యుద్ధ స్నేహ పరిమళం

2
15

[box type=’note’ fontsize=’16’] మిష్కా మౌజబ్బార్ మౌరాని రాసిన లెబనీస్ కథని ‘యుద్ధ స్నేహ పరిమళం’ పేరిట తెలుగులో అందిస్తున్నారు సుజాత వేల్పూరి. [/box]

[dropcap]బీ[/dropcap]రూట్ సిటీ సెంటర్ పక్కనే ఉంది జెమాయ్ జే కాలనీ. యుద్ధపు రోజుల్లో సరిహద్దు రేఖకి అతి సమీపంలో ఉందా కాలనీ. ఫలితంగా ఆ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోకుండా వదిలేసినట్టయి పోయింది. సంప్రదాయ పద్ధతిలో కట్టిన పాత ఇళ్లనీ వదిలేసి జనం వెళ్ళి పోయారు. అలా వదిలేసిన కొన్ని ఇళ్ళను నిరాశ్రయులు కొందరు ఆక్రమించేశారు.

రక రకాల కారణాల వల్ల యుద్ధం ముగిశాక కూడా అక్కడ పునర్నిర్మాణ పనులు పెద్దగా ఊపందుకోలేదు. కొంతమంది వ్యాపారస్తులైన మహిళలు, కొన్ని పాత ఇళ్లను విలాసవంతమైన విల్లాలుగా మార్చి కట్టించారు. వాటిని ఒక పక్క అద్దెకిస్తూనే, మరో పక్క జెమాయ్ జే వారసత్వ సంపదగా రూపుదిద్దారు. అంతకు మించి ఎవరూ ఆ కాలనీ జోలికే రాలేదు.

ఒక సాయంత్రం అక్కడికి సమీపాన ఉండే కొందరు స్నేహితులు చిన్న విందుకు మమ్మల్ని ఆహ్వానించారు. వాళ్ళింటి నుంచి జెమాయ్ జే కాలనీ కనిపిస్తుంది. మేము వెళ్ళేసరికి, అప్పటికే వచ్చిన కొందరు అతిథులతో వాళ్ళు తోటలో కూచోని ఉన్నారు.

చల్లని అక్టోబర్ సాయంత్రం వేళ. పక్కనే అల్లుకున్న మల్లె పందిరి గాఢ పరిమళాన్ని గాలిలో చుట్టూ పంచి పెడుతోంది.

యుద్ధం ముగిసి పదిహేనేళ్ళు అవుతున్నా, బీరూట్ లో ఏ సమావేశం జరిగినా మాటలు యుద్ధం మీదకు మళ్ళాల్సిందే. ఆ రోజూ అంతే అయింది.

“మొన్నామధ్య నా కూతురు అడిగింది, యుద్ధం ఏవైనా మానని గాయాలు మిగిల్చిందా అని?” అన్నాడు, పారిస్‌కి ట్రిపోలీకి మధ్య మొన్నటి దాకా తిరుగుతూ ఉన్న లాయర్ ఒకాయన.

మళ్ళీ అతనే అన్నాడు “స్కూల్లో టీచర్ గత తరం ఎదుర్కొన్న పోస్ట్ ట్రామటిక్ స్ట్రెస్స్ డిసార్డర్ (విపత్తుల అనంతరం ప్రత్యక్ష సాక్షులను వెంటాడే భయం) గురించి చర్చించినట్టుంది”.

“ఏం చెప్పారు మీ అమ్మాయికి” ఒక కళాకారిణి అడిగింది. బహుశా ఆమె వయసు నలభైల్లో ఉండొచ్చు.

