‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-8

0
6

[dropcap]ఎ[/dropcap]ప్పటిలానే ‘యాత్ర’ 8వ ఎపిసోడ్ కూడా ఒక రైలుని, స్టేషన్లో రైల్వే సిబ్బందినీ, ప్లాట్‌ఫామ్ మీద ప్రయాణీకులని చూపిస్తూ, రైల్వేలందిస్తున్న సేవల గురించి ఒకటి రెండు వ్యాఖ్యలతో ప్రారంభమవుతుంది.

టైటిల్స్ పూర్తయ్యేసరికి రైలు జలంధర్ స్టేషన్‌లో ప్రవేశిస్తుంది. ప్లాట్‌ఫాం మీద నీనాగుప్తా తల్లిదండ్రులు ఎదురుచూస్తుంటారు. బండి ఆగంగానే నీనాగుప్తాని స్ట్రెచర్ మీద కిందకి దింపుతారు. పురుడు పోసిన డాక్టరు బిడ్డని ఎత్తుకుని దిగుతారు. నీనా గుప్తాని స్ట్రెచర్ మీద చూడగానే మొదట కంగారు పడినా, ప్రసవం అయిపోయిందని తెలిసి కుదుటపడ్తారు. తల్లీ బిడ్డలని వెంటనే హాస్పిటల్‍లో చూపించమని డాక్టర్ వారికి సలహా ఇస్తుంది. నీనాకి సాయం చేసిన అందరికీ ఆమె తల్లిదండ్రులు ధన్యవాదాలు చెప్తారు. రైలు బయల్దేరుతుంది.

***

మరాఠీ వృద్ధుడు భక్తి గీతాలు పాడుకుంటాడు. అతని భార్య దిగులుగా వుంటుంది. శిష్యుడు కూడా శ్రద్ధగా వింటుంటాడు. నాయర్ కూడా వచ్చి కూర్చుంటాడు. స్వామీజీకి ఎగశ్వాస వస్తూంటుంది.

***

పెళ్ళికి వెళ్తున్న పంజాబీ బృందంలోని పెద్ద పేరిట ఒక టెలిగ్రామ్ వస్తుంది. అందులో కాబోయే పెళ్ళి కూతురికి ఇది వరకే పెళ్ళయిందని, ఈ పెళ్ళి రద్దు చేసుకోమని సందేశం ఉంటుంది. అందరూ ఆందోళన చెందుతుంటే పెళ్ళికొడుకు తాపీగా ఉంటాడు. తల్లేమో ‘జమ్మూ వెళ్ళద్దు, పఠాన్‌కోట్‌లో దిగిపోదాం’ అంటుంది. పెళ్ళికొడుకుకి మాత్రం ఆమెకి ఇదివరకే పెళ్ళయిందని తెలుసట. ‘చేసుకునేది నేను కదా, మీకేంటి ఇబ్బంది’ అంటాడు బంధువులతో. ‘తెలిసీ తెలియని వయసులో పొరుగింటి అబ్బాయితో బలవంతపు పెళ్ళి అయింది, కొన్ని రోజుల తర్వాత కోర్టు ఆ పెళ్ళిని రద్దు చేసింది… ఇందులో ఆమె తప్పేం ఉంది’ అంటాడు. ‘ఆ అమ్మాయి నా కోడలు కావడం నాకిష్టం లేదు. నేను జనాలకి మొహం ఎలా చూపించను’ అంటుంది తల్లి. కొడుకు పట్టుదల చూసి, నిస్సహాయంగా ఉండిపోతుంది.

***

ప్రయాణమంటే సంతోషాలూ ఉత్సాహాలతో పాటూ సమస్యలూ ఇబ్బందులు కూడా ఉంటాయి. మనిషి జీవితంలో అన్ని ఘటనలు – బాధ అయినా, దుఃఖం అయినా, ఉల్లాసం అయినా, సంతోషం అయినా ప్రయాణంలో మనిషి తోడుంటాయి. ఒక్కోసారి మనిషికంటే అవే ముందుంటాయి కూడా. జీవితమే ఒక ప్రయాణమైనప్పుడు – ఉద్వేగాలని ప్రయాణం నుంచి విడదీసి చూడలేం కదా! అవీ ప్రయాణంలో భాగమైపోతాయి. అలాంటి భావోద్వేగాలు ఈ ‘యాత్ర’లో అనేకం!!

***

స్వామీజీ కేసి బెంగగా చూస్తుంటారు శిష్యుడూ, నాయర్.

“నిశ్చింతగా ఉండు నాయనా, హిమాలయాలు దర్శించాకే, వీడ్కోలు చెబుతా” అంటారు స్వామీజీ నాయర్‌తో.

“స్వామీజీ, నేను కూడా మీతో హిమాలయాలకి వచ్చేవాడినే, కానీ రేపొద్దున్న నేను జమ్మూలో డ్యూటీకి రిపోర్ట్ చెయ్యాలి”

“పైగా వేణుగోపాల్ గురించి విచారణ చేయాలి” అందిస్తాడు శిష్యుడు.

