యుక్కివుండు ఎవరు?

0
9

[box type=’note’ fontsize=’16’] విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, త్రిపురనేని గోపీచంద్‍ల సాహిత్యం గురించి, వారి అభిమానుల గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు కోవెల సుప్రసన్నాచార్య. [/box]

[dropcap]”యు[/dropcap]క్కివుండు చెరిపి పదిసార్లు తిరుగవ్రాసినన్‌ మొక్కవోదు యీ ఆంధ్రకవిలోక మూర్ధ్న మణుల మద్గురుస్థానముల్‌ నలంకరించి..” అని పూర్వకవి స్థుతి సందర్భంగా వారి వారి ప్రత్యేకతలు వివరిస్తూ విశ్వనాథ ఈ పద్యం రాశారు. పద్యం చివర తిరుగవ్రాయడమేమిటో.. చెరిపి తిరుగ వ్రాయడమేమిటో తెలిసే అంశం కాదు. యుక్కివుడు అని, ఒక దుష్టుడని పేర్కొన్నది ఎవరినో ఒకరిని ఉద్దేశించింది కావచ్చు. 1957-58లలో తెలుగు ప్రాంతం నుండి కవులు వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడుతున్నప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి కూడా ఆలిండియా రేడియో ఉద్యోగం సందర్భంలో ఇక్కడికి వచ్చారు. నాకు, కొందరు నా మిత్రులకు వారితో సన్నిహితంగా మెలగే అవకాశం వచ్చింది. ఆయన ఉపన్యాసాలను ఇష్టంగా విన్న రోజులు. ఆ తర్వాత ఆయన గొంతు మూగబోవడం అందరితోనూ ఆయన రాత ద్వారానే రాయడం, సంభాషించడం జరిగింది. ఈ రాత పుస్తకాలు కట్టలు కట్టలుగా ఏర్పడ్డాయి. వీటిలో ఆయన మనస్సులోని భావాలు, వ్యాఖ్యానాలు, అనుకూల వ్యతిరేక భావనలు రికార్డు చేయబడ్డాయి. ఆయన అనంతరం వాటిని ఎడిట్‌ చేసి ప్రచురించాలని భావించారు కానీ అది కొనసాగలేదు. రేడియో స్టేషన్‌లో ఉన్నప్పుడు నేను, మాదిరాజు రంగారావు ఆయన్ను కలుస్తూ ఉండేవాళ్లం. సాధారణంగా ఆకాశవాణిలో రచయితలు వచ్చి కలిస్తే కార్యనిర్వాహకులు ప్రోగ్రాముల కోసం యాచించడానికి వచ్చినట్టుగా భావించేవారు. మేము కలిసినప్పుడల్లా కృష్ణశాస్త్రి గారు  మమ్మల్ని కూడా ప్రోగ్రాములు అడగటానికి వచ్చినట్టుగా భావించేవారు. ఒకసారి మాట్లాడిన తర్వాత మీ అడ్రస్సులు రాసి ఇచ్చి పోండి అనేవారు. ఇది ప్రలోభ పెట్టే పర్వం. మేము అప్పటికే కొంత కీర్తిగల రచయితలమే అయినా.. విద్యార్థులం కావటం వల్ల ప్రోగ్రాములను ఆశించే పరిస్థితిలో ఉండేవాళ్లం కాము.
ఆయన మా వంటి కుర్రవాళ్లతో చనువుగా, ప్రేమగా మాట్లాడేవారు. వారింట్లోనే కాటూరి వెంకటేశ్వరరావుగారిని, శివశంకరశాస్త్రిని నేను చూశాను. కాటూరివారితో నాకు అంతకుముందే పరిచయముండేది. శివశంకరశాస్త్రిగారు అంతకుముందే నేను ఇంటర్మీడియట్‌ చదివేరోజుల్లో వరంగల్‌ వచ్చినప్పుడు ఒక సమావేశంలో బహుశా కవిసమ్మేళనం కావచ్చు. పాల్గొంటూ మేమందరం ‘బ్యాంక్రప్ట్‌ కవులము.. విశ్వనాథ ఒక్కడే బ్యాంకర్‌ కవి’ అన్నారు. ఇక కృష్ణశాస్త్రి గారికి ఒక విచిత్రమైన అలవాటుండేది. ‘మీకు నచ్చిన ప్రాచీన కవుల్లో పది మంది పేర్లు రాయండి’ అని మావంటి యువకులను అడిగేవారు. అప్పుడు ఎవరి అభిమానాన్ని బట్టి వారు రాసేవారు. ఈ అంశం నాకు చిరకాలం నుంచి గుర్తున్నది. ఆయన నిర్యాణానికి ముందు మద్రాసులో తంగిరాల వెంకట సుబ్బారావు, నేను పోయినప్పుడు కూడా ఆయన ఈ ప్రశ్న వేశారు. నాకు తోచిందేదో అప్పుడు రాశాను. “చెరిపి తిరుగవ్రాసే” అంశం ఇదే కావచ్చు.
