‘రఫీ ఒక ప్రేమ పత్రం’ – పుస్తక సమీక్ష-3

2
9

[dropcap]మృ[/dropcap]ణాళిని రచించిన ’రఫీ ఒక ప్రేమపత్రం’ పుస్తకం చివరలో రెండు అనుబంధాలున్నాయి. మొదటి అనుబంధం 195వ పేజీ నుంచి 242వ పేజీవరకూ ’చిత్రమాలిక’. రఫీ ఫోటోలు ఉన్నాయి. అయితే ఆ ఫోటోలు అధికం ఇంటర్నెట్‍లో చలామణిలో ఉన్నవే. రెండవ అనుబంధం ’పాటలతోట’ “రఫీ గానంలోని వైవిధ్యాన్ని, అతని మనోధర్మాన్ని, అతని గాన వైశిష్ట్యాన్నిఎత్తి చూపేందుకు ఏవో కొన్ని మచ్చు తునకల్ని కేవలం ఉదహరణగా చూపించాలని తాపత్రయం” అని రచయిత్రి ఈ అనుబంధానికి వివరణ ఇచ్చారు. దీనిలో ప్రణయ గీతాలు, ఉత్సాహభరిత గీతాలు, విషాధ, తాత్విక గీతాలు, భక్తి (దైవ, దేశ) గీతాలు, అరుదైన గీతాలు అనే అయిదు శీర్షికల క్రింద రఫీ పాటలు కొన్నింటి పరిచయం ఈ అనుబంధంలో ఉంది. వర్గీకరణ ఇంకొంత జాగ్రత్తగా ఆలోచించి, రఫీ పాడిన విభిన్నమైన పాటలను పరిగణలోకి తీసుకుని చేసి ఉండాల్సింది. అలాగే పాటల ఎంపికలోనూ ఒక ప్రణాళిక ఉన్నట్టు అనిపించదు. కానీ రఫీ పాడిన ప్రతిపాట అత్యద్భుతమే. కాబట్టి పాటల ఎంపికలో ఎంత అసంతృప్తి ఉన్నా లేని పాటలను ప్రస్తావనను వదలి ఎంపికను అలాగే స్వీకరించాల్సి ఉంటుంది. రఫీ పాడిన ప్రతిపాట ఫేవరెట్ పాట. కాబట్టి అందరినీ సంతృప్తిపరచాలంటే అన్నిపాటలు ఎంచుకోవాల్సి ఉంటుంది. అయినా సంతృప్తి కలగదు. కానీ ఎంచుకున్న పాటల వివరణ విషయంలో అసంతృప్తి ప్రకటించాల్సి ఉంటుంది.

ఈ అనుబంధంలో పాటలను పూర్తిగా ఇవ్వకుండా ఒకటో రెండో చరణం ఇచ్చి వదిలేయటం బాగాలేదు. ఎందుకని పాటను సగమే ఇచ్చారో, ఎందుకని ఇంకో పాటని పూర్తిగా ఇచ్చారో తెలియదు. ఎందుకంటే ప్రతి పాటనూ ఒక పేజీలో పూర్తిచేయాలన్న నియమం ఉన్నట్టు లేదు. పాటల వివరణ కూడా పాట అర్థాన్ని చెప్పటమో, చిత్రీకరణలో గొప్పతనం చెప్పటమో, పాట సందర్భం వివరించటమోగా లేదు. ఒక uniformity లేదు. పాటలు పూర్తిగా ఇవ్వకుండా క్రింద సినిమా బొమ్మ పెట్టటం అర్థం లేనిది. రఫీ అంటేనే పాట. పాటకు ప్రాధాన్యం తప్ప సినిమా బొమ్మలకు కాదు. అలాగే ‘అరుదైన సినిమా పాటలు’లో అరుదుగా వినిపించేవి, అప్రసిద్దుల మేలైన కల్పనలు కొన్ని పొందుపరిచారు. అయితే ‘యే హస్రత్ థీ, ‘ముఝే లే చలో’, ‘గమే హస్తీసే’, ‘లగ్‍తా నహీ దిల్ హై’, ‘లాల్ లాల్ గాల్’, ‘అజ్ ఇస్ దర్జ పిలాదో’ వంటి ఈ విభాగంలో ఎంపికయిన పాటలు అపురూపమైనవి, కానీ అరుదైనవి కావు. ఈ పాటలను రూపొందించిన సంగీత దర్శకులు అప్రసిద్దులూ కారు.