“నాయనా ఇక ముందు మన దారులు వేరవుతాయి. నీకో మాట చెబుతాను గుర్తుంచుకో. ప్రశంసలని ఆశించి పిరికివాళ్ళు కూడా వీరత్వం ప్రదర్శిస్తారు. కాని అది నిజమైన వీరత్వం కాదు” చెబుతారు స్వామీజీ నాయర్‌తో.

“మీతో కలిసి ప్రయాణం చేయడం మాకెంతో ఉపకరించింది” అంటాడు శిష్యుడు.

“నాకూ కూడా. నిజంగానే స్వామీజీతో ఇంకా ప్రయాణం చేయాలని ఉంది. కానీ… డ్యూటీలో చేరాలి” అంటాడు నాయర్.

“మీరేం కంగారు పడకండి. అంతా నేను చూసుకుంటాను” అంటాడు శిష్యుడు.

“నా యాత్ర ముగిసిపోవచ్చింది” అంటారు స్వామీజీ. అందరం ఏదో ఒకనాడు మట్టిలో కలిసిపోవలసివాళ్ళమేనని అంటూ, మానవ జీవితపు ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటో గ్రహించి దాన్ని సాధించేందుకు కృషి చేయాలని అంటారు స్వామీజీ.

***

స్వామీజీ వాళ్ళు దిగాల్సిన స్టేషన్ వస్తుంది. శిష్యుడు నాయర్ సాయం పట్టి స్వామీజీని దింపుతారు.

“ఇంకా పూర్తిగా తెల్లవారలేదు, మీ తర్వాతి బండికి ఇంకో గంటపైగా ఎదురు చూడాలి” అని స్వామీజీతో చెప్పి, నాయర్ వారి వద్ద వీడ్కోలు తీసుకుంటాడు.

***

రైలు పఠాన్‌కోట్ దాటుతుంది. ముందుకు సాగి జమ్మూ తావీ చేరుతుంది. అందరూ దిగుతారు.

డాక్టర్ గారూ, ఆవిడ భర్తా దిగగానే, మరాఠీ దంపతులు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తారు. ఇంతలో నాయర్ అక్కడి వచ్చి, డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తాడు. వాళ్ళకి వీడ్కోలు పలికి డాక్టర్ దంపతులు అక్కడ్నించి కదులుతారు. ఈ ఊర్లో ఏయే ఆలయాలు ఉన్నాయి చూడ్డానికి అని మరాఠీ దంపతులు నాయర్‌ని అడుగుతారు. వాళ్ళకి కావల్సిన వివరాలు చెప్పి నాయర్ వాళ్ళ దగ్గర సెలవు తీసుకుంటాడు.

పంజాబీ పెళ్ళి బృందానికి వియ్యాలవారు వచ్చి స్వాగతం పలుకుతారు.

ఇంతలో పెళ్ళి కొడుకు తల్లి – విషయం నిర్ధారించుకోమని భర్తని ఒత్తిడి చేస్తుంది. ఆయన పెళ్ళి కూతురి తండ్రిని పక్కకి తీసుకెళ్ళి అడగుతాడు. పెళ్ళికొడుకు తల్లి గట్టిగా అరుస్తుంది. “మీ అబ్బాయి, మా అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్ళే పెళ్ళి చేసుకుందామనుకున్నారు. ఈ పెళ్ళి మా ఇష్టంతో జరగడంలేదు” అంటుది పెళ్ళికూతురి తల్లి. అయినా పెళ్ళికొడుకు తల్లి వినదు. గోల చేస్తూంటుంది. పెళ్ళి కొడుకు స్నేహితులో ఒకరు, ఇప్పటి సుప్రసిద్ధ నటుడు అయిన ఆశీష్ విద్యార్థి – “నువ్వే ఇక నిర్ణయం తీసుకోవాలి. పెళ్ళి చేసుకోవాలనుకుంటే, నువ్వు పెళ్ళివారింటికి పద” అంటూ పెళ్ళికొడుకుకి చెప్తాడు. “మీ ఇష్టం ఉంటే నాతో పెళ్ళివారింటికి రండి, లేకపోతే ఢిల్లీ వెళ్ళిపొండి” అని తల్లిదండ్రులతో అనేసి పెళ్ళికొడుకు, తన స్నేహితులతో పెళ్ళివారితో నడుస్తాడు

***

తెల్లవారుతుంది. స్టేషన్‌లో ఉన్న ఆర్మీ అధికారిని కలిసి రిపోర్ట్ చేస్తాడు నాయర్. అతని యూనిట్ ప్రస్తుతం రాజస్థాన్‌ కేంప్‌కి వెడుతోందని, సాయంత్రం కలిస్తే ఏ రైల్లో వెళ్ళాలో చెప్తానని అధికారి అంటారు.

