యుగపురుషుడు – జాతిపిత

0
5

[box type=’note’ fontsize=’16’] “దిక్కు తోచకుండా కటిక చీకటిలో నిలిచిపోయి అగమ్యగోచరంలో తిరుగాడుతు, తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న బ్రతుకులకు దారిచూపిన దీపశిఖ గాంధీజీ” అంటున్నారు ఎ. మోహన్ మురళి కుమార్ “యుగపురుషుడు – జాతిపిత” అనే వ్యాసంలో. [/box]

[dropcap]1[/dropcap]869 సంవత్సరము అక్టోబరు రెండవ తారీకున పోరుబందరులో పుత్లీబాయ్ కరమచంద్ గాంధీలకు మోహన్ దాస్ కరమ్‌చంద్ అనబడే మహాత్మా గాంధి ఒక శుభ ముహూరాన భారతీయుల బ్రతుకులలో గరళమును మధించి, విరిచి తేనె నందివ్వ, కన్నవారి కీర్తి నిలుపుటకు ఉదయించెను. పోరుబందరులో పుట్టిన ఆ యుగపురుషుడి జీవితం భారతదేశ ప్రజల హితం కోసమే నిరంతరం అంకితం. గాంధీ ఒక విజ్ఞాన గని. వివేకవంతుడు. ఒక గొప్ప ప్రవక్త. ఒక బుద్ధుడు, ఒక జీసెస్ క్రీస్తు. భారతీయులకు ‘జాతిపిత’, ఒక ఆరాధ్యదైవం. మాటల్లో చెప్పలేనంత గౌరవం, భక్తి శ్రద్దలు. ఆయన నోటిమాట కోసం చకోరంలా ఎదురు చూశారు. ఆయన నడిచిన దారిలోని పవిత్రమైన పాద ధూళిని శిరసున దాల్చారు. భారతీయులకు, తమ దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించి నిర్జనారణ్యంలో దిక్కు తోచకుండా కటిక చీకటిలో నిలిచిపోయి అగమ్యగోచరంలో తిరుగాడుతు, తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న బ్రతుకులకు దారిచూపిన దీపశిఖ. ఆయన సిద్ధాంతాలు నచ్చనివారు కూడ ఆయన వ్యక్తిత్వానికి, పట్టు సడలని ధైర్యానికి ఆయన వ్యతిరేకులు కూడ శిరసు వంచి నమస్కరించారు. భారతీయులకు, వెలుగు దివ్వెలందించి, దాస్యశృంఖలాలను తునుమాడి, స్వాతంత్ర్య ఫలాలను అందించుటకు, కుసుమకోమల మానస కోవిదుడు, మమతాను మూర్తి మహాత్మాగాంధి అవతరించాడు. గాంధీ తండ్రి దివాను. తల్లి ఆదర్శమూర్తి. వీరిద్దరి సంరక్షణలో చిన్న తనములోనే హిందూమత సిద్ధాంతాలను ఆకళింపు చేసుకున్న సర్వమత సిద్దాంత మూర్తి, మహెూన్నత మూర్తి, జనవంద్యుడు. ఆశల బ్రతుకులు ఎండిన మానవాళికి కంటక రహిత మార్గమును చూప కంకణ బద్దుడైన కఠోర నియమ బద్ధుడు.
