విలయ విన్యాసం

1
10

[box type=’note’ fontsize=’16’] “శివుడు అసత్యం కాదు. మిథ్య ఎంతమాత్రం కాదు. అన్నింటికీ మించిన నిజం. మహాప్రళయానంతరం మానవులకు, నాగరికత వికాసానికి గొప్ప మార్గం చూపించేవాడు ఈశ్వరుడు” అంటున్నారు కోవెల సంతోష్‌కుమార్ ఈ వ్యాసంలో. [/box]

[dropcap]శి[/dropcap]వుడు.. మహాదేవుడు.. భారతీయులకు సంబంధించినంతవరకు ప్రత్యక్షదైవం. నిరంతరం మన మధ్యే తిరుగాడే దేవుడు. ఖగోళ మండలంలో ఉన్న నగరాల నుంచి భూమికి దిగివచ్చి మనుషులను ఉద్ధరించిన దేవుడు. మనం పూజించే దేవతలకు ఆయన నాయకుడు. అనంతమైన మంచితనానికీ.. అసాధారణమైన వినాశనానికి శక్తిరూపం ఈ శివుడు. ఆయన చేతిలో త్రిశూలం ఆయుధంగా ఉంటుంది. ఆయన దారిలో ఏది అడ్డం వచ్చినా విధ్వంసం చేస్తుంది. భారతీయ సంప్రదాయంలో సృష్టి జరుగాలంటే.. ముందుగా వినాశనం జరగాలన్నది విశ్వాసం. లయకారకుడైన శివుడు ప్రళయాన్ని సృష్టించి వినాశనం చేస్తాడు. ఆ తర్వాత ప్రకృతిపురుషులైన ఆదిదంపతుల (శివపార్వతులు) ద్వారా పునఃసృష్టి జరుగుతుందని విశ్వాసం. ఈ భూమండలంలో మనుషులను, సమస్త జీవజాలాన్ని ఆకాశంలోని లోకాల్లో ఉన్న అనేకమంది జన్మించింది దేవీదేవతల అనుగ్రహం వల్లనేనని హిందువులు విశ్వసిస్తారు. ఇది నిజమేనా? భూమిపై జీవజాలం సృష్టికి.. మానవ పరిణామ వికాసానికి ఇతర గ్రహాల్లో ఉన్న జీవులు సహాయం చేశారా? వాళ్లలో ఎవరీ శివుడు.. రకరకాల పేర్లతో పూజించే ఈయన నిజంగా దేవుడా? లేక పాశ్చాత్యులు, ఖగోళ శాస్త్రవేత్తలు భావించే గ్రహాంతరవాసా? నిజంగా దేవతలు మనుషులకు సహాయపడ్డారా? అదే నిజమైతే మానవలోకం భవిష్యత్తు శివుడిపై ఆధారపడి ఉందా? అనేక ప్రశ్నలు.. వాటికి సమాధానాలు ఏమిటి? శివుడి స్వరూప స్వభావాలపై.. విశ్వాసాలపై.. చరిత్రపై ఇతరుల పరిశోధనలు శాస్త్రీయపరమైన విశ్లేషణలు చేస్తున్నాయి. సో కాల్డ్ హేతువాదులెవరూ నమ్మని వేదాల నుంచి.. రకరకాల పురాణాలు.. ఇతిహాసాలు.. ఫిలాసఫర్ల రచనలన్నింటి మదింపు ఇప్పుడు జరుగుతున్నది. లక్షలకొద్దీ పేజీల రచనలు ఉన్నాయి. వందలు వేల సంవత్సరాలుగా మౌఖికంగా కొనసాగుతూ వచ్చిన సాహిత్యం ఉన్నది. ఈ సాహిత్యమంతా చెప్పింది ఏమిటి? అందులోని హేతుబద్ధత ఎంత? ప్రపంచంలోని ఇతర సంస్కృతులు, ధర్మాలు చెప్తున్నదేమిటి? వీటన్నింటిపైనా విస్తృత పరిశోధన జరుగుతున్నది.