అలాగేనని నాయర్ బయటకొచ్చి జమ్మూతావీ స్టేషన్ మాస్టర్‌ని కలుస్తాడు. వేణుగోపాల్ గురించి వాకబు చేస్తాడు. ఇంకా ఏ సమాచారం రాలేదంటారు. “ఈ వేణుగోపాల్ ఎవరు? ఈ పేరు బాగా వినబడుతోంది?” అని అడుగుతారు. ” గొప్ప వ్యక్తి కాదు కానీ మంచివాడు” అని సమాధానం చెప్పి, తన చిరునామా చెప్పి, ఏదైనా సమాచారం తెలిస్తే, తనకి ఓ పోస్ట్ కార్డు వ్రాయమని చెప్పి బయటికొస్తాడు నాయర్.

***

డాక్టరు గారు, ఆమె భర్త – అతని తండ్రిని చూడ్డానికి వస్తారు. ఇద్దరూ ఆయన్ని గౌరవంగా పలకరిస్తారు. ‘సాల్‌గిరా’ (పుట్టినరోజు) శుభాకాంక్షలు చెబుతారు.

“మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారా?” అని ఆయన కొడుకుని అడుగుతారు. ఔనంటాడు కొడుకు. ఆయన అదేమాటను కోడలిని అడుగుతారు. మేం చక్కగా ఉన్నాం అంటుందామె.

ముసలాయన ముఖంలో సంతృప్తి కనబడుతుంది.

***

మరాఠీ దంపతులు జమ్మూలోని ఆలయాలు దర్శించుకుంటారు. అక్కడి ప్రశాంతత చూసి ఇంకొన్ని రోజులు అక్కడే ఉందామా? అని భార్యని అడుగుతాడు. ఇంటికి వెళ్ళిపోదాం అంటుందావిడ. నీనా గుప్తాలో తమ కూతురుని చూసుకుందావిడ. ఆ మాటే భర్తతో అంటుంది. జీవితంలో అయన గాయాలకు కాలమే చక్కని మందు అంటాడాయన. ఇలాంటి ఘటనలు కాస్త ఓదార్పునిస్తాయంటాడు.

“కాలం గాయాలు మాన్పినా, జరిగిన నష్టం పూడ్చదు కదా” అంటుందావిడ.

“అయితే ఏం చేస్తావు?”

“నేను ఊరుకోను. గొంతెత్తి ప్రశ్నిస్తాను. నాలాగా అన్యాయమైపోయిన తల్లులెందరో ఉంటారు. వారందరినీ కలుపుకుంటాను… పదండి వెడదాం” అంటుంది.

ఇద్దరు అక్కడ్నించి కదులుతారు.

***

నాయర్ ప్లాట్‌ఫామ్ మీద ఎదురుచూస్తుంటాడు. స్వామీజీ ఇచ్చిన వివేకానంద జీవిత చరిత్ర చదువుతూంటాడు. స్వామీజీ  హిమాలయాలకు చేరుకున్నారో లేదో అని అనుకుంటాడు.

***

కెమెరా మరో రైలుని చూపిస్తుంది. ఆ బండి హిమాలయాల దగ్గర నుంచి వెళ్తుంటుంది. దానిలో స్వామీజీ, వారి శిష్యుడు కూర్చుని కనబడతారు. స్వామీజీ హిమాలయాలను తన్మయత్వంతో చూస్తుంటారు. నెమ్మదిగా తల వాల్చేస్తారు.

హిమాలయాలకి సమీపంలోనే స్వామీజీ చితికి నిప్పంటిస్తాడు శిష్యుడు.

ఈ ప్రపంచంలో ఒక జీవి ప్రయాణం ముగిసింది.

***

కలుస్తూండడం, విడిపోతుండడం – మళ్ళీ ఎప్పుడైనా కలవడం – ఇదే ప్రయాణాల లక్షణం! కొందరిని వెంటనే మర్చిపోతాం, మరికొందరిని కలకాలం గుర్తుంచుకుంటాం. మన అందరి నిజ జీవిత ప్రయాణాల్లో అనుభవమయ్యే వాస్తవం ఇదే.

ప్రయాణాలలో మనతో పాటు ప్రయాణించేవారు వారి వారి స్టేషన్‍లలో దిగిపోతారు. కొందరు మనతో చివరి స్టేషన్ వరకూ వస్తారు. అక్కడి నుంచి దారులు వేరవుతాయి. అయితే భౌతిక ప్రయాణమైనా, ఆధ్యాత్మిక ప్రయాణమైనా కడకంటూ ఉండేది మనతో మనమే. అందుకే నిరుత్సాహం, కలతలు, దిగుళ్ళను పారద్రోలి నిత్యోత్సాహి వలె ఉల్లాసంగా ఉంటే జీవన యాత్రను ఆహ్లాదకరం చేసుకోవచ్చు.

“We are the train and the tracks are the path our lives follow. In control at dispatch is God, and He is overseeing each of our movements and coordinating what happens” అన్న Joshua Robinson మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇక్కడ ఆపుదాం.

***

ఈ 8వ ఎపిసోడ్‌ని ఇక్కడ చూడచ్చు.

తొమ్మిదవ ఎపిసోడ్‌ తదుపరి సంచికలో!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here