“ఆ ప్రశ్న నన్ను కొద్ది రోజులు వెనక్కి తీసుకెళ్ళింది. నిజానికి యుద్ధం మిగిల్చిన గాయాలు నాకు పెద్దగా ఏమీ లేవు. అదే చెప్పాను. కానీ వెంటనే మా అమ్మాయి “మరి నాయనమ్మ సంగతో? యుద్ధం ప్రభావం ఉందా ఆమె జీవితం మీద?” అనడిగింది. వెంటనే జవాబు చెప్పలేక పోయాను, ఏడవటం మినహా. ఎందుకంటే యుద్ధం సమయంలోనే మా అమ్మ చనిపోయింది. అంత్యక్రియలకు కూడా వెళ్లలేక పోయాను”.

ఆమె అంది “నా యవ్వనం అంతా యుద్ధం వల్ల వృథా అయిపోయిందనిపిస్తుంది. ఆ పదిహేనేళ్లనూ అసలు లెక్కే వెయ్యకూడదు. నా స్నేహితుల్లో చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండి పోయారు. అసలే మా ఇళ్లలో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆనవాయితీ”.

నా వైపు తిరిగి అంది ‘యుద్ధ సమయంలో మీరెక్కడ ఉన్నారు?”

“ఇక్కడే, బీరూట్ లోనే ఉండిపోయాను”

“ఇక్కడా? అంటే జెమాయ్ జే కాలనీ లోనా?”

“కాదు, వెస్ట్ బీరూట్‌లో. పెళ్ళయ్యాక అక్కడి నుంచి మారిపోయాను. అప్పటికి యుద్ధం ముగిసి పోయిందనుకోండి”

“యుద్ధం మొదలు కాగానే నేను పారిస్ వెళ్ళిపోయాను” మాకు ఆతిథ్యం ఇస్తున్న మిత్రురాలు అంది.

“ఇక్కడుండే రిస్క్ తీసుకోలేక పోయాము. అప్పుడే మాకు బాబు పుట్టాడు. మా ఆయన తన ఉద్యోగాన్ని పారిస్‌కి మార్చుకోగలిగాడు. ఇక్కడే లెబనాన్‌లో ఉండుంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చుండేది”

కాసేపు ఆలోచనలో పడ్డాను. తర్వాత అన్నాను

“యుద్ధపు రోజులు నాకైతే అంత ఘోరంగా ఏమీ లేవు. ఆ రోజులు చాలా ప్రత్యేకమైన అనుభవాలు. జీవితాన్ని చాలా గాఢంగా అనుభవించిన రోజులు”

“గాఢంగానా?”

“అవును, యుద్ధం మీద ఎవరి ఆలోచనలు వాళ్ళకుండేవి. ప్రతి అనుభవమూ ఎంతో స్పష్టంగా ఉండేది. సరిగ్గా చెప్పలేక పోతున్నాను గానీ ప్రతి క్షణమూ జీవం నిండినట్టు అనిపించేది. చుట్టూ ఉన్న పరిస్థితుల మీద గాఢమైన కవితలు ఆ రోజుల్లోనే ఎన్నో రాశాను. యుద్ధం ముగిశాక అంత గొప్పగా ఏమీ ఫీల్ కాలేదు నేను”

