యల్లాప్రగడ సీతాకుమారి అభ్యుదయ కథలు

2
11

[శ్రీమతి శీలా సుభద్రాదేవి రచించిన ‘యల్లాప్రగడ సీతాకుమారి అభ్యుదయ కథలు’ అనే వ్యాసం అందిస్తున్నాము.]

[dropcap]దే[/dropcap]శంలో వచ్చిన ఉద్యమాలు కావచ్చు, సాహిత్యోద్యమాలు కావచ్చు కారణాలేమైనా కొందరు రచయిత్రులు విస్మృతులుగా మిగిలి పోతారు.అటువంటివారిలో స్త్రీజన సేవకురాలే కాక గుర్తించదగిన రచయిత్రి యల్లాప్రగడ సీతాకుమారి.

యల్లాప్రగడ సీతాకుమారి అనగానే స్త్రీ విద్యా, వితంతు వివాహం, మహిళా స్వాతంత్ర్యం మొదలైన వాటిగురించి కృషిచేసిన సామాజిక సంస్కర్తగానో,శాసన సభ్యురాలిగానో గుర్తిస్తారు తప్ప రెండు నాటికలు,కవితా ఖండికలు సంపుటి,నేను- మా బాపు పుస్తకం , గోల్కొండ పత్రికలో సమకాలీన మహిళా సమస్యలపై రాసిన రచనలూ కాక అద్భుతమైన కథలు రాసిన రచయిత్రి అనే విషయం గుర్తురాదు.

1911లో బాపట్లలో జన్మించిన యెల్లాప్రగడ సీతాకుమారి సర్వోదయ కార్యకర్త ఐన వి.ఎల్. నారాయణరావుతో వివాహానంతరం హైదరాబాదు లోనే ఆమె జీవితం తెలంగాణా సాంస్కృతిక ఉద్యమాలతో మమేకమైంది.

ఇవికాక 1968లో సీతాకుమారి సంకలనం చేసిన ‘మందారమాల’ అనే వ్యాససంపుటి విశ్వవిద్యాలయ విద్యార్థులకు పఠనీయగ్రంథంగా ఉండేదనే విషయం అసలే తెలియదు.

సీతాకుమారి రాసిన ఓ ఎనిమిది కథలు గురించి వివరంగా తెలుసుకుందాం.

1. కులమా? – ప్రేమా? (1-4-1933 ఆంధ్రపత్రిక)

శంపాలతా, మీర్జా ఎమ్మెస్సీ ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. కథంతా శంపాలత పాత్రగా ఉత్తమ పురుష లో సాగుతుంది.

జాతీయోద్యమ ప్రభావం వలన కావచ్చు కథలో కులమత ప్రస్తావనకన్నా భారతీయతే ముఖ్యంగా కనిపిస్తుంది.

ఒక సందర్భంలో శంపాలత, మీర్జాల మధ్య విగ్రహారాధన గురించిన చర్చలో ‘మసీదులో నియమిత సమయంలో నమాజు చేస్తారెందుక’ని శంపా ప్రశ్నిస్తుంది. ‘పనీపాటా లేనివాళ్ళు మతాల గురించి వెక్కిరిస్తూ కూర్చుంటారు. మంచి ఆదర్శాలు ఏ మతంలో ఉన్నా స్వీకరించాలి’ అంటాడు మీర్జా.

విభిన్న మతాలకు చెందిన వారైనా ఒకరి మనోభావాలను కించపరచని సంయమనం కథలో స్పష్టీకరించటం ఉంటుంది.

‘బ్రాహ్మణులలో చిన్నప్పుడు వివాహం చేస్తారు కదా నువ్వెందుకు వివాహం చేసుకోక చదువుకుంటున్నావ’న్న మీర్జా ప్రశ్నకు ‘పురాణాలలో కూడా స్త్రీలు చదువుకున్నారు. నేను చదువుకున్నంత మాత్రాన నా మతం ఏమీ అయిపోదం’టుంది శంపా. శంపా పాత్రని అభ్యుదయ భావాలతో చిత్రీకరించింది రచయిత్రి.

టెన్నిస్ గురించిన మీర్జా ప్రశ్నకు పురాణాలలో బంగారు బంతితో ఆడే కందుక ఖేలనం గురించి చెప్పటంలో శంపా పురాణేతిహాసాలు బాగా చదువుకుందని తెలుస్తోంది.

శంపా అనేక సందర్భాల్లో మతాంతర, కులాంతర వివాహాల గురించి పురాణం, ఇతిహాసాలలోంచి ఉదాహరణలు చెప్తుంది. శంపా ప్రాచీన సాహిత్యం బాగా చదవటమే కాక అందులోని మంచిని గ్రహించి జీవితానికి అన్వయించుకుంటుందనేది తెలుస్తుంది.