భారతదేశం.. దాదాపు 20 లక్షల చదరపు మైళ్లు ఉన్న దేశం. ప్రపంచంలో ఏడవ అతిపెద్ద విస్తీర్ణం గలిగిన దేశం. దాదాపు 150 కోట్ల మందితో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద జనాభా కలిగిన దేశం. ప్రపంచంలోనే అతి పురాతనమైన నాగరికత కలిగిన దేశం మనది. ఇక్కడ పుట్టిన సాహిత్యమైనా, పురాణమైనా, ఇతిహాసమైనా.. తొట్టతొలిదైన వేదమైనా.. మనిషితో, మట్టితో, పంచభూతాలతో సంబంధం లేకుండా లేవు. భారతీయధర్మం ప్రకారం దేవతలు మిథ్య కాదు. వాళ్లు ఖచ్చితంగా ఉన్నారు. పిలిస్తే వస్తారు. కనిపిస్తారు. సహాయం చేస్తారు. పాశ్చాత్య దేశాల్లోని మత ధర్మాల కంటే.. భారతదేశంలో దేవతల పట్ల విశ్వాసం అత్యంత బలమైనది. భూమికి పైన ఏడు లోకాలు ఉన్నాయి. ఈ లోకాల నుంచి దేవతలు లేదా గ్రహాంతరవాసులు భూమ్మీదకు దిగివస్తారని చెప్తారు. మనకు ఇతిహాసాలున్నాయి. ఇవి మనకు చరిత్రే కానీ.. మిథ్య కాదు.. కథో.. కవనమో కాదు. మన దగ్గరే కాదు.. యూదు-క్రైస్తవ ధర్మాల్లో కూడా దేవుడు.. లేదా ఇతరలోకాల నుంచి వచ్చిన జీవులు మనకంటే ఎంతో శక్తిమంతులు.. సమర్థులు. వేదాల ప్రకారం దేవతలు వాళ్ల లోకాల నుంచి మనకు తమ టెక్నాలజీని ట్రాన్స్‌ఫర్ చేశారు. ప్రాచీన ఖగోళశాస్త్ర సిద్ధాంతకర్తలకు ఒక సందేహం వచ్చింది. ఈ మతపరమైన గ్రంథాల్లో జరిగిన చర్చంతా దైవసంబంధమైనదేనా? లేక గ్రహాంతరవాసులతో మనిషికి సంబంధాలను కూడా చెప్తున్నాయా? అని.. అభివృద్ధి చెందిన పాశ్చాత్యదేశాలన్నీ గ్రహాంతరవాసులున్నారనే కాన్సెప్ట్‌ను బలంగా నమ్ముతాయి. అదే సిద్ధాంతాన్ని కాస్త డిఫరెంట్‌గా భారతదేశం దేవతలుగా, దైవత్వంగా విశ్వసిస్తుంది.

మహాభారత ఇతిహాసాన్ని భారతీయ ధర్మం పంచమవేదమని చెప్తుంది. ఇందులో మనకు ఎగిరే విమానాల ప్రస్తావన ఉన్నది. అంతకుముందు రామాయణ కాలంలోనే రావణుడు విమానాన్ని వాడాడు. విమాన మరమ్మతు కేంద్రం నిర్మించాడు. ప్రత్యేక విమానాశ్రయం నిర్మించాడు. హనుమంతుడు లంకకు వెళ్లినప్పుడు ముందుగా కాల్చింది ఈ రవాణా వ్యవస్థనే. ఇప్పటికీ లంకలో దీని ఆనవాళ్లు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మహాభారతంలో కూడా మనకు ఎగిరే విమానాల ప్రస్తావన ఉన్నది. వాయిస్ యాక్టివేటెడ్ వెపన్స్ (ధ్వని ప్రకంపనలు సృష్టించే ఆయుధాలు) కూడా వాడినట్లు కనిపిస్తుంది. న్యూక్లియర్ ఆయుధాలలో నాగరికతల ధ్వంసం జరిగినట్లు మహాభారతం ద్వారా తెలుస్తుంది. మహాభారతంలోనే మరో ప్రస్తావన కూడా కనిపిస్తుంది. భూమికి అన్ని వైపులా పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయని ఈ నగరాల నుంచి చిన్న చిన్న వాహనాల ద్వారా భూమి మీదకు రాకపోకలు జరిగినట్లుగా తెలుస్తుంది. ఆ రోజుల్లో స్పేస్‌షిప్ అన్న పదం లేదు. అందుకే మనవాళ్లు వాటిని నగరాలు అని ఉండవచ్చు ఈ వాహనాలను విమానాలుగా పేర్కొన్నారు. వీటి తయారీపై ఒక శాస్త్ర గ్రంథాన్నే రాశారు. ఈ విమానాల ద్వారా భూమ్మీదకు వచ్చినవారు ఇక్కడి మనుషులకు టీచర్లుగా వ్యవహరించారు. విజ్ఞానాన్ని అందించారు. గ్రహాంతరాళాల నుంచి భూమ్మీదకు జరిగిన రాకపోకలకు మార్గదర్శనం చేసింది శివుడు. దేవతలు కానీ, దేవదూతలు కానీ భూమి మీదకు వచ్చి తిరిగి వెళ్లేందుకు భగభగ మండే విమానం ద్వారా భూమ్మీదకు వచ్చి వెళ్లారు. మన దేవతలందరిలో నటరాజమూర్తి అయిన శివుడికి నటరాజ రూపంలో చుట్టూ కనిపించే జ్వాలావలయాలు ఈ విమానానికి ప్రతీక. ఈ చిదంబర రహస్యాన్ని ఛేదించడం అంత తేలికైన విషయం కాదు. దేవుడికి రూపం కల్పించింది నిస్సందేహంగా మనిషే అయినప్పుడు అతని ఊహకు ఆ రూపం ఎలా తట్టింది? కల్పనకు కూడా ఏదో హేతువు ఉంటుంది. ఈ ఆలోచనను అందుకుని ముందుకు వెళ్తే సమాధానం దొరకవచ్చేమో. శివుడి గురించి సంభావించేప్పుడు ప్రధానంగా ఆయన రూపం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన చేతిలో ఉండే త్రిశూలం.. ముక్కోటి దేవతల్లో ఆయనకు మాత్రమే కనిపించే మూడో నేత్రం.. ఎవరికీ అంతుపట్టకుండా ఉన్న ఆయన నివాసమైన కైలాసం.. దేవతలందరిలో ఆయనకు మాత్రమే ఉన్న మరోరూపం శివలింగం.. ప్రళయకారుడైన ఆయన చేసే లయ విన్యాసం.. ఆయనలోని అర్ధనారీశ్వర తత్వం.. అన్నీ ప్రత్యేకతలే..

