అలనాటి అపురూపాలు-14

0
10

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

దంటు హేమలత: విధి వంచనా లేక ప్రేమ వైఫల్యమా?

తెరపై హాస్యం పండించినా, నిజ జీవితంలో విషాదాన్ని నింపుకున్న కళాకారులెందరో. హీరో హీరోయిన్లే కాకుండా సహాయపాత్రలు ధరించేవారిలోనూ ఇలాంటి సంఘటనలు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. దంటు హేమలత వారిలో ఒకరు.

హేమలత 1921లో పెద్దాపురంలో జన్మించారు, కానీ ఆమె బాల్యమంతా ఎక్కువగా బందరులో గడిచింది. బాల్యం నుంచే నటనపై మక్కువ పెంచుకున్నారావిడ. సినిమాలలో తన అదృష్టానికి పరీక్షించుకునే ముందుగా ఆమె రంగస్థలంపై అతి చిన్న పాత్రల నుంచి పూర్తి నిడివి పాత్రల వరకూ నటించారు.  కొద్దిగానే చదువుకున్నా, ఆమె గొప్ప మర్యాదస్తురాలు. దర్శకులు జగన్నాథ్ (సుప్రసిద్ధ రచయిత్రి కళ్యాణి సుందరి భర్త. ఆమె కథలు ‘అలరాస పుట్టిల్లు’, ‘మాడంత మబ్బు’ ఆ రోజులో బాగా పేరుపొందాయి) హేమలతని గుర్తించి ‘భలే పెళ్ళి’ (1941) సినిమాలో ఒక వేషం ఇచ్చారు. ఆ సినిమాలో ఆమె చక్కని హాస్య పాత్ర పోషించారు. ఆ సినిమాలో ఆమె, సహపాత్రధారుడు డాక్టర్ శివరామకృష్ణయ్య చేసిన సందడికీ, ప్రేక్షకులు రేకులెగిరిపోయేలా నవ్వారట. కామెడీ ఆర్టిస్టుగా బాగా ప్రసిద్ధులయ్యారామె. అయితే హాస్యనటి అని ముద్ర పడడం ఇష్టం లేక ఆమె సీరియస్ పాత్రల వైపు మొగ్గు చూపారు. కె. వి. రెడ్డి గారిని కలిసి తనకి గంభీరమైన పాత్రలు ఇవ్వవలసిందిగా కోరారు. అయితే హాస్యనటిగా ఆమెకి ఉన్న ఇమేజ్ సీరియస్ పాత్రలు పోషించడంలో ప్రతిబంధకం అవుతుందని ఆయన అంగీకరించలేదు. తనని నిరాశపరచవద్దని ఆమె ఆయనను బ్రతిమాలుకున్నారట. చివరికి ఆమే నెగ్గారు. ‘భక్త పోతన’ (1943) సినిమాలో నాగయ్య భార్యగా సీరియస్ పాత్ర లభించింది. ఒక కామెడీ ఆర్టిస్టు ఈ పాత్రని ఎలా పోషించారో చూడాలని విమర్శకులు అందరూ శ్రద్ధగా పరిశీలించారట. ఆ పాత్రలో ఆమె చూపిన హుందాతనానికి సుప్రసిద్ధ దర్శకులు బి.ఎన్. రెడ్డి ఆమె అభిమానిగా మారారు. తన విభిన్నమైన నటనతో ఒక్కసారి విమర్శకులందరి నోళ్ళు మూయించారు. దేవత, తెనాలి రామకృష్ణ, అపవాదు, జీవన్ముక్తి, సత్యభామ, ఘరానా దొంగ, పత్ని, చెంచులక్ష్మి, భీష్మ, లక్ష్మమ్మ, పరమానందయ్య శిష్యులు, భలే రాముడు, బ్రతుకు తెరువు, అనార్కలి తదితర సినిమాలలో నటించారు. ‘త్యాగయ్య’ సినిమాలో త్యాగయ్య సోదరుడు జపేశంగా నటించిన లింగమూర్తి భార్యగా హేమలత నటించారు. అప్పటి నుంచి ఆమెను ‘ఆంధ్రా లలితా పవార్’ అని వ్యవహరించసాగారు. ‘గృహప్రవేశం’ సినిమాలో ఆమె పోషించిన ‘తులసమ్మక్క’ పాత్రని ఎవరు మరిచిపోగలరు? అందరినీ కలుపుకుపోయే స్వభావం ఉన్న హేమలత ప్రతీ ఒక్కరికీ వినోదం అందించేవారు. షూటింగ్ విరామాల్లో ఆమె కొంటె కబుర్లు, ఆమె కవితలూ అందరినీ ఆకర్షించేవి. ఆమె ముందు నవ్వినా, వెనుకగా ఆమె పెద్దాపురం నేపథ్యం చూపించి, ఆటపట్టించేవారు జనాలు. అందరితో సరదాగా ఉండే తన స్వభావం వల్ల ఆమె ‘ఒకరి’ ఆకర్షణకు లోనయ్యారు. ప్రేమ, వ్యథల ఈ సంబంధంలో ఆమె కృశించిపోయారు. ఆమె ‘మంత్రదండం’ అనే సినిమాని నిర్మించి, ‘మంత్రదండం హేమలత’గా ప్రసిద్ధులయ్యారు. ‘గౌరీ మహత్యం’ అనే సినిమాని కూడా నిర్మించారు. ‘కలికాలం’ అనే సినిమా ప్రారంభించారు గాని అది అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ‘ఋష్యశృంగ’ సినిమా హక్కులు తొలుత హేమలత వద్దే ఉండేవి, కాని ముక్కామల ఆ హక్కులు తీసుకుని హారనాథ్, రాజసులోచనలతో ఆ సినిమా తీశారు. ఆమె ప్రియుడు వ్యసనాలకు బానిసకాగా, ఆమె తన భర్తనీ, కూతురిని నిర్లక్ష్యం చేశారు. అతన్ని మార్చాలని ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ‘రోజులు మారాయి’ (1955) చిత్రం తర్వాత ఆమె పేరు అంతగా వినబడలేదు. సినీ పరిశ్రమలో ఆమె కున్న ఏకైక స్నేహితురాలు లక్ష్మీకాంత (‘పాతాళబైరవి’ సినిమాలో ‘వగలోయ్ వగలు’ పాటకి ప్రసిద్ధి. ఈ నర్తకి కథ కూడా విషాదాంతమే) మాత్రమే. తరువాతి కాలంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నారని కొందరంటారు. సహజ మరణమేనని మరికొందరంటారు. ఏదేమైనా ఒక అద్భుతమైన నటిని కోల్పోవడం విషాదమే. ఆమె కూతురు విజయవాడలో నివసిస్తారట, అంతకు మించి పెద్దగా వివరాలేవీ తెలియవు!