హైస్కూలు చదువులో ఉండగానే పదవమూడ ఏట అప్పటి హిందూత్వ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్ల ననుసరించి కస్తూరిబాయ్‌తో వివాహం జరిగింది. గాంధీ హైస్కూలులో సామాన్య తెలివితేటలు గల విద్యార్థి. సిగ్గు, బిడియాలు ఎక్కువ. అయినా మొక్కవోని విశ్వాసం గలవాడు. ధైర్యం గలవాడు. ఉపాధ్యాయుడి ఆదేశాలను పక్కన బెట్టి భయపడకుండా అబద్ధమాడకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పి అధికారుల మెప్పుపొందిన అభిమానధనుడు. కాలేజ చదువుల తరువాత తండ్రి అభీష్టం మేరకు. 1888, సెప్టెంబరు నాలుగున బారిష్టరు చదువులకై ఓడలో లండన్ బయలుదేరాడు. ఆరోజులలో విదేశాలకు వెళ్ళటానికి ఒప్పుకునేవారు కాదు. పైగా అక్కడ మద్యానికి, మాంసాహారాలకు అలవాటు పడతాడేమోనని పుత్లీబాయ్ భయం. అందుకని ఆ రెండిటిని ముట్టనని ప్రమాణం చేస్తేనే లండన్ ప్రయాణానికి ఒప్పుకుంటానని షరతు విధించింది. స్వతహా నిష్టాగరిష్టుడైన గాంధీ వాటిని ముట్టుకోడు. అయినా తల్లి కోరిక మేరకు ఆమెకు మాటిచ్చి జీవితాంతం పట్టుదలగా ఆచరించిన వాడు.
మాహాత్మా గాంధీ మహా ధీరుడు. నిగ్రహపరుడు. మేరునగ సమానుడు. వినయ విధేయతలు కలవాడు. నిజాయితీ పరుడు, నిజాన్ని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవాడు. మృదు హృదయుడు, రసార మోహనుడు. పేదవారి దుర్భర దారిద్ర్యం చూసి చలించిపోయిన గాంధి అన్ని సుఖాలను త్యజించి పేదవారిలాగానే జీవించిన ధనిక దారిద్ర్యుడు. పేదవారిలాగే దుస్తులు ధరించి వారిలాగే జీవనం సాగించిన పరమ యోగి. పేదవారిని చీదరించుకొనుటను చూసి పేదవారికి, అణగారిన ప్రజలకు కూడా ఆత్మ ఉంటుందని, వారిలో భగవంతుడిని దర్శించిన మహా జ్ఞాని. చరితార్థుడు.
1891లో బారిష్టరు పట్టాపొందిన గాంధీజి న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టాడు. కాని చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేక సౌతాఫ్రికాలో ఒక సంస్థలో న్యాయ సలహాదారుగా చేరాడు. అక్కడ తెల్లవాళ్ళు నల్లజాతీయుల మీద చూపిస్తున్న వివక్షతను తట్టుకోలేకపోయాడు. తెల్లవారితో సమానంగా వారి పక్కన కూర్చుంటారా అంటూ రైలులోంచి కిందకు తోసివేయటం చూసి గాంధీ సహించ లేకపోయాడు. అప్పుడే తెల్లవారు నల్లజాతీయుల పట్ల ప్రదర్శిస్తున్న జాతి వివక్షతను ఎదుర్కొనాలన్న ధృఢసంకల్పం మొగ్గతొడిగి విరిసింది. లేవోయి, దీక్ష వహించి రావోయి కష్టమెదుర్కొను కర్మవీరుడా అని గాంధీజీ జీవితాశయానికి