శంపాలత తండ్రి అడ్వకేట్, తల్లి గృహిణి ఐనా మంచి చదువరి. మీర్జా తండ్రి ఉస్మాన్ ఝా డాక్టర్. ఇద్దరి తండ్రులు కార్పొరేషన్ సభ్యులు కావటాన పరిచయస్థులు.

శంపాలత తండ్రి విదేశాలు తిరిగి వచ్చినవాడు కనుక వారి కుటుంబం చాంధసులు కాదు కానీ మతవిశ్వాసాలపట్ల గౌరవం ఉంది. తల్లికి ఆడవాళ్ళు బ్రహ్మచారిణులుగా ఉండటం ఇష్టం.

శంపా వాళ్ళింట్లో మీర్జా భోజనం చేయటం ఆ కాలంలో కూడా శంపా కుటుంబంలో మతవివక్ష లేక పోవటాన్ని సూచిస్తుంది.

శంపాలత, మీర్జాలు ఆకర్షితులౌతున్నారని తెలిసి శంపాతండ్రి ఉస్మాన్ ఝా దగ్గరకు వెళ్ళి పిల్లల వివాహ ప్రస్థావన తేవటం శంపా కుటుంబంలోని ఆధునిక భావజాలాన్ని రచయిత్రి వ్యక్తీకరించింది.

తండ్రి సంబంధాలు చూసాడని మీర్జా కంగారు పడుతుంటే తండ్రిని వప్పించమని శంపా చెప్పినా. మీర్జా తండ్రికి ఎదురుచెప్పలేని పిరికివాడుగా ఉస్మాన్ ఝా ఒప్పుకోక పోవటంతో తండ్రి కోరిక మేరకు మీర్జా వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడనీ, మీర్జా పాత్ర చిత్రణ చదువుతుంటే రచయిత్రి పై శరత్ దేవదాసు ప్రభావం ఉందేమో అనిపించింది.

శంపాలత ఇంగ్లాండ్ వెళ్ళి డాక్టర్ ఆఫ్ సైన్స్ పరిశోధన చేసి మూడేళ్ల తర్వాత వచ్చి తల్లి ద్వారా మీర్జా భార్య తన భర్త నిరాదరణ భరించలేక ఆత్మహత్య చేసుకుందనీ, మీర్జా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసి ఒకరోజు మీర్జా ఇంటికి వెళ్తుంది.

జీవకళ లేని మీర్జాని చూసి తల్లడిల్లి అతని ఒడిలో వాలిపోతుంది శంపాలత. ఆమెని చూసి ఉద్వేగంతో మీర్జా కళ్ళుమూస్తాడని సినిమాటిక్‌గా ఆ పాత్రని ముగించారు.

తల్లి కోరిక ననుసరించి శంపాలత బ్రహ్మచారిణి గా ఉండి తండ్రి ఏర్పాటు చేసిన హిందూముస్లిం లీగ్ పార్టీలో జాతి కుల మత భేదాలు లేని జాతీయోద్యమ స్ఫూర్తితో హిందూముస్లిం ఐకమత్యానికి పాటుపడుతుంది అంటూ ఆనాటి జాతీయోద్యమ ప్రభావంతో ముగించింది రచయిత్రి.

మొత్తంగా కథ చదువుతున్పంతసేపూ ఎనభై ఏళ్ళ క్రితం రాసిన ఈ కథ ఎంతో ఆధునికంగా రాయటమే కాకుండా శంపా పాత్రని ఎంత అభ్యుదయ భావాలతో తీర్చిందో రచయిత్రి యల్లాప్రగడ సీతాకుమారి అని ఆశ్చర్యం కలుగుతుంది.

2. హాస్పిటల్లో (1-11-1937 గృహలక్ష్మి)

హాస్పిటల్లో విజిటర్స్ రావటానికి కేటాయించిన గంట సమయంలో ఒక స్త్రీ మనోవేదనను చిత్రించిన కథ.

అది స్త్రీల ఆస్పత్రి. బాలెంతల్ని చూడటానికి విజిటర్స్ రావటంతో కథ మొదలౌతుంది. ఒక్క విజిటర్ కూడా తన కోసం లేని దౌర్భాగ్యురాలు. తన జీవితాన్ని దృశ్యాలు దృశ్యాలుగా ఆలోచించుకుంటుంది. చిన్నప్పుడే తల్లి చనిపోవడాన్ని, పన్నెండేళ్ళు ప్రాయంలో ఆమెని ఒక పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళి చేసి, ఆ పిచ్చివాడి యవ్వనవతి ఐన చెల్లెల్ని అరవై ఏళ్ళ తన తండ్రి పెళ్ళిచేసుకోవడం, తర్వాత ఆ పిన్ని మరొకరితో వెళ్ళిపోవడం గుర్తు తెచ్చుకుంటుంది. ఆమె ఆ పిచ్చివాడితో బాధలు పడలేక విడాకులకు ప్రయత్నించి, బయటపడి చదువుకోవడం మరో దృశ్యం. తర్వాత ఆమె చదువుకు సాయంచేసిన వ్యక్తిని ప్రేమించటం, గర్భం దాల్చిన తర్వాత అతను పెళ్ళికి భయపడటం మరొక దృశ్యంగా ఉత్తమ పురుషలో తన కథ మననం చేసుకుంటుంది.