మహమ్మద్ రఫీ గురించి హిందీలో, ఇంగ్లీషులో బోలెడన్ని పుస్తకాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. కానీ అనిరుద్ భట్టాచార్య, బాలాజీ విఠల్‍లు రఫీ గురించి వచ్చిన పుస్తకాల గురించి రాస్తూ ‘The definitive biography on the gentleman artist whom everybody loved to love is waiting to be written’ అని వ్యాఖ్యానించారు. ఇది నిజం. ‘రఫీ ఒక ప్రేమ పత్రం’ కూడా ఈ లోటును పూడ్చదు.

రఫీపై వచ్చిన పుస్తకాలన్నీ రఫీనీ ఆరాధిస్తూనో, అభిమానిస్తూనో వచ్చినవే తప్ప రఫీ గాన సంవిధానాన్ని విశ్లేషిస్తూ, హిందీ సినీగేయ ప్రపంచంలోని ఇతర గాయకులతో పోలుస్తూ రఫీ స్థానాన్ని నిర్ణయించే పుస్తకం ఒక్కటి కూడా రాలేదు. ఈ లోటును రఫీ ఒక ప్రేమపత్రం కూడా తీర్చదు. ఎందుకంటే, ఈ పుస్తకంలో రచయిత్రి స్వీయ విశ్లేషణ ఎక్కడా కనబడదు. అక్కడక్కడా రచయిత్రి కొన్ని వ్యాఖ్యాలు చేసినా అవి అవగాహనా రాహిత్యాన్ని ప్రదర్శిస్తాయి. లోతైన అధ్యయన రాహిత్యాన్ని స్పష్టం చేస్తాయి. పైగా ఆంగ్లంలోని పుస్తకాలను ఆంగ్ల పుస్తకాలలో ఉన్న అంశాలను యధా తధంగా తెలుగులో అందించటంవల్ల , అనుసరించటం వల్ల ఆయా పుస్తకాలలో ఉన్న దోషాలు కూడా తెలుగులోకి వచ్చాయి. ఎలాగయితే ఆంగ్ల పుస్తకాలలో వున్నదంతా నిజమనుకుని తెలుగులో చేర్చారో, అలాగే సరయిన విమర్శలేకపోతే తెలుగులో వున్న తప్పులనే నిజమని అమాయక పాఠకులేకాదు అకాడెమీషియన్లూ, రేసెర్చి స్కాలర్లూ, జర్నలిస్టులూ భావించేవీలుంది.

ముందుమాటలో రచయిత్రి ప్రధానంగా తాను సంప్రదించిన అయిదు పుస్తకాల పేర్లు ప్రస్తావించారు. కానీ అధికశాతం సమాచారాన్ని సుజాతాదేవ్ పుస్తకం నుంచి, రాజుకార్తి, ధీరేంద్రజైన్‍ల పుస్తకం నుంచి గ్రహించారు. ఈ విషయగ్రహణ ఒకోసారి స్వేచ్ఛానువాదంలా కూడా తోస్తుంది. ఉదాహరణకు నౌషాద్ సంగీతంలో కోరస్ వాడకానికి ఉదహరణగా ‘ఉడాన్ ఖటోలా’ చిత్రంలో ‘ఓ దూర్‍కే ముసాఫిర్’, ‘మదర్ ఇండియా’లో ‘దుఛ్ ఛర్ చిన్ చిఛడే భయ్యా’ రామ్ ఔర్ శ్యామ్ లో ‘ఆయిహై బహారే’ (పేజి 35) పాటలను చూపుతుంది తెలుగు పుస్తకం.