“1986 వేసవి నాకు బాగా గుర్తుంది..” నా భర్త అందుకున్నాడు

“ఎటూ వెళ్ళకుండా బీరూట్ లోనే మిగిలి పోయిన వాళ్లలో నేనొకడిని. మా ఆవిడ పుట్టింటి వాళ్లంతా అమెరికా వెళ్తూ వాళ్ల అపార్ట్మెంట్ తాళాలు నాకిచ్చి వెళ్ళారు. జారిఫ్ ప్రాతంలో ఆరో అంతస్తులో ఉండేది వాళ్ల ఇల్లు. రోజూ వాళ్లింట్లో ఉండే పిల్లికి తిండి పెట్టి, మొక్కలకు నీళ్ళు పోయడం నా పని. నా చెల్లెలు కుటుంబం కూడా ఉత్తర పర్వత శ్రేణుల ప్రాంతానికి వెళ్తూ వాళ్ల ఇంటి తాళాలు కూడా నాకే ఇచ్చి వెళ్లారు. జాఫిర్ నుంచి పది నిమిషాల నడక దూరంలో ఏడో అంతస్తులో ఉంది వాళ్ల అపార్ట్మెంట్. వాళ్ళకీ పిల్లి ఉంది ఇంట్లో. ఈ రెండు ప్రాంతాలకీ అరగంట నడక దూరంలో క్రేటమ్ ప్రాంతంలో పదకొండో అంతస్తులో నా అపార్ట్మెంట్ ఉంది. అప్పటికే 14 ఏళ్ళుగా యుద్ధం జరుగుతోంది. పైగా నేను మారొనైట్ (లెబనాన్‌లో స్థిర పడిన సిరియా దేశపు క్రైస్తవుడు) ని కావడంతో వెస్ట్ బీరూట్ మాత్రమే నాకు మిగిలిన ప్రదేశం.

తన యుద్ధ కాలపు అనుభవాలను శ్రద్ధగా వివరిస్తున్నాడు

“ఆ వేసవిలో బాంబుల వర్షం మరీ ఎక్కువైంది. పెట్రోల్ కొరత. కనీసావసరాలకు కూడా తడుముకోవాల్సి వచ్చేది. కరెంట్ ఉండేది కాదు. ఇక నేనొక అలవాటు చేసుకున్నా. పదకొండో ఫ్లోర్ నుంచి మెట్ల మీదుగా దిగి స్పోర్ట్స్ క్లబ్‌కి నడుచుకుంటూ వెళ్ళి ఒక గంట ఈత కొట్టేవాడిని. తల స్నానం చెయ్యాలంటే పోయి ఉప్పునీళ్ళ సముద్రంలో దిగాల్సిందే. ఎందుకంటే ఫ్లాట్స్‌కి నీటి సరఫరా ఉండేది కాదు. క్రమం తప్పకుండా బీచ్‌కి వచ్చే వాళ్లతో చదరంగం ఆడేవాడిని. చల్లని గాలులతో మధ్యదరా సముద్రం కొంత సాంత్వన ఇచ్చేది మాకు”

అతిథులంతా ఆసక్తి గా వింటున్నారు.

“ప్రతి మధ్యాహ్నమూ నడుచుకుంటూ మా చెల్లెలు ఇంటికి వెళ్ళి ఏడు ఫ్లోర్‌లు ఎక్కి, పిల్లికి తిండి పెట్టి, కిందకి దిగి జారిఫ్ రోడ్డుకి వెళ్ళి అత్తగారింట్లో పిల్లికి తిండి పెట్టి, మా ఇంటికి వెళ్ళి పదకొండు ఫ్లోర్‌లూ ఎక్కి ఇల్లు చేరడం ఇదీ నా దినచర్యలో భాగం. మెట్లు ఎక్కడానికి రక రకాల పద్ధతులు కనిపెట్టేవాడిని సులభంగా ఉండేందుకు.

నిదానంగా ఒకే వేగంతో ఎక్కడం ఒక పద్ధతి. దాని వల్ల శక్తి కొంత ఆదా అవుతుంది. అంకెలు వెనక్కి లెక్క పెడుతూ ఎక్కడం మరో పద్ధతి. ఎన్ని ఫ్లోర్లు ఇంకా మిగిలి ఉన్నాయి అనే దాని కంటే ఇంతవరకూ ఎన్ని ఫ్లోర్లు ఎక్కాం? అన్న ఆలోచన బావుండేది