మార్గదర్శకత్వం నిర్దేశించింది. అహింస, చట్టాల ఉల్లంఘనలతో అక్కడి తెల్లవారి ప్రభుత్వం బిగి సడలి గాంధీతో ఒప్పందానికి మొగ్గు చూపటంతో వివక్ష కాళరాత్రికి సూర్యోదయం అయింది. ఈ విజయంతో గాంధీ సంతృప్తి చెందక తన మలియుద్ధం భారతదేశాన్ని వ్యాపారం పేరుతో చాపక్రింద నీరులాగా చేరి, సంస్థాధీశుల మధ్య ఆవేశకావేషాలు రగిల్చి, సుఖ సంపద సౌభాగ్యాలతో తులతూగుతున్న భారతదేశాన్ని చూసి, అక్రమంగా ఆక్రమించి, అధికారాన్ని చేజిక్కుంచుకుని స్వదేశంలోనే వారిని – (భారతీయులను) బానిసలుగా చూస్తున్న తెల్లదొరల మీద ప్రకటించాడు. రక్తపాతం లేని, నూతన ఆయుధాలను, “సత్యాగ్రహం” , “అహింస” లతో మరణ మృదంగాలు లేని చట్టాల ఉల్లంఘనలతో ఆంగ్లేయుల పొగరునణచి వారి మనో నిబ్బరాన్ని కకావికలం చేశాడు . ఖేడా, చంపారన్ రైతులను కూడ గట్టుకొని “సత్యాగ్రహం” నెరపి నిశ్శబ్ద యుద్ధానికి నాంది పలికాడు. ఆ మొదటి విజయమే గాంధీజీకి “బాపు, మహాత్మా” బిరుదులు వరించాయి. ఈ విజయంతో గాంధీజీ ఆత్మవిశ్వాసం మరింత బలపడ్డది. 1921 సంవత్సరంలో భారతీయుల దాస్య విముక్తికి, సంపూర్ణ స్వాతంత్ర్యానికై ఆంగ్లేయుల మీద సహాయనిరాకరణ ఆయుధంతో నిశ్శబ్ద యుద్ధ ప్రకటనకు మనసులోనే సంకల్పించాడు. 1930, మార్చి పన్నెండున చరిత్రలో నిలిచిపోయిన చారిత్రక ఘట్టం పేదవారు ఉపయోగించే ఉప్పు మీద పన్నును నిరసిస్తూ వందలాది కార్యకర్తలతో “దండి” యాత్రను నిర్వహించి సాగర తీరాన ఉప్పును తయారు చేసి, చేయించి పౌరచట్టాల ఉల్లంఘన సమరానికి బీజం వేశాడు. “రౌలత్” చట్టానికి వ్యతిరేకంగా అకుంఠిత దీక్షతో ‘సత్యాగ్రహం’ చేపట్టి మరోసారి తన అసమ్మతిని, ఆగ్రహాన్ని వెలిబుచ్చాడు. పులిమీదపుట్రలాగా శాంతియుతంగా సభ జరుపుకుంటున్న వారిపై తెల్లవారు కాల్పులు జరిపి అనేకమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. శాంతి, సౌజన్య నిర్మల హృదయానికి ఆంగ్లేయులపై ద్వేషము మర్రిచెట్టు ఊడలలాగా అనేక శాఖలై అంగ్లేయుల అధికారాన్ని చుట్టుముట్టింది. చరఖా మీద నూలు వడికి విదేశీ వస్తు బహిష్కరణ నినాదం, పన్నుల చెల్లింపు నిరాకరణలో ఆంగ్లేయులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించాడు. 1942 ఎనిమిది ఆగష్టున ‘క్విట్ ఇండియా’ నినాదంతో భారతీయులను సమాయత్తం చేసి, స్వాతంత్ర్య సముపార్జనమీద సడలని పట్టుదలను భారతీయుల హృదయాలలో నాటాడు. లార్డ్ మౌంట్ బ్యాటన్ గాంధీని “ఒన్ మ్యాన్ పీస్ ఆర్మీ” గా అభివర్ణించాడు.
