అందరూ చప్పట్లు కొట్టి సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.

***

జరిగిన ఘటనలన్నీ తన డైరీలో రాసుకుంటుంటాడు నాయర్. అతనికి తన భార్య గుర్తొస్తొంది. రాత్రి వంటకి సిద్ధం చేసుకుంటోందో లేక షాపింగ్‌కి వెళ్ళిందో అనుకుంటాడు.

***

నీనాగుప్తా తన సీట్లోంచి నెమ్మదిగా లేచి మరాఠీ వనిత పక్కన కూర్చుంటుంది. “అమ్మా, మీరు వైష్ణోదేవి మందిరానికి వెళ్తున్నారు కదా, మీకేమీ ఇబ్బంది లేకపోతే, నా తరఫున అమ్మవారి గుడిలో ఈ పదకొండు రూపాయలు దక్షిణ వేయండి” అంటుంది.

“మగపిల్లాడు పుడితే… ఏ సమస్య ఉండదూ…” అంటూ దుఃఖిస్తుంది. మరాఠీ వనిత ఆమెను దగ్గర తీసుకుని ఓదారుస్తుంది.

***

డ్రామూ ట్రూప్ రిహార్సల్ చేస్తుంటుంది. హరీష్ తన డైలాగ్స్ అద్భుతంగా చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయి అతన్ని అభినందిస్తారు. మిగతా ప్రయాణీకులు కూడా మెచ్చుకోలుగా చూస్తూండంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.

***

బంధం తెంపుకోవాలని భార్య అనుకుంటుంటే, దాన్ని నిలుపుకోవలనుకునే భర్త – తన తండ్రి ఇంట జరిగే ఓ వేడుకకి భార్యని బలవంతంగా ఒప్పించి తీసుకెళ్ళడం… రాజీకి ప్రయత్నించడం… ఇలాంటివి ఘటనలు మనక్కూడా ఏదో ఒక ప్రయాణంలో తారసపడేవే. ఆవేశాన్ని విడనాడి ఆలోచనల తోడు తీసుకుంటే మనసు విప్పి మాట్లాడుకుంటే ఏ బంధమైనా పదికాలాలు నిలుస్తుంది.

మద్యం వల్ల కలిగిన ప్రమాదంతో దాని దుష్పరిణామాలు గ్రహించి తమంతట తామే మద్యం మానేసిన వారు ఉన్నారు. అలాంటి వారిలో అప్పటిదాక నిబిడీకృతమైన ఉన్న శక్తి బయల్పడుతుంది. తమకి తాము మేలుచేసుకోవడమే కాక, సామాజికంగా ఔన్నత్యానికి చేరే అవకాశాలు పొందుతారు.

“If you’re waiting for the train of your life and not getting on another train, you’re making a big mistake because almost always other trains will take you to that special train!” అన్న Mehmet Murat Ildan మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇక్కడ ఆపుదాం.

***

ఈ ఆరవ ఎపిసోడ్‌ని ఇక్కడ చూడచ్చు.

ఏడవ ఎపిసోడ్‌ తదుపరి సంచికలో!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here