“నిజమైన ప్రేమలో ఎన్నో ఉంటాయి. అత్యంత దుర్భరమైన, కఠినమైన వ్యథలను కూడా తట్టుకుంటుంది. అగ్నిపరీక్షలో నెగ్గే ప్రేమ పవిత్రమైనదే, కానీ బాధలని తట్టుకున్న వ్యథాభరితమైన ప్రేమ ఇంకా గొప్పది.”

కానీ, అయ్యో! మంత్రదండం హేమలత జీవించిలేరు. కేవలం 36 ఏళ్ళ వయసులో 1957లో కన్నుమూశారు.

   


అపురూపమైన స్నేహానికి అద్దం పట్టిన చిత్రం ‘దోస్తీ’:

ప్రేమ, స్నేహం లేనిదే మనిషి జీవితం సంపూర్ణం కాదు. ‘దోస్తీ’ (1964) ఇద్దరు టీనేజ్ బాలుర కథ. అనాథ, కుంటివాడైన రాము (సుశీల్ కుమార్); అంధుడైన మోహన్ (సుధీర్ కుమార్) విధివశాత్తు కలుస్తారు, స్నేహితులవుతారు. వీరి కథ హృద్యంగానూ, ప్రేరణాత్మకంగానూ ఉంటుంది. వైకల్యం, అవరోధాలు, విపత్తులును అధిగమించిన ఈ అపురూపమైన స్నేహం – మానవత్వం పట్ల భరోసానీ, విశ్వాసాన్ని సజీవంగా నిలిపింది. ప్రజలకు స్నేహం, సౌహార్ద్రతల సందేశమిచ్చిన ఇటువంటి సినిమా భారతీయ సినీతెరపై మరొకటి రాలేదు. ఈ చిత్రానికి సత్యేన్ బోస్ దర్శకులు, తారాచంద్ బర్జాత్యా నిర్మాత. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ అద్భుతమైన సంగీతానికి మజ్రూహ్ సుల్తాన్‌పురి అజరామరమైన గీతాలను అందించారు.