మళ్ళా ప్రస్తుత కాలానికి వచ్చి ఇప్పుడు పుట్టిన పాపని ఎలా పెంచాలని విచారిస్తుంటే సిస్టర్ వచ్చి ఏడుస్తున్నపాపకి పాలు ఇమ్మని ఆమె ఒడికి పాపని అందిస్తుంది.

ఆ పసిపాప సంపెంగ పువ్వులాంటి చిట్టి నోటితో పాలకోసం తడుముకుని అందుకోవటం, ఆమె జీవితంలో అదే ఆనందమయ దివ్య క్షణం అంటూ ఆమె మనోవేదన స్వగతం ముగిస్తుంది. అంతలో విజిటర్స్ వెళ్ళపొమ్మని క్లోజింగ్ బెల్‌తో కథ ముగిస్తుంది రచయిత్రి.

ఈ కథలో సీతాకుమారి వెల్లడించిన అభిప్రాయాలు అధునాతనంగా ఉంటాయి. పిచ్చివాడికి విడాకులిచ్చి తిరిగి పెళ్ళిచేసుకోవాలనుకోవటాన్ని తండ్రి అప్రతిష్ఠగా భావిస్తాడు. కానీ ఆ తండ్రి వృద్దాప్యంలో కన్నెపిల్లని పెళ్ళి చేసుకుంటే సంఘం వెలివేయదా అని ఆ పాత్ర ప్రశ్నిస్తుంది.

ఆడముండని డబ్బు ఖర్చుపెట్టి చదివిస్తానా అనే తండ్రి తన కొడుకుని మాత్రం గుంటూరులో ఉంచి నెలనెలా డబ్బు పంపుతాడు, ఆ కొడుకు చదువుకు బదులు సంకటాలు తెచ్చుకున్నాడనీ అవి వదలటానికి రెండెకరాలు తరలిపోయాయని వ్యంగ్యంగా రచయిత్రి చెప్పటంలో ఆనాటి ఆడపిల్లల చదువు పట్ల గల వివక్షని వ్యక్తీకరించింది.

ఆమె పాత్ర స్వగతంలో – “సంఘదురాచారాలకు సరియైన కష్టం జీవినులు, వ్యర్థజీవినులు ఇంకా ఎంతమంది వున్నారో? ఈ దేశంలో యీ బాల్యవివాహాలు, వృద్ధవివాహాలూ, యీ ఎదురువివాహాలూ యింతలో మనల్ని వదిలిపెట్టేలాలేవు” అని ఒకసారి అనుకుంటుంది.

“నాలుగేళ్ల కిందట డైవోర్స్ బిల్లు కావాలనీ, వద్దనీ శాసనసభలో కొట్టుకున్నారు” అని చెప్తూ రచయిత్రి వ్యంగ్యంగా సభలో జరిగే ప్రహసనాల్ని బట్టబయలు చేస్తుంది. సీతాకుమారి నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడ నియోజక వర్గం నుంచి 1957లో ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన శాసనసభ్యురాలు కావటం వలన స్త్రీసభ్యులు చాలా మంది శాసనసభలో వున్నాకానీ వాళ్ళేమీ చెప్పరు. ఎందుకంటే సౌఖ్యంగా వున్న జీవితాలు గల స్త్రీలు వాళ్ళు. వారేమీ డైవోర్స్ బిల్లు కావాలనో, వద్దనో చర్చ చేయరు. ముందు స్వరాజ్యం వస్తే తర్వాత చూసుకోవచ్చని చర్చని దాట వేస్తారు – అని విమర్శించ గలిగింది.

విదేశాల్లో వధూవరులకు డాక్టరు సర్టిఫికెట్ వుంటే గానీ పెళ్ళి చేయరనీ, మనదేశంలో మాత్రం భార్యాభర్తల జీవితాల్ని కర్మ సిద్ధాంతం తోనూ వాళ్ళు రాతలతోనూ, గీతలతోను ముడిపెట్టేస్తారని రచయిత్రి తన మనసులో మాటని పాత్ర స్వగతంలో చెప్పిస్తారు.

కథలోని స్త్రీపాత్రదౌర్భాగ్య స్థితికి సమాజంలో స్త్రీలే ఎటువంటి సలహాలు యిస్తారో రచయిత్రి ఎలా వివరిస్తారంటే —

రామా కృష్ణా అనుకుంటూ పడివుండు- ముసలమ్మ నీతిబోధ

సేవా సంస్థలో చేరి సంఘసేవ చేయు – సంస్కర్త

బతికి ఎవర్ని వుద్ధరించను ఎందులోనన్నా పడి చావు- ఒక తల్లి సలహా

మా యింట్లో వుండి మాకు వండి పెట్టి నీ కడుపు నింపుకో – రోగిష్టి యిల్లాలు.