గాంధీజీ ఆశయం సంపూర్ణ స్వరాజ్యం, భారతదేశమంతా ఒక్కటిగా అన్ని మతములు మనోజ్ఞ తరంగమాలలాగా ఉండాలని బలీయమైన ఆకాంక్ష. కాని, జిన్నా పట్టుదల, ఆంగ్లేయుల కుట్రతో భారతదేశం రెండు ముక్కలైంది. 1947, ఆగష్టు పదిహేను ఆర్ధరాత్రి ఆంగ్లేయులు స్వాతంత్ర్యమును ఇచ్చి భారత దేశమును వీడిరి. విభజన సమయంలో భారతదేశంలో ఉన్న ముస్లిములు, పాకిస్థాన్‌లో ఉన్న భారతీయులు అటు ఇటు మారుతున్న సమయంలో మత హింసలో పెద్ద ఎత్తున హిందువులు హతమైతే, అప్పుడు కూడా ప్రతీకారవాంఛ లేకుండా అహింసను పాటించమని గాంధీజీ ఉధ్బోధించాడు. ముస్లిములకు గాంధీజీ అనుకూలురు, ఆయనవలననే ఆర్ధిక సహాయం కూడా అందిందని కొంతమంది హిందువులలో ఒక అపోహ, దురభిప్రాయం బలంగా నాటుకున్నది. కారణమేదైతేనేం, బిర్లామందిరానికి ప్రార్ధనకి వెళ్ళే సమయంలో, 1948, జవవరి, ముప్పది తారీకున సాయంకాలం ఐదు గంటల పదిహేను నిముషాలకు “నాధూరామ్ గాడ్సే’ మూడు రౌండ్లు కాల్పులు జరుపగా గాంధీజి పెనుగాలి తాకున తావులు కూలునట్లుగా చూడ్కులు చెమ్మగిల్లగా, “హే రామ్” అంటూ గాంధీజి అమరులైనారు. భారత దేశమేకాదు, యావత్ ప్రపంచం దు:ఖ సముద్రంలో మునిగి కన్నీరు మున్నీరయంది.
గాంధీజీ ఆశయాలు మహెూన్నత శిఖరాలు, మొక్కవోనివి. హరిజనుల పట్ల జాలి, కరుణ. అశృశ్యతా నివారణకు, బహుజనులకు సమాజంలో సమున్నత స్థానం కోసం కలలు కన్నారు, ప్రయత్నాలు చేశారు. ఆయనకు ఇష్టమైన భజన “రఘుపతి రాజారామ్”, ఆరాధించే దైవము శ్రీరాముడు.. అనుసరించే గ్రంధము ‘భగవద్గీత’. ‘చెడు కనకు, చెడు చూడకు, చెడు వినకు’ ఆయన నినాదము. అహింస, సత్యాగ్రహం, సహాయనిరాకరణాలే ఆయన ఆయుధాలు, స్వదేశీ వస్త్రాలంటే మక్కువ. అందుకే ఆయన రోజూ చరఖా మీద నూలు వడికి అందరికి ఆదర్శ ప్రాయుడైనాడు. అంటరానితనాన్ని ఆయన సహించే వాడు కాదు. అన్ని రంగాలలో అసమానతలను అధిగమించాలని, బహుజనులకు సముచిత స్థానం కొరకు పోరాటాలు చేశాడు. వారిలో భగవంతుడున్నాడనే వాడు. హిందూ ముస్లిముల ఐక్యత కొరకు ఎనలేని కృషి చేశాడు. అందరు అన్నదమ్ములలాగా, చల్లని పాల వెన్నెలలా, పవిత్రమైన గంగానదిలా, మత, కుల బేధం లేకుండా కలసి పోవాలని, కాంక్షించాడు. శాంతి స్థాపన ఆయన ఆశయం, ఆయన మానసమే, మహెూన్నత హిమాలయం.
ఆయన వీరాధి వీరుడు కాదు, శూరాధి శూరుడు కాదు, దండనాయకుడు కాదు, మల్ల యోధుడు కాదు, అస్త్ర, శస్త్ర విన్యాసాలు లేవు, కత్తి యుద్ధాల ఖణఖణలు లేవు. మరి, ఆయన ఆయుధాలు, నిరాహార దీక్షలు, శాంతి అహింసలే ఆయన మనోబలాలు, సామాన్య ప్రజలే సైనికులు. స్వాతంత్ర్య సమరాన ఉక్కుమనిషి. రవి అస్తమించని రాజ్యాధిపతులను గడగడలాడించి, కొల్లాయి, చేతికర్రతో ఝుళిపించి ఆంగ్లేయుల మదిని కలవరపరచి, స్వాతంత్ర్యమును సాధించిన ఘనుడు, యుగపురుషుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here