‘స్టార్స్’ లేని ఈ సినిమా – రాజ్‌కపూర్ నటించిన ‘సంగం’ సినిమాతో పోటీపడి – ఆ సంవత్సరపు ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకుంది.

ఈ సినిమా బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ వారి ‘బెస్ట్ హిందీ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు కూడా గెలుచుకుంది.

గొప్ప మానవతావాదం, పురోగమన కథాంశం వల్ల ‘దోస్తీ’ నాల్గవ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ, పలు ఇతర అంతర్జాతీయ చిత్రోత్సవాలలోనూ గుర్తింపు పొందింది.

ఈ సినిమా సాధించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డులు:

  • ఉత్తమ చిత్రం – తారాచంద్ బర్జాత్యా
  • ఉత్తమ కథ – బాణ్ భట్
  • ఉత్తమ సంగీతం – లక్ష్మీకాంత్ ప్యారేలాల్
  • ఉత్తమ సాహిత్యం – మజ్రూహ్ సుల్తాన్‌పురి
  • ఉత్తమ నేపథ్య గానం (పురుషులు) – మహమ్మద్ రఫీ
  • ఉత్తమ సంభాషణలు – గోవింద్ మూనిస్

ఈ సినిమా ఆ ఏడాది జాతీయ ఉత్తమ చిత్రంగా కూడా ఎంపికైంది.

ఈ సినిమాని ‘స్నేహం’ పేరిట తెలుగు, మళయాలంలో పునర్నించారు.


బాలనటుల ఆర్జనపై చట్టానికి కారకుడు జాకీ కూగన్:

మనం సినిమాలలో ఎందరెందరో బాల నటులను చూస్తూ ఉంటాం. ఎంత బాగా నటించినా వాళ్ళ ఆదాయంపై వాళ్ళకి నియంత్రణ ఉండదు. తన సంపాదనను దురుపయోగం చేస్తున్నారంటూ కేసు వేసి, అమెరికాలో బాల నటుల సంపాదన గురించి ‘కూగన్స్ యాక్ట్’ అనే చట్టం వచ్చేలా చేసినది జాకీ కూగన్.