సాయంత్రం వేళ మా పొరుగాయన్ని కలిసేవాడిని. చాలా కరుగ్గా కనిపించే సున్నీ ముస్లిమ్ ఆయన. రెండు అపార్ట్మెంట్స్ మధ్యా ఒక మూలగా ఉన్న చోట్లో మాట్లాడుకునే వాళ్ళం. ఇలాటి మూలలు, సెల్లార్లో ఉండే గరాజ్‌లు వంటివే కాస్త క్షేమంగా ఉండే స్థలాలు యుద్ధ సమయంలో. యుద్ధానికి ముందు జనం ఒకరినొకరు పట్టించుకునే వారే కాదు. ఒకరినొకరు ఎరగనట్టు చూసుకునే వారు. యుద్ధం మొదలయ్యాక, ఒకరి అవసరం ఒకరికి ఉందని తెల్సి, కుదిరినపుడల్లా కల్సి ఎక్కువ సమయం గడపటం మొదలు పెట్టారు, బతికి బట్టగట్టడం చాలా ముఖ్యమని తెలుసుకున్నారు” ఈ మాటలు అంటున్నపుడు ఆ యుద్ధపు రోజుల్ని తల్చుకుంటున్నట్టు ఆయన చూపులు ఎక్కడో దూరాన నిలిచాయి

“అంతకు ముందు ఒకరినొకరు చూసుకోని మా పొరుగాయనకి నాకూ కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయని మాటల్లో తెలిసింది. బాటరీ దీపం గుడ్డి వెలుతురులో విస్కీ తాగుతూ చాలా విషయాలు మాట్లాడుకునే వాళ్లం.”

“‘మారొనైట్’ పొరుగాయన చాలా గొప్ప మనిషి – అని స్నేహితులకు చెప్పే ఉంటాడు”

మా ఆయన మాటలకు అతిథులంతా గల గలా నవ్వారు

“తమాషా అయిన విషయం ఏంటంటే, బాంబుల వర్షం ఆగిపోయి,కాల్పుల విరమణ జరిగి, యుద్ధం ముగిశాక, చాలా ఘోరంగా తయారైంది నా పని. నేనే కాదు, యుద్ధ సమయంలో లెబనాన్‌ని విడిచి పోకుండా ఇక్కడే ఉండి పోయిన వారందరి స్థితి అదే.

‘అమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుని సంతోష పడటానికి బదులు, చాలా నిరాశ పడ్డాను.

దారి తప్పి పోయినట్టు అనిపించేది. ఎక్కడెక్కడికో శరణార్ధులుగా వెళ్ళిన వారంతా తిరిగి వచ్చారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదంతా నాకు దుస్సహంగా తోచింది. అలా తిరిగి వచ్చిన వాళ్ళెవరికీ, ఇళ్ళ గోడల మీద, రోడ్ల మీద పడిన బాంబు పేలుళ్ళ గుంటల చరిత్ర తెలీదు. ఆ పరిస్థితి వాస్తవంలో ఎలా ఉంటుందో వాళ్లు ఎరగరు. అప్పుడు మేము అనుభవించిన పరిస్థితులు, మనుషుల మధ్య యుద్ధం నాటిన స్నేహం, ఇవేవీ వాళ్లకు తెలీవు. మామూలుగా ఉండేవారు.

మామూలు పరిస్థితులు నెలకొని, జనం ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా మారి పోతుంటే నాకు వాంతొచ్చినంత పనయ్యేది” తను ఆపాడు

పార్టీ హోస్ట్ తలూపింది

“ఇదిగో, పదిహేనేళ్ల తర్వాత ఇక్కడ కూచుని, ఇంకా మనం ఆ యుద్ధం కబుర్లే చెప్పుకుంటున్నాం”

పల్చని మల్లెరేకులు గాలిని సన్నగా వణికిస్తూ, తన పరిమళంతో మమ్మల్ని చుట్టేశాయి. తెల్లని మల్లె పూలు రాలి మా వొళ్ళో పడ్డాయి.

~ ~

మూల రచయిత్రి : మిష్కా మౌజబ్బార్ మౌరాని
తెలుగు: సుజాత వేల్పూరి

Fragrant Night (From the book “Hikayat” by Lebanese women writers)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here