ఇవి చదువుతుంటే సమాజంలో మానవ స్వభావాలు ఆలోచనలూ ఇప్పటికీ ఇలాగే వున్నాయనే అనిపిస్తుంది.

కథా, కథ జరిగిన సమయం చిన్నదిగానే వున్నా కథలో చర్చించినవీ, ఆలోచించవలసినవీ అనంతంగా వున్నాయి.

హైదరాబాద్‌లో సీతాకుమారిగారు స్త్రీల కోసం ‘ఆంధ్ర సోదరీ సమాజము’ స్థాపించారు. చిక్కడపల్లిలో ‘ప్రమదావనం’లో అనాథలకు, వితంతువులకు, భర్తలు వదిలేసిన భార్యలకు ఆశ్రయం కల్పించి ఆదుకొన్నారు.

అంతేకాక నిజాం నిరంకుశ పాలనలో ‘అక్కి రెడ్డి పల్లి’ గ్రామంలో జరిగిన స్త్రీల అత్యాచారాలపై విచారణ జరిపే సంఘంలో సభ్యురాలయ్యారు. అత్యాచారం జరిగిన అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించి స్త్రీలకు అండగా నిలిచారు సీతాకుమారి. బహుశా ఆమె పరిశీలనలోకి సంఘటనే కథగా మలిచి వుంటారు.

3.ఉత్తరాలు (గృహలక్ష్మి 01-04-1938)

ఈ కథ చదివిన పాఠకుల హృదయాలను తాకేలా ఉంటుంది. శతాబ్దాల క్రితం నాటి ప్రేమికుల ఉత్తరాలు చదవటం అబ్బురం కదా! ఆనాడే అంత ఆలోచనాత్మకంగా రాసిన ఆ ఉత్తరాలు పాఠకుల ఆలోచనల్ని కూడా రగిలిస్తాయి.

ఉత్తమపురుషలలోనే సాగిన ఈ కథలో ప్రకృతి ఆరాధకుడైన ఒకవ్యక్తి వసంత రుతువులో ఒక గుట్టమీద గత శతాబ్దంలో స్నేహితుడి తాతగారు నిర్మించిన మనోహరమైన దివ్యభవనంలో కొన్నిరోజులు గడిపి ఆ ప్రకృతి సౌందర్యంలో మమేకమౌదామని వస్తాడు .

ఎన్నో గదులున్న ఆ భవనంలో స్నేహితుడు ఒక్కోసారి ఒక్కో గదిలో అతనికి వసతి ఏర్పాటు చేస్తాడు. ఆ ఏడాది ‘ఆన్ట్ రోజు’ గదిని యిస్తాడు

అతను ఆ గదిలో ప్రవేశించగానే నిలువెత్తు అందమైన ‘ఆన్ట్ రోజ్’ – తైలవర్ణచిత్రం చూసి ప్రాచీన సాధ్వీశిరోమణిలను గుర్తుకు తెచ్చుకుంటాడు.

ఆ రాత్రి నిద్రపట్టక ఉత్తరమైనా రాసుకుందామని గోడలోపల డెస్క్ తెరచి కాగితం, కలం కోసం వెతుక్కుంటాడు. అక్కడ పాడైపోయిన ఈక కలం కనిపిస్తుంది. డెస్క్ మూసేయబోతే లోపలికి బంగారు సూది వంటి తాళం చెవి కనిపిస్తుంది. ఉత్సాహంగా డెస్క్ ని పరిశీలిస్తే ఒక రంధ్రం కనిపించి అందులో చెవి పెట్టగానే రహస్య సొరుగు తెరుచుకుంటుంది.

అందులో పసుపుపచ్చ, గులాబీరంగుల ఉత్తరాలకట్టలు విలువైన పట్టుగుడ్డముక్కలో చుట్ట బడి ఉంటాయి.

ఆశ్చర్యంగా అందులోని కొన్ని ఉత్తరాలు తీసి చదువుతాడు.

ఒక ఉత్తరంలో – – “నువ్వుకోరినట్లు నీవు రాసిన ఉత్తరాల్ని నీకు పంపిస్తున్నాను. నీ భయం అవి బయట పడతాయనా సిగ్గుపడుతున్నావా. నేను అతి జాగ్రత్తగా దాచుకుంటాను ఎప్పుడైతే మనం ప్రేమించటానికి ఒప్పుకున్నామో అప్పుడు  మధురసంగీతంలా, మలయానిలంలా మృదువుగా తాకే ఆ ప్రేమని మాటలుగా, వ్రాతలుగా ఒప్పుకోవాలి.