జాకీ కూగన్ రంగస్థల నటుల కుటుంబంలో 1914లో లాస్ ఏంజిలిస్‌లో పుట్టారు. చిన్నారి జాకీకి తమకి తెలిసినదంతా – నటన, నృత్యం, గానం – నేర్పించారు తల్లిదండ్రులు జాన్, లిలియన్. జాకీ తొలిసారిగా నాలుగేళ్ళ వయసులో 1919లో రంగస్థలంపై ప్రదర్శన ఇచ్చారు. ఆ ప్రదర్శన ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ ప్రదర్శనని చార్లీ చాప్లిన్ వీక్షించారు. చిన్నారి కూగన్ గురించి “ఈ పిల్లాడు ఏం చేసినా, ఈ క్రురాడిలోని ప్రతీదీ ఆకర్షణీయంగా ఉంది” అని రాశారాయన. కూగన్‌కి సహజంగా అనుకరణ శక్తి ఉంది, తమ సామర్థ్యాలతో చాప్లిన్‌ని అబ్బురపరిచారు. మరుసటి సంవత్సరం చాప్లిన్ తన మూకీ కామెడీ డ్రామా ‘ది కిడ్‌’లో ట్రంప్ అనే అనాథ పిల్లాడి పాత్రని జాకీ కూగన్‌చేత చేయించారు. 1922లో ఫ్రాంక్ లాయిడ్ దర్శకత్వం వహించిన ‘ఆలీవర్ ట్విస్ట్’ కూగన్ ప్రధాన పాత్ర పోషించారు. వ్యాపార ప్రకటనలలో అత్యధికంగా నటించిన తొలితరం బాలనటులలో కూగన్ ఒకరు. పీనట్ బటర్, స్టేషనరీ, విజిల్స్, బొమ్మలు, రికార్డ్సు, కళాకృతులు వంటి ప్రకటనలో కూగన్ నటించారు. ఎంతగానో డబ్బొచ్చింది. అప్పట్లో అది సుమారు నాలుగు బిలియన్ డాలర్లు (నేటికి మూడు బిలియన్ డాలర్లు). అయితే 12 ఏళ్ళ లోపు పిల్లలు ఎంత సంపాదించవచ్చనేది ఏ చట్టము చెప్పకపోవడంతో అతని కాంట్రాక్టులనూ, పెట్టుబడులను ఆయన తండ్రి చూసుకునేవారు. పెద్దయ్యాక తన డబ్బంతా తనికిస్తాననే మాటని విశ్వసించారు జాకీ. కానీ 1935లో జరిగిన ఒక యాక్సిడెంట్‍లో ఆయన తండ్రి తీవ్రగాయల పాలవగా, అతని తల్లి అర్థర్ బెర్నెస్టీన్ అనే వ్యక్తిని రెండో పెళ్ళి చేసుకున్నారు. 1935 అక్టోబరులో తనకి 21 ఏళ్ళ వయసు వచ్చే వరకు తన ఆస్తి భద్రంగానే ఉందనుకున్నారు కూగన్. అప్పటికి ఐదు నెలల క్రితం మరణించేంత వరకు ఆయన తండ్రి ఆయన ఆస్తిని బాగానే సంరక్షించారు. అయితే మొత్తం డబ్బుని తన తల్లి, సవతి తండ్రి అర్థర్ బెర్నెస్టీన్ – ఫర్ కోట్స్, వజ్రాలు, బంగారం, ఖరీదైన కార్లకు ఖర్చు చేశారని జాకీ కూగన్ తెలుసుకున్నారు. కూగన తల్లి, సవతి తండ్రి మాత్రం కెమెరా ముందు నటించడం కూగన్‌కి చాలా ఇష్టమని, బాగా ఆస్వాదించేవాడని పేర్కొన్నారు. “జాకీకీ ఏమీ ఇస్తామని ఎన్నడూ మాట ఇవ్వలేదు. అతను చెడ్డ బాలుడు” అని తన తల్లి ప్రకటించింది. 1938లో వారిపై కేసు వేశారు కూగన్. తన కోర్టు ఖర్చులు పోనూ, 1,26,000 డాలర్లు మాత్రమే ఆయనకు వచ్చాయి. తర్వాత ఆయన్ని కష్టాలు చుట్టుముట్టాయి, సాయం కోసం చార్లీ చాప్లిన్‍ని అర్థించగా, ఎటువంటి సంకోచాలు లేకుండా చాప్లిన్ వెయ్యి డాలర్లు సాయం చేశారట.  ఈ కోర్టు కేసు బాల నటులపై అందరి దృష్టి పడేలా చేసింది. ఫలితంగా 1939లో ది కాలిఫోర్నియా చైల్డ్ యాక్టర్స్ బిల్… దీన్నే తరచుగా కూగన్ యాక్ట్ లేదా కూగన్ లా అని అంటారు, చట్టం అయ్యింది. ఈ చట్టం ప్రకారం – బాల నటుల యజమాని వారి ఆదాయంలో 15% ఒక ట్రస్ట్‌లో (దీన్ని కూగన్ ఎకౌంట్ అంటారు) వేయాలని నిర్ణయించారు. అంతే కాకుండా బాల నటుల చదువు, పనిగంటలు, విరామం ఇలాంటివన్నీ పర్యవేక్షించాలని ఆదేశించారు.

చార్లీ చాప్లిన్‍, కూగన్‌ల నటనని ఈ క్రింది వీడియోలో చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here