ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ యాత్రా విశేషాలు-1

0
11

[dropcap]నే[/dropcap]ను గత ఏప్రిల్‌లో సియాటిల్ వుండే మా అబ్బాయి దగ్గరకి వెళ్ళినప్పుడు..

“అమ్మా! ఆగస్టు నెలలో పిల్లలకి స్కూళ్ళకి సెలవలు వస్తున్నాయి. అప్పుడు మనం ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ చూడడానికి వెడతున్నాము. సుమారు పది గంటలపైనే వుంటుంది ప్రయాణం. రానూ పోనూ, అక్కడ మనం వుండడానికి మొత్తం వారం రోజుల ప్రోగ్రాం పెడుతున్నాను” అని మా అబ్బాయి అన్నాడు.

పార్క్ అంటే మామూలుగా పిల్లలు ఆడుకునే పార్కు అనుకున్నాను.

“ఇక్కడ వున్న పార్కుల్లో ఆడుకుంటునే వున్నారు కదా.. దాని కోసం అంత దూరం వెళ్లాలా?” అన్నాను.

“అది మామూలు పార్క్ కాదమ్మా! పెద్ద అడవి” అనేసరికి, ‘ఓహో’ అనుకున్నాను.

వెళ్ళేది కారులోనే కాబట్టి టిక్కెట్లు రిజర్వేషన్‌లు అవసరం లేకపోయినప్పటికీ, ఉండడానికి బసలు, వసతి కోసం నెట్‌లో సెర్చ్ చేసి.. ఏ రోజు ఎక్కడ వుండాలనేదీ బుకింగ్ చేయడం మాత్రం ముందుగానే చేసేసాడు.

అయితే.. అప్పుడే అంటే జూన్ నెలలో ఆ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో విపరీతంగా వానలు, వెంటనే భయంకరమైన వరదలు ముంచెత్తడంతో పార్క్ లోకి ప్రవేశాలు ఆపేసారు. లోపల రోడ్లన్నీ కొట్టుకుపోయాయి, కొండ చరియలు మీద నుండి వరద ఉధృతకి రాళ్లు దొర్లి పడుతున్నాయని, భారీ వృక్షాలు సైతం కూకటి వేళ్లతో సహా కూలిపోతున్నాయని తెలిసింది. టివీ లలోనూ, సోషల్ మీడియాలోనూ అవన్నీ చూసి, మా ప్రయాణం కేన్సిల్ అయిందనే అనుకున్నాము.

అయితే మేము బయలుదేరదామనుకున్నది ఆగస్టులో కదా! ఇంకా రెండు నెలలు సమయం వుంది,అప్పటికి అంతా సర్దకుంటుంది.. కుదరకపోతే మరోసారి ఎప్పుడైనా వెళ్ళవచ్చు అని అనుకున్నాము.

కానీ, తర్వాత కొద్ది రోజులకే తిరిగి ఓపెన్ అయిందనీ, పర్యాటకులు వెడుతున్నారనీ తెలిసి.. మేము ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు 12వ తేదీన మేము వుండే సియాటిల్ లోని బోతెల్ అనే ప్రాంతం నుంచి బయలుదేరాము.

చిన్న పిల్లలతో ప్రయాణం, పైగా వారం రోజులు. మేము వెళ్ళే ప్రాంతంలో మన ఆహారం దొరికే హోటల్స్ వుండే అవకాశం ఏ మాత్రం లేవని, ఇంతకుముందు వెళ్ళిన స్నేహితులు చెప్పడమే కాకుండా నెట్‌లో వెతికినా అలాంటివి ఏవీ కనపడకపోవడంతో మేము తిండి ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసుకున్నాము. అయినా అమెరికాలోని మనవారు అందునా ముఖ్యంగా మన తెలుగు వారు.. ఇలా లాంగ్ టూర్లు పెట్టుకున్నప్పుడు.. వెంట రైస్ కుక్కరు, బియ్యం, కొన్ని పచ్చళ్ళు, రెండు మూడు రోజులు నిలవ వుండేలా వేపుడు కూరలు, పులిహోర పేస్టులు ఇలా చేసుకుని పట్టుకెళ్ళడం అలవాటే.

అమెరికా అనే కాదు మన దేశంలో కూడా ప్రయాణంలో తిండి ఏర్పాట్లు లేకుండా ఇంచుమించుగా బయలుదేరం కదా!

ఆ ప్రకారం కాఫీ పొడి, పంచదార ఇంకా అవసరమయిన మందులు గట్రా లతో సహా సర్వం సిద్ధం చేసుకున్నాము. వేసవికాలం కాబట్టి జాకెట్టు, స్వెట్టర్‌లు అవసరం లేదు కానీ.. ఇక్కడ వుండే తీవ్రమయిన ఎండను తట్టుకునేందుకు చలువ కళ్ళజోడులు, నెత్తి మాడకుండా పెద్ద టోపీలు మాత్రం అవసరమౌతాయి.