నీ భయం నాకు అర్థం అవుతుంది. వాటిని కాల్చి బూడిద చేయాలనే భీరుత్వం తెలుసు. నీ ప్రశాంత జీవనాన్ని ఆశిస్తూ వేదనతో పంపిస్తున్నాను” అని ప్రేమికుడు రాస్తాడు.

రెండవ ఉత్తరం – “మిత్రమా నీవు నన్ను అర్థం చేసుకోలేదు. నేను నిన్ను ప్రేమించినందుకు విచారించను” అంటూ ఆక్ట్ రోజ్ రాసిన ఉత్తరంలోని వాక్యాలు ఆమె ఆంతర్యాన్ని, చింతనాత్మక వ్యక్తిత్వాన్ని వెల్లడి చేస్తాయి.

ప్రతీ మనిషికి మరణం అనివార్యం. ఎవరూ నా రహస్య సొరుగు కనుక్కోలేరు. నా మరణానంతరం కనుక్కున్నా మరణించిన వారి ప్రేమలేఖల్ని పురుషుడు కాల్చి బూడిద చేస్తాడు. అదే భార్య వున్నప్పుడైతే ఆమెని, ఆమె ప్రేమించిన వానికై పగ సాధిస్తారు. అదే పురుష హృదయం. అని ఈ సందర్భంలో పురుషుల మానసిక దౌర్బల్యాన్ని వెల్లడించింది రచయిత్రి.

“ఏ స్త్రీకి అయినా తనని ఆరాధించే ప్రియులు రాసిన ప్రేమలేఖలు తమ సౌందర్యానికి, ఠీవికీ, చాకచక్యానికీ, ఆకర్షణకీ యోగ్యతా పత్రాలు. అందుకే వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటుంది.” అని ఆక్ట్ రోజ్ ముగిస్తుంది.

ఆ వుత్తరాలు చదివిన తర్వాత అతనికి ఫొటో లోని ఆక్ట్ రోజ్ ముఖం స్వార్థం, కపటం, ద్వంద్వత్వం గోచరించాయి అని రచయిత్రి ముగించటంలో పురుషుల మనసులోని ద్వంద్వ వైఖరినీ, మనస్తత్వాన్ని స్పష్టపరిచింది.

4. కలిసి జీవించుదాం (యువ 01-07-1963)

రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా అరుణాదేవి ఉపన్యాసాన్ని మదన్ బాబు వినటంతో కథ మొదలౌతుంది. అరుణ తండ్రి, మదన్ బాబు తండ్రి సహాధ్యాయులు. కానీ అరుణ తండ్రి జాతీయోద్యమంలో పాల్గొని, సమాజం పట్ల అంకిత భావం కలవాడు. అవే భావాల్ని పుణికి పుచ్చుకొన్న అరుణ వివాహం చేసుకోకుండా సమాజసేవకు అంకితం మౌతుంది. మదన్ తండ్రి వ్యాపారం చేసి ధనం సంపాదిస్తాడు. మదవ్ ధనంతో పాటూ పేరు కూడా పొందటానికి లలిత కళా మందిరాన్ని స్థాపించుతాడు.

మదన్‌కు మేధావులైన స్త్రీలంటే చిన్న చూపు. అరుణని తన లలిత కళాభవనంకి తీసుకెళ్ళి తన గొప్పతనాన్ని ప్రదర్శించబోతాడు. మదన్ లలిత కళా సంఘంలో నృత్యమందిరం, గాన మందిరం, చూసాక చిత్ర కళామందిరానికి వెళ్తారు. అక్కడ సౌందర్య ప్రధానమైనవి కాక సమాజానికి సందేశమిచ్చే చిత్రాలు చూసిన అరుణ అవి వేసిన కృష్ణ భూషణ్‌తో ఆత్మీయంగా మాట్లాడుతుంది. తర్వాత కూడా అరుణ మరోసారి కృష్ణభూషణ్‌ని కలవటానికి వెళ్ళి, గానమందిరం ఇంచార్జి శచీదేవి గానాన్ని వింటుంది. అంత ప్రతిభ కలిగిన గాయకురాలిని ఉపయోగించుకోవటం వీరికి తెలియదు అనుకుంటుంది

మదన్ తన లలిత కళా సంఘం అభివృద్ధికి తనతో చేయికలపమని అరుణని కోరటం, అరుణ “ఈనాటి పరిస్థితుల్లో దేశం మీద ప్రత్యేక బాధ్యతలున్నాయి గదా!” అంటూ ఆ సంఘానికి జాతీయ కళా కేంద్రంగా పేరు మార్చి మదన్‌తో కలిసి పనిచేయటానికి అంగీకరిస్తుంది. చివరిలో శచిని ‘శంకరా భరణాన్ని కట్టి పెట్టి దేశ భక్తి గీతం పాడమ’ని మదన్ అనటంలో కథని ముగిస్తుంది రచయిత్రి.