1958-1961 ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభల మధ్య సాహిత్య వైరాలు బాగానే కొనసాగాయి. ఈ సందర్భంలో విశ్వనాథ కరీంనగర్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా ఉండటం వల్ల హైదరాబాద్‌ రావడం తరుచుగా జరిగేది. ఆ రోజుల్లో మేమిద్దరం రామకోటి శాస్త్రి, మొదలి నాగభూషణ శర్మ కలిసి రసధుని అనే సాహిత్య సంస్థను స్థాపించి కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో సాహిత్య సమాలోచనలు నిర్వహించాం. 1958లో విశ్వనాథను గురించిన సాహిత్య సమాలోచన రెండురోజులు నిర్వహించడం జరిగింది. ఆ వ్యాసాలు అన్నీ స్రవంతిలో అచ్చయ్యాయి. తర్వాత శ్రీశ్రీ సాహిత్య సమాలోచనం కూడా నిర్వహించడం జరిగింది. ఆ రోజుల్లోనే జువ్వాడి గౌతమరావు గారు జయంతి పత్రికను నిర్వహించేవారు. ఆయన సాహిత్యధార పేరుతో సమకాలీన పత్రికల్లో వచ్చిన రచనల గూర్చి తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు. ఆ వ్యాఖ్యల వల్ల విశ్వనాథ వైరివర్గం హైదరాబాద్‌లో పెరిగింది. ఈ కారణంగా అలాంటి సమాలోచనలు హైదరాబాద్‌లో నెలకొని ఉన్న ఇతర ప్రముఖ కవుల విషయంలో అప్పుడు జరుగలేదు. ఆ విధంగా ఈ రసధుని వారిని జయంతి వారిని ‘విశ్వనాథ చెక్కభజనపరులు’గా ముద్రవేయటం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ చదువుతున్న మేము ఒక పట్టుదలతో రెండుమూడు సంవత్సరాలు కల్పవృక్ష పఠన కార్యక్రమాలు ఏర్పాటుచేశాం. అది కొంతవరకు ఇతర కవులకు మామీద అనిష్టాన్ని పెంచింది. నేను ఎంఏ ఫైనల్‌లో ఉండగా మా శాఖాధ్యక్షుడు ప్రొఫెసర్‌ లక్ష్మీరంజనం గారిని కలిసిన సందర్భంలో బహుశా కృష్ణశాస్త్రిగారే కావచ్చు నా మీద ఒక అసత్యాన్ని ఆయనతో చెప్పారు. ఆయన దాచుకోకుండా తెల్లవారి డిపార్ట్‌మెంట్‌లో తనను కలిసినప్పుడు అయన అమాయకంగా ‘మీరెంత పండితులైనా కావచ్చు.. మమ్మల్ని గూర్చి అనుచిత వ్యాఖ్యలు చేయడం న్యాయం కాదు’ అన్నారు. ‘నా డిగ్రీ సరైంది కాదని మీరన్నారట’ ఆ మాట వల్ల ఎంత హాని జరుగటానికి వీలుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. కానీ నేను వెంటనే ‘అన్నది ఫలానావారా’ అని అడిగాను. దాంతో ఆయన ఈ వ్యాఖ్య చేసిన వారియందు ఉండే విశ్వాసాన్ని తొలిగించుకొన్నారు. నాకు దానివల్ల నష్టమేం జరుగలేదు. గురుప్రీతియే మిగిలింది.
ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకుల్లో త్రిపురనేని గోపీచంద్‌ ఉండేవారు. ఆయనతో మా రామరాజుగారు నేను వసుచరిత్రమీద రీసర్చ్‌ చేస్తున్నానని చెప్తే తనను వచ్చి కలవమన్నారు. తనను కలిసి నేను చేసిన చర్చ వల్ల వసుచరిత్ర పరిచయంలో దానిలోని ప్రతీకాత్మక భావన మూడు పొరలుగా రచన నిర్వహించడం అనే కొత్త దారి దొరికింది. ఆయన నాతో కొన్ని రేడియో నాటికలు కూడా రాయించారు. వాటిలో వసుచరిత్ర ఆధారంగా రచించిన శుక్తిమతి అనే నాటిక ఒకటి. ఆయనకు నాకు అరవిందుల తాత్త్విక నేపథ్యం అనే అంశం సాన్నిహిత్యాన్ని పెంచింది. ఆయన మరణానంతరం నేను ప్రచురించిన అధునా అన్న ఖండకావ్యం ఆయనకే అంకితం చేశాను. గోపీచంద్‌ తన కార్యక్రమ నిర్వహణ కాలంలో ఆంధ్రసాహిత్య చరిత్రను పది రూపకాలుగా రేడియోలో ప్రసారం చేయాలని భావించారు. ఆ రచన కూడా విశ్వనాథచేతనే రాయించాలని ఆయన ఉద్దేశం. ఈ కార్యక్రమ స్వరూపాన్ని నిర్వహించే సమావేశం జరిగినప్పుడు మొత్తం సాహిత్య చరిత్రను పది భాగాలుగా విభజించి ప్రాచీన సాహిత్యాన్ని గురించి ఏడు భాగాలు, ఆధునిక సాహిత్యాన్ని గురించి మూడు భాగాలు ఉండాలని నిర్ణయం చేశారు. ఆ సందర్భంలో కృష్ణశాస్త్రిగారు ‘అన్నగారూ.. మీరు మొదటి ఏడు రూపకాలు రాయండి.. నేను మిగతా మూడు రూపకాలు రాస్తాను’ అని విశ్వనాథ వారితో అన్నారట. దానికి విశ్వనాథ అన్నీ మీరే రాయండి అన్నారట. దాంతో మొత్తం రూపకాల రచన విశ్వనాథకే అప్పగింపబడింది. ఈ రూపకాల నిర్వహణ సందర్భంలో గోపీచంద్‌ పాలకుర్తికి ప్రయాణమై వరంగల్లు రావడం, నేను ఆయన బృందంలో చేరి పాలకుర్తికి పోవడం జరిగింది. పాల్కురికి సోమనాథుడు చెన్నమల్లు సీసములు అన్న రచన చేస్తూ ఒక్కో పద్యం చెప్పి.. ఒక్కో మెట్టు దిగుతూ జీవసమాధి అయినాడని ఆ నాళ్లలో ఒక కథ వ్యాపించి ఉండేది. ఆ సన్నివేశాన్ని రికార్డు చేసే సందర్భంలో ఎంత చక్కగా సాంకేతికతను వాడుకున్నారో నేను కళ్లారా చూశాను.
గోపీచంద్‌ గారు త్రిపురనేనివారి కుమారుడే అయినా ఆయన భావముద్ర దగ్గర ఆగిపోలేదు. తర్వాత ఆయన రాయిస్ట్‌ అయినాడు. శ్రీఅరవిందుల అనుయాయి అయినాడు. ప్రాచీన సాహిత్యమందు అత్యంత గౌరవం కలవాడయినాడు. భారత సంస్కృతి మూలాలను, సాంస్కృతిక జాతీయ పక్షం నుండి అర్థం చేసుకున్నాడు. ఆయన శ్రీఅరవిందుల లైఫ్‌ డివైన్‌ చదువటం గురించి మాట్లాడుతూ.. వారి గీతావ్యాసములు అన్న గ్రంథం చదివి.. లైఫ్‌ డివైన్‌ చదివితే దాన్నొక నవలలాగా చదువుకోవచ్చు అన్నారు. పరమేశ్వరశాస్త్రి వీలునామాలో శ్రీఅరవిందుల దర్శనాన్ని వర్ణించి ఆయన తత్త్వాన్ని సరళంగా, సుబోధకంగా వివరించారు. ఒకసారి ఆంధ్రపత్రిక సంపాదకుడు శంభుప్రసాద్‌ ఆంధ్ర సాహిత్య రూపకాల టెక్స్ట్‌ కావాలని (భారతిలో ప్రచురణ కోసం) విశ్వనాథ వారికే రాయండి అని చెప్పారు. అట్లాగే వేయిపడగలమీద విమర్శనాత్మక వ్యాసం రాయండి వెయ్యి నూట పదహార్లు ఇస్తామని శంభుప్రసాద్‌ అడిగితే నేను రాయలేను అని గోపీచంద్‌ చెప్పారట.
పురాణ గాథల గూర్చి త్రిపురనేనివారు విశ్వనాథవారు ఎంతగా పోట్లాడుకున్నా.. వ్యవహారికవాదుల గూర్చిన సందర్భం వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి వాళ్లను తిట్టేవారు. వారిద్దరూ తిరుపతి వెంకటకవుల శిష్యులు. వెంకటశాస్త్రిగారికి ఇద్దరి యందు అమితమైన వాత్సల్యమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here