ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ యాత్రా విశేషాలు-4

0
10

[dropcap]మా[/dropcap]కు దూరంగా కనిపించే పొగలు.. లోయర్ గ్యాస్ బేసిన్‌లో నుండి వస్తున్నాయని మేప్ ద్వారా తెలుసుకుని అటువైపు వెళ్ళాము.

..ఈ ప్రాంతంలో భూమిలో చిన్నా పెద్దా అయినటువంటి, ఇంకా అప్పటి అగ్ని పర్వతాల తాలూకు వేడి విపరీతంగా వుండడంతో.. అనేక చోట్ల లోపల నీరు కుత కుత ఉడుకుతూ వేడి ఆవిరులని కక్కుతోంది. ఈ వేడి నీటి గుండాలు, చాలా ప్రమాదకరమైనవి. ఇరవై నాలుగు గంటలూ వేడి సెగలు పొగలతోనూ వుండడమే కాకుండా చాలా లోతుగానూ వున్నాయి.

నెమ్మదిగా వాటి సమీపానికి చేరుకుని అక్కడ వున్న పార్కింగ్ స్థలంలో కారు ఆపుకున్నాము. అక్కడ నుంచి, ఆయా అగ్ని గుండాలని చూడడానికి చెక్క కర్రలతో ఏర్పాటు చేసిన వంతెనల వంటి వాటి మీదుగా వెళ్ళాము. కొన్ని చిన్నవిగా, మరి కొన్ని పెద్దవిగా నీటి చెలమలు పొగలు కక్కుతూ, అందులో నుండి నీరు కుత కుత మరుగుతూ, ఆవిర్లు వెదజల్లుతూ ఆ ప్రాంతంలో కనిపించాయి. ఎక్కడికక్కడ.. వాటి దగ్గర ప్రమాదమనే బోర్డులు వున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి దగ్గరగా వెళ్ళకూడదు. వాటిలో ఎటువంటి వస్తువులు వేయకూడదు.

ఆ వేడి నీటి గుండాలు కూడా చాలా లోతుగా వున్నాయి. కొన్నింటి నుంచి సల్ఫర్ వాసనలు విపరీతంగా వస్తున్నాయి.

ప్రతి దానికీ ఒకో పేరు పెట్టబడి బోర్డులు కూడా వున్నాయి. లెక్కలేనన్ని వున్న వేడి నీటి గుండాలు పేర్లు కొన్ని.. Fountain paint pot, Hot spring, Mud pot, Fumarole, Spasm Geyser, Blue bell pool, Winter spring, Fishing cone, King Geyser, Black pool, Dragons mouth spring.. ఇలా ఇంకా చాలా వున్నాయి.

Steam boat Geyser. ఇది World’s tallest active Geyser. Unpredictable Infrequent major eruptions of more than 300 feet. Last major eruption- June 20/ 2022 at 3.24 pm.. అని తెలుసుకుని నివ్వెరపోయాము. ఆ eruption- 10 నుంచి 40 అడుగుల ఎత్తులో వస్తుందని అక్కడ రాసి వుంది.

ఈ పార్క్‌లో.. అప్పర్ గ్యాస్ బేసిన్‌లో.. నిరంతరం పైకి లేచే వేడి నీటి గీజర్లు చాలానే వున్నప్పటికీ.. 6 మాత్రం అతి ముఖ్యమైనవి. ఇవి ఒక టైమ్ ప్రకారం erupt అవుతాయని అంచనా కడతారు. అవి.. Old faithful Geyser, Grand Geyser, River side, Castle, Daisy, Great Fountain. కనీసం రోజుకి రెండుసార్లు నిర్దిష్ట సమయానికి ఓ గంట అటూఇటుగా కచ్చితంగా దాదాపు 3 నిమిషాలు నుంచి అరగంట సమయం వరకు erupt అవుతాయి. ఇది చూడడానికి వేలాది మంది అక్కడ కాచుకుని నిరీక్షిస్తూ వుంటారు. ఇదేం విచిత్రం? ప్రకృతి ఎంత విడ్డూరం? సరిగ్గా సమయానికి ఇవి eruption అయి ఒక్కసారిగా అంత ఎత్తుకి వేడి నీరు ఫౌంటెన్ లాగా వుబికి రావడం.. ఎక్కడా మానవ ప్రమేయం లేకుండానే.. సృష్టి విచిత్రం కాక మరేమిటి?

ఇలాగే మరోకటి Roaring mountain. ఇది మరొక వింత. పేరుకి తగ్గట్టుగానే ఆ పర్వతం మొత్తం అంతెత్తున పొగలనీ, ఆవిర్లుని వెదజల్లుతూ విభ్రాంతి కలిగించింది. అంతటా సల్ఫర్ వాసనలు వస్తూ ఉంటుంది. ఎప్పుడో అకస్మాత్తుగా ఈ పర్వతం పేలిపోవచ్చు అనిపించింది కూడా.

Dragan mouth spring కూడా పేరుకి తగ్గట్టుగానే వుంది. ఎక్కడో లోతుల్లో నుంచి విపరీతంగా వేడి సెగలతోనూ, ఉరికురికిపడే వేడినీటి ఒత్తిడి తోనూ ఆ ప్రాంతం భయం కలిగిస్తుంది. దానికి సమీపంలోనే కదలకుండా మెదలకుండా కూర్చుని వున్న ఒక బైసన్ కనిపించింది. అంత వేడి ఆవిర్లు వస్తున్నా కూడా చలనం లేకుండా కూర్చుంది. కాసేపటికి లేచి.. మా మధ్య నుంచే చిన్నగా నడుచుకుంటూ పక్కన వున్న కొండ మీదకి వెళ్ళింది.

మరొకటి అక్కడ ముఖ్యంగా చూడవలసిన మరో వేడి నీటి గుండం.. Grand prismatic spring. ఇది ఒక అద్భుతమైన చాలా విశాలమైన వేడి నీటి గుండం. ఈ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో.. మనతో పాటుగా ఇది కూడా కనపడుతూ వుండేలా.. ఫొటోలు తీసుకోకుండా అంటూ వుండరు.

దీనిని దగ్గర నుంచి చూడడం కన్నా.. ఎత్తు మీద నుండి చూస్తేనే ఈ అద్భుతాన్ని ఆస్వాదించగలము. దానికి కాస్త దూరంగా వుండే దారి మీదుగా కాలినడకనే దాదాపు రెండు కిలోమీటర్లు కొండ మీదకి ఎక్కి గలిగితే.. అక్కడ నుంచి కనపడే సుందర దృశ్యం.. అత్యంత కళాకౌశలం కలిగిన చిత్రకారుడు నీలం, ఆరెంజ్, పసుపు రంగులు మేళవించి చిత్రించిన పెయింటింగ్ వలే తోస్తుంది. అది అటువంటి రంగులతో సహజంగా ఏర్పడిన అగ్నిగుండం. ఈ విషయంలో ‘భలే భలే అందాలు సృష్టించావు.. ఇలా మురిపించావు’ అంటూ ఆ భగవంతుని కొనియాడాక మానము.

ఇటువంటివి సహజత్వాన్ని కోల్పోకుండా, వాటిని పరిరక్షించే ఈ పార్క్ తాలూకు రేంజర్లు, గార్డులు చేసే కృషి, తీసుకునే జాగ్రత్తలు, అక్కడ నిబంధనలని పాటించే ప్రజలకి కూడా నిజంగా హేట్సాఫ్ చెప్పాలి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here