అనుకున్న ప్రకారం ఆగస్టు 12వ తేదీన లంచ్ అయాక బయలుదేరాము. వాషింగ్టన్ స్టేట్‌లో వున్న సియాటిల్ దాటేంతవరకూ పచ్చని చెట్లు, ప్రకృతి ఆహ్లాదంగా ఉంది.

ఎప్పుడైతే ఈ నగరానికి పెట్టని కోటల్లా వుండే కాస్కేడ్ పర్వత శ్రేణులు దాటామో, అక్కడ నుంచి మా గమ్యస్థానం చేరేవరకు పచ్చని నేల చాలా మటుకు, ఇంచుమించగా కనపడలేదు. ఒకవిధంగా ఎడారిలో లాగా అనిపించింది. అక్కడక్కడా మాత్రం చాలా పెద్ద వలయాకారంలో, సాగు చేసే పంట (బహుశా గడ్డి కాబోలు) గోచరిస్తుంది. వాటి మధ్యలో చక్రాల సహాయంతో గుండ్రంగా తిరుగుతూ నీటి సదుపాయం అందించే స్ప్రింక్లర్లు ఎక్కువగా కనిపించాయి. అవి గుండ్రంగా తిరిగే వీలుగా అనుకూలంగా వుండడానికి ఈ పొలాల్లోని కనపడే గడ్డి పంట కూడా గుండ్రంగానే సాగు చేస్తున్నారు కాబోలు అనుకున్నాను. బహుశా ఈ పంట కేవలం గడ్డి కోసమే అనిపించింది. ఎందుకంటే ఆ పచ్చని గడ్డి కొంతవరకు పెరిగి ఎండిపోయాక, పెద్ద పెద్ద బెడ్డింగులలాగా చుట్టపెట్టి, గోడౌన్‌లో నిల్వ వుంచడం కనపడింది. ఈ గడ్డి బండిల్స్ ఉపయోగం ఏదో బాగానే వుండి వుంటుందనుకున్నాను.

దారి పొడుగునా ఇవే వున్నాయి. కనుచూపు మేర పెద్ద పెద్ద మైదానాలే వున్నాయి. కానీ ఎక్కడా మనుష సంచారమే లేదు. ఇవన్నీ గమనిస్తూ.. ముందుకు సాగాము. వెళ్ళే దారిలో ఒకచోట వ్యూ పాయింట్ వుంటే అక్కడ ఆగి ఫోటోలు తీసుకున్నాము. అది చాలా ఎత్తు ప్రదేశం. దూరంగా కిందకి చూస్తే ఒక పెద్ద నది , దానిమీద బ్రిడ్జి ఒకటి కనిపించాయి.

మరోపక్క ఎత్తుగా వుండే కొండమీద వరుసగా కొన్ని గుర్రాలు కనిపించాయి. దూరం నుంచి చూడడం బట్టి అని నిజమైన గుర్రాలే అని భ్రమ పడ్డాము. కానీ అవి ఐరన్‌తో చేసిన బొమ్మ గుర్రాలని అప్పుడు తెలిసింది. వాటిని చూడడానికి కొందరు ఆ కొండ ఎక్కుతున్నారు కానీ.. మేము వెళ్ళలేదు. దూరం నుండే వాటికి ఫొటోలు తీసుకున్నాము.

ఆరోజు సాయంత్రం మేము ‘Spokane’ అనే ఊరిలో మజిలీ చేసాము.

అక్కడ ‘హాలిడే ఇన్ హోటల్’లో రాత్రి బస చేసాము. మరుసటిరోజు ఉదయం హోటల్ వారు ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్, బట్టర్, పాలు ఓట్స్ కొద్దిగా నట్స్ వంటివి తీసుకున్నాము. ఆనాటి మధ్యాహ్నం లంచ్ కోసం హొటల్ రూమ్ లోనే, మేము మా వెంట తెచ్చుకున్న ఇన్ స్టా పాట్ లో అన్నం వండుకుని, ఆ పళంగానే పట్టుకుపోయాము. ఆ తర్వాత మళ్లీ మా ప్రయాణం కొనసాగింది.

దారిలో పక్కన సాగే నదీ తీరాన ఆగి కనపడిన సుందర దృశ్యాలు, నీలాకాశం, కనపడే గిరులు ఫోటోలలో బంధించాను. ఆ నదిని ఆనుకునే కొన్ని నివాసాలు కనిపించాయి. మన ఇళ్ళల్లో కారు గరాజ్ లలాగానే, ఆ ఇళ్ళల్లో బోటు గరాజ్‌లు ఇళ్ల కింద భాగంలో.. నీటిని ఆనుకునే కనిపించాయి. మేము చూస్తూండగానే ఆ గరాజ్ తలుపు పైకి లేచింది. లోపల నుండి ఒక బోటు నెమ్మదిగా బయటకి రావడం వెంటనే ఆ తలుపు కిందకి మూసుకుపోవడం జరిగింది. ఆ బోటులోని వ్యక్తులు నదీ విహారం చేయడానికి వెళ్లిపోయారు.

(వచ్చే వారం మరి కొన్ని విశేషాలు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here