The point is well illustrated in the songs ‘o door  ke musafir (udan khatola, 1955) Dukh bhare din beetere bhayya (Mother india 1957) aayi hain behaare (Ram and shyam, 1967) (mohammed rafi, golden voice & the silver screen by sujatha dev Page No.40) అంటుంది ఇంగ్లీషు పుస్తకం (తెలుగులో రామ్ ఔర్ శ్యామ్ పాటలోని తప్పును గమనించండి) నిజానికి రామ్ ఔర్ శ్యామ్ పాటకన్న కోరస్‍ను అత్యద్భుతంగా వాడింది (వందమంది పైగా) మొఘల్ – ఎ – అజమ్‍లోని ‘జిందాబాద్ – ఎయ్ – మొహబ్బత్ జిందాబాద్’ పాటలో. ..దుఖ్ భరె దిన్ పాట కూడా కోరస్ వాడకం పరంగా సాధారణమైన పాట. ఇంగ్లీషు పుస్తకంలోని లోపం తెలుగులోకి అలాగే తర్జుమా అయింది. పాట మాత్రం పొరపాటుగా అయింది. సుజాతాదేవ్ పుస్తకంలో రాజ్ ఖోస్లా, చేతన్ ఆనంద్ వంటి వారి ప్రసక్తి రాదు. తెలుగులో కూడా రాలేదు. అలాగే సుజాతాదేవ్ పుస్తకంలో వివాదాలు, సినిమా సంగీత రంగంలోని రాజకీయాల ప్రసక్తి లేదు. తెలుగులోనూ లేదు. సుజాతాదేవ్ పుస్తకంలో అధ్యాయాలు హిందీలో చౌధరీ జియా ఇమామ్ పుస్తకం ‘పయంబర్ – ఎ – మౌసికీ మహమ్మద్ రఫీ’ అన్న పుస్తకాన్ని అనుసరించి ఉంటాయి. తెలుగులో కూడా అంతే. సుజాతాదేవ్ పుస్తకంలో సినీగీతానికి సంబంధించిన సాంకేతిక వివరాలు లేవు. తెలుగులో కూడా లేవు. రాజుకార్తి, ధీరేంద్రజైన్‍ల పుస్తకం ‘Mohammad Rafi’ ‘God’s Own Voice’ పుస్తకంలో ప్రస్తావించిన అనేక సంఘటనలకు ఆధారాలు లేవు. సి. రామచంద్ర ‘లతా మంచి గాయనే కానీ, రఫీ చాలా గొప్ప గాయకుడు’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడట (పేజీ 77) అన్నదానికి ఆధారం రాజు కార్తి, ధీరేంద్రజైన్‍ల పుస్తకం. కానీ సి. రామచంద్ర అలా అన్నట్టు ఆధారాలు లేవు. ఆ పుస్తకంలోనూ ఇవ్వలేదు. అలాగే ఎస్డీబర్మన్ మన్నాడేతో ‘ఉత్తమ శాస్త్రీయ సంగీత గాయకుడు బాంద్రాలో ఉన్నాడ’ని రఫీ గురించి అన్నట్టు కూడా ఆధారాలు లేవు. ఎస్డీబర్మన్‍కు మన్నాడే శాస్త్రీయ సంగీత ప్రావీణ్యం తెలుసు. కాబట్టి మన్నా డే కన్నా రఫీకి శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం అధికం అని ఎస్డీ బర్మన్ అనలేడు. అనేవాడే అయితే, పూచోన కైసే, తేరె నైన తలాష్ కర్ వంటి క్లిష్టమయిన శాస్త్రీయ సంగీత ఆధారిత పాతలకు మన్నాడేను ప్రత్యేకంగా ఎంచుకునేవాడు కాదు.. కాబట్టి అలాగ అనే వీలులేదు. అలా అన్నట్టు ఇంగ్లీషు పుస్తకం ఆధారాలు చూపదు. తెలుగు పుస్తకం కూడా. ఇలా తెలుగు పుస్తకంలో ఏ అంశం ఏ ఇంగ్లీషు పుస్తకాన్నుంచి గ్రహించారు, ఇంగ్లీషు పుస్తకాల్లోని లోపాలు వివరిస్తూ పోతే, ఒక పుస్తక సమీక్ష మూడుపుస్తకాల పరిమాణమవుతుంది. కాబట్టి ఈ పోలికలింతటితో స్వస్తి. ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.