ఇందులో ఆనాటి జాతీయోద్యమానంతర పరిస్థితులు, జాతీయ భావాలు కలవారి ఆలోచనలు స్పష్టమాతాయి. ఏ కళగానీ అది దేశానికి ఉపయోగకరంగా ఉండాలనే స్ఫూర్తిని రగిలిస్తాయి.

చిత్రకళ, సంగీత, నృత్యం, కవిత్వమూ ఈ కళలన్నింటి ద్వారా ప్రజల్లో జాతీయ భావాలను ప్రజ్వలింప జేసి కళ కళ కోసం కాదనీ, దేశం కోసం అనే నినాదాన్ని ఈ కథలో రచయిత్రి వ్యక్తీకరించింది.

రవివర్మ, బాపిరాజు చిత్రాలలోని భావ కుశలత కృష్ణ భూషణ్ చిత్రాల్లో ఉన్నాయని, అయితే రాజుల కోసమూ, జమిందార్ల కోసమూ కాకుండా సజీవమైన గ్రామీణ జీవితాల్ని, పచ్చని గ్రామాల్ని, శ్రమ జీవితపు విలువల్నీ ప్రదర్శించినపుడు ప్రజాజీవితానికి దగ్గరౌతాయనే అభిప్రాయం పాత్రల ద్వారా వెలిబుచ్చటం రచయిత్రికి సమాజం పట్ల, కళల పట్లా గల స్పష్టమైన అంకిత భావం తెలుస్తోంది. సమాజసేవ చేసే మహిళల పట్ల, చదువుకున్న మహిళల పట్ల సమాజంలో కొందరు పురుషుల మనోభావాలను మదన్ ద్వారా వ్యక్తపరిచారు రచయిత్రి.

కథలో సున్నితమైన ప్రేమ భావనలను ధృఢమైన జాతీయభావంతో నడపటం గమనించ వలసిన అంశం.

5. వెన్నెల్లో (గృహలక్ష్మి 01-10-1938)

అవ్వేళ ఆశ్వయుజ పౌర్ణమి అంటూ మొదలై వెన్నెలలోని ప్రకృతి సౌందర్యాన్ని కథలో అంచెలంచెలుగా వర్ణనాత్మకంగా నడపటంలో రచయిత్రి వర్ణనాత్మక శైలి ఈ కథలో స్పష్టంగా తెలుస్తుంది.

వెన్నెలను ఆస్వాదిస్తూ ఉన్న యువజంటలో విద్యావంతురాలైన విజయలక్ష్మి ధనవంతుల గారాబుబిడ్డ. విశ్వనాధం లా చదివి తదనంతరం ఏమి చేయాలని ఆలోచిస్తున్నవాడు.

వెన్నెల విహారానంతరం చాలా రాత్రి అయిపోవటంలో తిరుగు ప్రయాణంలో వివాహప్రస్తావన తెస్తాడు విశ్వనాధం.

‘తొందరపడి పెళ్ళి చేసుకున్న దంపతులెందరో అభిప్రాయబేధాలతో, అవిశ్వాసాలతో, అంతః కలహాలతో అసహ్యంగా రోజులు గడుపుతున్నారు. పెళ్ళయ్యాక మగవారు భార్యపై నిరాదరణ చూపటం ప్రారంభిస్తారని ఎన్ని కథల్లోనో చదివాం’ విజయ అంటూనే కారు నడుపుతుంది. విశ్వనాథం తన ప్రేమని విజయ సందేహిస్తున్నందుకు బాధ పడతాడు.

అంతలో కారుకి ప్రమాదం జరిగి టాపులేని కారులో ప్రయాణిస్తున్న విజయ ఎగిరిపడటంతో చెయ్యి దెబ్బతినటం విశ్వనాధం చిన్నగాయలతో బతికిబయటపడి ఆమెను హాస్పటల్ లో చేర్చుతాడు.

మెలకువ వచ్చిన విజయ తనకు సేవచేస్తున్న విశ్వనాధం ఈ పరిస్థితుల్లోనూ ఇప్పటికీ తనకు తోడుగా ఉంటున్నందుకు విశ్వనాధంకి దగ్గరౌతుంది. ఈ కథలో కథాంశం తక్కువే అయినా వెన్నెల సౌందర్యవర్ణనతో మొదలుపెట్టి కారుతో పాటూ చంద్రుడినీ పయనింపచేసి ముగింపు కూడా చంద్రుడు సంతృప్తిగా పడమర వైపు దిగిపోవడంతో ముగించటం రచయిత్రి రసహృదయం తెలుపుతూ మనోజ్ఞమైన ప్రేమకథగా తీర్చింది

‘శరన్నవరాత్రి వెన్నెల ఏడాదికొక్కసారి దొరుకుతుంది. కానీ ఇంట్లోనే మురిగిపోయే ఆడవాళ్ళు దీనిని అనుభవించలేరు’ అని ఒక సందర్భంలో రచయిత్రి వ్యక్తపరిచినప్పుడు స్త్రీల చాకిరిపట్ల రచయిత్రికి గల వేదన తెలుస్తుంది –

‘అసలీ వెన్నెల ముందు ఎలక్ట్రిక్ షాక్‌లా బాధ కలిగిస్తుంది సురాపానంలా మత్తెక్కిస్తుంది. చివరికి వీణా గానంలాగ మనసుని కరిగించేస్తుంది’ కథంతా వెన్నెల గురించే నడిపిన ఈ కథలో రచయిత్రి రసాస్వాదనలో పాఠకులూ మునిగిపోతారు.

