యుద్ధం కంటే నేను చిన్నవాడిని!

0
11

[పాలస్తీనా యువ కవి మోసాబ్ అబూ తోహా రచించిన ‘Younger Than War’ అనే కవితని తెలుగులో అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of Mosab Abu Toha’s poem ‘Younger Than War’ by Mrs. Geetanjali.]

[dropcap]మీ[/dropcap]తో కొంచెం నా బాల్య జ్ఞాపకాలు పంచుకోవాలని ఉంది.. వింటారు కదూ?
అప్పుడు యుద్ధ ట్యాంకులు వంకాయ పొలాల మీదుగా
దుమ్ము రేపుకుంటూ దొర్లుకుంటూ పోతున్నాయి.
రాత్రయింది.. ఇంకా పక్కలు పరవనే లేదు
తమ్ముడు.. పొగల మేఘాల మధ్య దూసుకు పోతూ ఆకాశాన్ని
మెరిపిస్తున్న యుద్ధ విమానాలను చూడ్డానికి ఆత్రంగా కిటికీ దగ్గరికి పరిగెడతాడు.
యుద్ధ విమానాలు.. కాస్త వాలిపోయి ఊపిరి తీసుకుందామనుకునే
చెట్ల కొమ్మల కోసం వెతికే గధ్ధల్లా ఉన్నాయి.
కానీ ఈ లోహపు గద్దలు రక్తం ఎముకలు నిండిన
సూప్ గిన్నెల్లో మనుషుల ఆత్మల్ని పట్టుకునే పనిలో పడ్డాయి.
ఇక్కడ రేడియో అవసరమే లేదు.. మేమే ఒక వార్త ఈ పాలస్తీనా గడ్డ మీద!
మెషీన్ గన్స్ బుల్లెట్లతో చీమల చెవుల్ని బద్దలు కొడుతుంటాయి.
సైనికులు పుస్తకాలు కూడా కాల్చేస్తూ ఉంటారు.
వాళ్ళల్లో కొంతమంది వార్తా పత్రికల్ని చుట్టేసి మంటల్లో కాల్చేస్తూ ఉంటారు
అచ్చం వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చేసినట్లుగా!
మరి కొంతమంది సైనికులు ఆ మంటలతో నిదానంగా సిగరెట్లు వూదేస్తూ ఉంటారు.

ఇక మా పిల్లలం ఎలా ఉంటామో చెప్తా వినండి!
మా పిల్లలు మాత్రం చీకటి నిండిన బేస్మెంట్లలో..
కాంక్రీటు పిల్లర్ల వెనకాల మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని
చావు భయంతో దాక్కుంటూ ఉంటారు.
ఏడుస్తున్న పిల్లలకి అమ్మానాన్నలు ధైర్యం చెపుతూ ఉంటారు.
చెమ్మ బారిన బేస్మెంట్లలో.. మంటలు చిమ్మే బాంబుల వేడి
ఆ పిల్లలని మెల్లిగా మృత్యువుకి దగ్గర చేస్తుంది.

మీకు నా చిన్నప్పటి విషయం మరొకటి చెబుతాను..
అది సెప్టెంబర్ 2000 సంవత్సరం.
ఒక రోజున రాత్రి నేను బాజారు నుంచి భోజనానికి రొట్టెలు తెస్తున్నాను..
అప్పుడు ఆకాశంలో పైనుంచి మా ఇంటి దగ్గరలో ఉన్న టవర్ లోకి
మండుతున్న రాకెట్‌ని వదులుతున్న
రాక్షసి లాంటి హెలికాఫ్టర్‌ని నేను చాలా దగ్గరగా వణికి పోతూ చూసాను.
ఒక కాంక్రీట్ గాజు ముక్క చాలా పై నుంచి కిందికి పడ్డ
కర్ణ కఠోర శబ్ధం వింటూ భీతిల్లిపోతూ ఏడ్చాను.
నేను తెచ్చిన రొట్టెముక్కలు వడలిపోయాయి.
మీకు తెలుసా.. అప్పటికి నా వయసు కేవలం ఏడేళ్లే!
యుద్ధం కంటే సరిగ్గా ఒక దశాబ్ద కాలం చిన్నవాణ్ణి నేను.
బహుశా ఈ బాంబుల వయసు కంటే కొంచెం పెద్దవాడినై ఉండొచ్చేమో!
అవును అప్పుడు నేను యుద్ధం కంటే చాలా చిన్నవాణ్ణి..
అచ్ఛం ఇప్పుటి యుధ్ధాన్ని చూస్తూ వణికిపోతున్న
నా కన్న పిల్లల్లా.. చాలామంది పిల్లల్లా!

~

మూలం: మోసాబ్ అబూ తోహా

అనుసృజన: గీతాంజలి


మోసాబ్ అబూ తోహా పాలస్తీనా యువ కవి. ప్రస్తుతం భార్యా, ముగ్గురు పిల్లలతో జబాలియా లోని ఐక్యరాజ్యసమితి శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్నాడు. యుద్ధం, బాంబుదాడులపై తన పిల్లల భయాలను ఈ కవితలో వ్యక్తం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here