హిందీ పుస్తకాలు దేశమంతా అమ్ముడవుతాయి. ఇంగ్లీషు పుస్తకాలు ప్రపంచమంతా అమ్ముడవుతాయి. ఇంగ్లీషులో రాసే రచయితలు పరిశోధిస్తారు. పైగా రచయితలు సినీప్రముఖులకు దగ్గరగా ఉండే వీలుండటంతో వారు ప్రముఖులను కలుస్తారు. ఇంటర్వ్యూలు చేస్తారు. విషయాలను సేకరిస్తారు. ఉదాహరణకు, సుజాతా దేవ్ పుస్తకంతో పాటు రచయిత్రి ప్రముఖులను చేసిన ఇంటర్వ్యూల ముక్కలు కలిపి 45నిమిషాలు సి.డి కూడా ఇచ్చారు. తెలుగులో రచయితలకు అంతగా పరిశోధన చేసే వీలులేదు. ఇంటర్వ్యూలు చేసి, సినీ ప్రముఖుల నుంచి విషయ సేకరణ చేసే వీలులేదు. అవకాశాలు కూడా తక్కువ. కాబట్టి తెలుగు రచయితలు తాము ఎంచుకున్న అంశం గురించి స్వయంగా పరిశోధించి తెలుసుకునే బదులు, ఇతరుల పరిశోధనలను అధ్యయనం చేసి, విశ్లేషించి, స్వయం బుద్ధిని ఉపయోగించి ఆ అంశాలను తన అవగాహనతో, సృజనాత్మకంగా తెలుగు పాఠకులకు అందించాల్సి ఉంటుంది. అప్పుడే ఇతర పుస్తకాల నుంచి విషయ సంగ్రహణ చేసినా, తెలుగు పుస్తకం తనదైన ప్రత్యేకతను సంతరించుకుంటుంది. లేకపోతే, ఆంగ్ల పుస్తకాల్లోని పొరపాట్లతో పాటుగా, తెలుగు రచయిత అవగాహన దోషాలు అధ్యయన లోపాలు కూడా పుస్తకంలో జతగూడుతాయి. ఏమీ తెలియని వారు ‘ఎన్ని పాటలను ఎలా సేకరించారో? అని అమాయక వందిమాగధ గణ భజనబృదాలు ఆశ్చర్యపోవచ్చేమోకానీ, ఏ కాస్తయినా తెలిసిన వారు విముఖులవుతారు. తెలుగు పుస్తకాలపై ఉండే చులకన అభిప్రాయాన్ని మరింత పెంచుకుంటారు. మృణాళిని రచించిన ‘రఫీ ఒక ప్రేమ పత్రం’ కూడా అందుకే తీవ్రమైన నిరాశ నిస్పృహలను కలిగిస్తుంది. తెలుగు పాఠకులను తేలికగా తీసుకోవడం, ఒరిజినల్ పుస్తకాలను ఎవరు చదువుతారన్న ధీమాను ప్రదర్శించటం, హిందీ పాటలను ఉదహరిస్తున్నప్పుడు కనీసపు జాగ్రత్తలను పాటించక పోవటం , తీర్మానాలు చేసేటపుడు, ఎలాంటి ఆధారాలు, అధ్యయనం లేకుండా ఏం తోస్తే అది ఒక్కక్షణం కూడా ఆగి ఆలోచించకుండా రాసేయటం వంటివి రచయితకు ఎలాగో శోభనివ్వవు కానీ ఎంతో పేరుండి, గౌరవ మన్ననలందుకుంటూ, ఉత్తమ స్థాయి రచయిత్రిగా పరిగణనకు గురయ్యే రచయిత్రి పుస్తకమే ఇలా ఉంటే, ఇక మామూలు రచయితల పుస్తకాలు ఇంకెంత ఘోరంగా ఉంటాయోనన్న అభిప్రాయం సామాన్య పాఠకుడిలో కలిగిస్తే పాఠకుడి తప్పు కాదు. దానికి తెలుగు రచయితలే బాధ్యులు.