6. పునిస్త్రీపునర్వివాహం (గృహలక్ష్మి 4-12-1937)

ఈ కథ రచయిత్రి ఉత్తమపురుషలో రాసింది.

సుధ, మధు సహాధ్యాయులు సుధా డాక్టరు పరీక్షకి చదువుతుంది. సుధకి ఆమె తండ్రి డాక్టరీ చదువుతోన్న విధూశేఖరంకి ఇచ్చి పెళ్ళిచేస్తాడు.

కట్నం రెండువేలు సమయానికి సమకూరనందున పొలం అమ్మి ఇస్తానని మధు తండ్రి చెప్తాడు. కానీ మధుకి ఆస్తి లేదని తెలిసి పెళ్ళివారు కోపంతో హైదరాబాద్ వెళ్ళిపోతారు.

దాంతో పుట్టింట్లో ఉండి పోయిన మధు ఒక బాలికా పాఠశాలలో ఉద్యోగంలో చేరి తల్లితండ్రితో కలిసి ఉంటుంది.

సుధా డాక్టరీ పూర్తి చేసి విధూని చేసుకుందని తెలిసి మధు బాధపడుతుంది. కానీ సుధతో తను వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పేసరికి సుధ “నీకు పెళ్ళయ్యిందిగా” అని ప్రశ్నిస్తుంది.

మధు అప్పుడు జరిగిన విషయం అంతా తెలియజేస్తుంది .

“విధు మంచివాడే. నువ్వు పునర్వివాహం చేసుకునేందుకు విధూ నుండి నీకు అనుమతి పత్రం తెస్తాను” అంటుంది సుధ.

ఒకరోజు ముగ్గురు కలుసుకోవటం విధుశేఖరం నుండి అనుమతి పత్రం తీసుకొని భగీరధని మధువివాహం చేసుకుంటుంది. పత్రికలన్నీ ‘పునిస్త్రీ పునర్వివాహాన్ని చేసుకున్న ప్రథమ ఆంధ్రస్త్రీ’ అనీ వారిది ఆదర్శ వివాహంగా రాస్తాయి.

ఈ కథలో ధనవంతుల ఆడపిల్లలకే చదువు అందుబాటులో ఉంటుంది. కానీ మధ్యతరగతి ఆడపిల్లల వివాహ సమస్య, కట్నాల వలన కుటుంబాలు ఛిద్రం అయిపోతున్న పరిస్థితిని తెలియ జేస్తుంది రచయిత్రి. పెళ్ళయిన మగవాడికి సమాజంలో మరో పెళ్ళికి అభ్యంతరం లేకపోవటం, పక్షపాతపు సంఘం ‘ఫలాని వాళ్ళు అమ్మాయిని మగడు వదిలి పెట్టిపోయాడ’ని వేలెత్తి చూపుతోందనేది కథలో ప్రస్తావించారు. భర్తలచే తిరస్కరింపబడిన అభాగినులు ఆత్మహత్యలకైనా పాల్పడతారు లేదా ఆ భర్త దగ్గరే దాసిలా ఉండాలనుకుంటారనేది కథాక్రమంలో రచయిత్రి వివరించటం ఆనాటి మహిళలపట్ల సమాజానికి గల వివక్ష వ్యక్త మౌతుంది.

7. ఈ రాధేనా (భారతి 01-07-1938)

రచయిత అయిన రాజారావు అఖిలాంధ్ర కథక సమ్మేళనానికి కథ రాయటానికి తన యింటి ముందు గ్రౌండులో కూర్చుంటాడు. అతని ముందు ఒక అమ్మాయి దుఃఖిస్తూ నిలబడుతుంది. ఆమెని ప్రశ్నిస్తే తనను ఒక ముసలివాని కిచ్చి పెళ్లి చేస్తున్నారని పారిపోయి వచ్చాననీ, కొంతకాలం ఆశ్రయం కోరుతుంది.