‘రఫీ – ఒక ప్రేమ పత్రం’ పుస్తకం అచ్చు అక్షరం ప్రాధాన్యం స్పష్టం చేస్తుంది. అచ్చయిన అక్షరాన్ని ప్రామాణికంగా భావిస్తారు. దాన్ని ప్రామాణికంగా భావించి ఇతరులు తమ రచనల్లో ఉదహరిస్తారు. దాన్ని అనుకరిస్తారు. ‘ఇతర భాషల్లోకి అనువదిస్తారు’. ఇలా ఒక పొరపాటు ఎంతగా విస్తరిసుందంటే కొన్నాళ్ళకి పొరపాటు ‘సత్యం’గా చలామణీ అవుతుంది. అసలు నిజం మరుగున పడిపోతుంది. అచ్చు అక్షరానికి ఉన్న శక్తి అది. రచయితలు అచ్చు అక్షరం శక్తిని అర్థం చేసుకోవాలి. ఈనాడు తాము రాస్తున్నది. భవిష్యత్తు తరాలకు ప్రామాణికం అవుతుందన్న నిజాన్ని గ్రహించాలి. ముఖ్యంగా పేరు, స్థాయి, పలుకుబడి, వందిమాగధ గణాలు, భజన బృందాలు ఉన్న రచయితలు రాసేది ప్రామాణికమయ్యే వీలు అధికంగా ఉంటుంది. పైగా తెలుగులో సరైన విమర్శ వ్యవస్థ లేదు. ఆయా అంశాలలో నిపుణులను వెతికి వారితో పుస్తకాలను విశ్లేషింపచేసే ఆరోగ్యకరమైన అలవాటు తెలుగు పత్రికలకు లేదు. నిజానికి తెలుగు సాహిత్య ప్రపంచంలో ‘ఎక్స్‌పర్ట్స్’ వ్యవస్థ లేనేలేదు. మనకు పరిచయమైన వాడు, అక్షరాలు కలిపి రాయగల ప్రతివాడు, మనం రాయమన్నట్టు రాసే ప్రతివాడూ ఎక్స్‌పర్టే. అందుకే ఎవరికి వారు తాము రాసిందే తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పేస్తుందని, తమ ముందు, తమ తరువాత తమంతటి వారు లేరని ప్రకటించేస్తున్నారు. వందిమాగధ గణ భజన బృందాలు ఆమోద ముద్ర వేసేస్తున్నాయి. అదే చలామణిలోకి వచ్చి ప్రామాణికం అయిపోతోంది. ఇలాంటి వ్యవస్థలో ఒక పేరున్న రచయిత ఏం రాసినా ప్రామాణికమైపోయే వీలుంటుంది. కాబట్టి ఇకనైనా తెలుగు సాహిత్య ప్రపంచం మేల్కొని అసలైన రచయితలను వారి రచనల ఆధారంగా గుర్తించే ఉద్యమం చేపట్టాల్సి ఉంటుంది. ఈ ఉద్దేశంతోటే ఈ రచనను ఇంత విపులంగా  విశ్లేషించవలసి వచ్చింది. ఈ విశ్లేషణకు కేంద్రం రచన, విమర్శ లక్ష్యం తెలుగు సాహిత్య ప్రపంచంలో ప్రస్తుతం నెలకొని ఉన్న వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపించి, సరియైన ఆలోచన నివ్వటం తప్ప వ్యక్తిగతం కాదు. అర్హత లేనివారు విమర్శకులైతే అర్హతలేని రచనలు అందలాలెక్కుతాయి. ఇది సాహిత్యపరంగా మంచి పరిణామం కాదు. తెలుగు పత్రికలలో సుదీర్ఘము, సునిశితమైన విమర్శలకు తావుండదు. నిజానికి ప్రస్తుతం తెలుగులో రచనను రచనగా చూసే విమర్శకుడులేడు. తెలుగులో విమర్శకుడికి ఎలాంటి అర్హతల అవసరంలేదు. మనకు నచ్చిన రచయిత గురించి మనకు నచ్చినట్టు రాసేవాడు, నచ్చనివాడిని మనం మెచ్చేట్టు తిట్టేవాడు అయితేచాలు. సాహిత్య మాఫియా ముఠాలు, పత్రికలను తమ ఉక్కుపిడికిళ్ళలో బంధించిన జర్నలిస్టు రచయితలూ, సాహిత్య గుంపుల గంపలూ ఏమీ తెలియనివాడిని కూడా విమర్శకుడినిచేసేస్తాయి. ఇలాంటి పరిస్థితులలో సరయిన విమర్శ రాయాలనుకుంటే వేసే పత్రికలూ లేవు. అలాంటి పరిస్థితులలో ఒక పుస్తకం గురించి మూడు వారాలు నిర్మొహమాటమైన విమర్శను నిజాయితీగా నిక్కచ్చిగా రాసే వీలిచ్చి, ప్రచురించిన సంచిక, డైనమిక్ వెబ్ సాహిత్య వేదికకు కృతజ్ఞతలు. ఈ భాగాలను ఓపికగా చదివి సలహాలు, సూచనలు ఇస్తూ, ప్రోత్సహించిన వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా చాగంటి తులసి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ వ్యాసంలో తమ విమర్శనుంచి ఉదహరించేందుకు సహృదయంతో అనుమతినిచ్చిన అనిరుద్ద భట్టాచార్జీకి ధన్యవాదాలు.

రఫీ ఒక ప్రేమపత్రం
రచన-మృణాళిని
వెల: 350/-
పేజీలు: 310
ప్రతులకు: అన్ని ప్రధాన విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here