ఆమెని తీసుకుని కాచిగూడాలో బండెక్కి షాద్ నగర్ తీసుకెళ్ళి ఇల్లు చూసి ఆమెను ఉంచి అవసరమైన వస్తువులు కొని యిస్తాడు. ఇద్దరి మాటా మంతీలలో రాజారావు ‘తనకి వివాహం కాలేదని, మేనమామ కూతుర్ని చేసుకోడం ఇష్టం లేక చదువుకున్న అమ్మాయికోసం చూస్తున్నాన’నీ చెప్తాడు.

ఆమె తన పేరు రాధ అని చెప్పి రాజారావుని కూడా సాయంగా ఉండమంటుంది. రెండు మూడు రోజులు కలిసి కబుర్లు కలబోసుకున్నాక రాజారావు వివాహం ప్రసక్తి తీసుకువస్తాడు. తీరా ఆమె తన మేనమామ కూతురు రాధేనని తెలిసి సంభ్రమపడతాడు. ఇది సినీమాటిక్‌గా ఉన్నా కథ నడిపిన తీరు, రాధ తన బావ మనసును మార్చి, తన వ్యక్తిత్వాన్ని తీర్చుకున్న విధానం, చాలా సహజంగా కథ నడుస్తుంది.

8. ఆ వీణేనా (ఆంధ్రకేసరి 1940)

జ్యోతి, ప్రసాదం అన్యోన్యదంపతులు. జ్యోతి వీణానాదంతో పరవశిస్తూ అయిదేళ్ళు గడిచి పోతాయి. అనుకోని పరిస్థితులవల్ల మశూచి సోకి జ్యోతి అంధురాలై పోతుంది. బంధు మిత్రుల ప్రోద్బలంతో జ్యోతిని పుట్టింట్లో వదిలిపెట్టి తిరిగి పెళ్ళి చేసుకుంటాడు ప్రసాదం.

జ్యోతి తన దురవస్థకు కునారిల్లుతూ అంధురాలైనా తన వీణా, తన పాట తనను వదల లేదని తెలుసుకొని వాటితో బాధని మరుస్తుంది. ఆమె గానము, వీణానాదం ఆకర్షించి అనేకమంది నేర్చుకోవడానికి వస్తారు. తర్వాత ఆమె సంగీతవిద్య ఆకాశవాణి ద్వారా ప్రసారమై రాష్ట్రం అంతటానే కాక దేశం నలుమూలల నుండి ఆమెకు ఆహ్వానాలు వస్తుంటాయి-

ఏ అభిరుచి లేని పద్మని పెళ్లి చేసుకున్న ప్రసాదం ఒకరోజు రేడియోలో ఆమె వీణానాదం విని పశ్చాత్తాపం పొందుతాడు.

ఇదంతా మామూలు కథే. అయితే సీతాకుమారి ఈ కథాగమనంలో భర్తలచే విడిచివేయబడిన మహిళల గురించి, నిరాధారమైన జీవితం గడపవలసిన పరిస్థితుల గురించి, సమాజంలో అనాకారిగా మారిన స్త్రీలపై చూపే వివక్షని, మానవ మనస్తత్వాల్ని, మగవారి స్వార్థపుటాలోచనల్నీ బట్టబయలు చేసి చూపింది. ఈ కథలోని భాష ఒకింత శిష్టవ్యవహారికంలో రాసింది.

మొత్తంగా సీతాకుమారి కథలను తరచి చూస్తే కథానాయికలు విద్యావంతులు, సమాజం పట్ల, మానవ మనస్తత్వాల పట్ల, కుటుంబ జీవనం పట్ల స్పష్టమైన అభిప్రాయంగల వారిగా అక్షరీకరించారు రచయిత్రి. అంతే కాక కథలన్నీ అభ్యుదయ దృక్పథం కలిగినవిగా ఉండడం స్పష్టమౌతుంది. కథలలో సమకాలీన పరిస్థితులు, సమాజం తీరు తెన్నుల గూర్చిన చర్చలు అర్థవంతంగా ఉంటాయి. ప్రతీ కథనీ చక్కని ప్రకృతి వర్ణనలతో ప్రారంభించటం ఒక విశేషం.

ధైర్యవంతులు ఆనాటి సమాజానికి ఎంతో అవసరమని తన కథల్లో రచయిత్రి తెలిపారు. కథలన్నీ కూడా స్త్రీ అభ్యుదయాన్ని కాంక్షించేవే. సీతాకుమారి కథలన్నీ పూర్తిగా ప్రామాణిక భాషలో సాగాయి.

అధునాతన కథాంశాలతో సుమారు ఎనభై ఏళ్ళ కిందటే చక్కని కథలు రాసిన యల్లాప్రగడ సీతాకుమారి తెలుగు కథారచయిత్రిగా ఎన్నదగినది.

అధునాతన, అభ్యుదయ భావాలు, సంస్కరణ దృష్టి కలిగిన రచయిత్రి సీతాకుమారి. డెబ్భై అయిదు సంవత్సరాలు జీవించిన యల్లాప్రగడ సీతాకుమారిగారు 2-1-1986న మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here