శివ రహస్యం

శివుడిని మహాదేవుడని కూడా పిలుస్తారు. మహాదేవుడంటే గ్రేట్ గాడ్ అని అర్థం. అంటే దేవతలకే దేవుడని అర్థం. అందరిలోనూ అత్యంత శక్తిమంతుడు శివుడు. ఆయన ప్రధాన విధి లయించడం. సృష్టి నశించకపోతే పునఃసృష్టి సాధ్యంకాదు. అది శివుడివల్లనే జరుగుతున్నది. ఎలా చెప్పగలుగుతున్నాం? భారతీయ ధర్మంలో దేవతల స్వరూప స్వభావాల వెనుక పెద్ద ఫిలాసఫీయే దాగుంది. సృష్టి నిర్మాణ, వికాస పరిణామాలతో దేవతలకు సంపూర్ణమైన భాగస్వామ్యం ఉన్నది. నిరాకార, నిరంజనుడైన పరమేశ్వరుడికి ఆయన స్వభావోక్తమైన స్వరూపాన్ని కలిపించారు. శివుడిలో.. అగ్ని ఉన్నది (మూడో కన్ను). ఆకాశమున్నది (నెలవంక), నీరున్నది (గంగ), మనిషి కలిసిపోయే మట్టి లోనే ఆవాసమున్నాడు. గాలిని ఆహారంగా తీసుకొనే పాములను మెడలో వేసుకొన్నాడు. జంతు చర్మాన్ని ధరించాడు. శ్మశానవాసి అయి తానే లయకారుడయ్యాడు. ప్రకృతి పురుషుల మమేకంతో అర్ధనారీశ్వరుడై.. దాంపత్య ధర్మానికి ఆదిగా నిలిచి సృష్టి నిర్మాణ కార్యాన్ని నిర్వహించాడు. ఆయన చేతిలోని ఢమరు ధ్వనిని పుట్టించింది. త్రిశూలం మన శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్న నాడులకు ప్రతీకాత్మకమైంది. అత్యంత శక్తిమంతమైనది. ఒక్కమాటలో చెప్పాలంటే విశ్వం (యూనివర్స్) లోని అన్ని ఎలిమెంట్స్ మనకు శివుడిలో కనిపిస్తాయి. అందుకే ఆయన్ను మహాదేవుడన్నారు.

శివుడి చేతిలోని డమరు నాదంతో సృష్టి నిర్మాణం జరుగుతుందని భారతీయ ధర్మం చెప్తుంది. ఆయన చేతిలోని త్రిశూలం సృష్టిని లయం చేస్తుంది. ముక్కోటి దేవతల్లో శివుడికి మాత్రమే మూడో కన్ను ఉన్నది. ఇది అగ్నిస్థానం. జ్ఞానానికి ప్రతీక. మనిషిలోని పీనియల్ గ్లాండ్సే మూడోకన్ను అని కూడా అంటారు. ఈ కన్ను తెరిస్తే దానికి కనిపించే ప్రాంతమంతా భస్మమైపోవలసిందే. దక్షిణ భారతదేశంలోని చిదంబరంలోని నటరాజమూర్తి రూపం శివుడి చుట్టూ జ్వాలావలయాలు ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ రూపాన్ని చూసిన ఆస్ట్రోనాట్ శాస్త్రవేత్తలు ఈ రూపం వెనుక ఉన్న వాస్తవాన్ని కనుగొనేందుకు ప్రయత్నించారు. శివుడి ఈ రూపాన్ని చిత్రించిన.. లేక శిల్పీకరించిన మన ప్రాచీనులు జ్వాలా వలయాలను ఎందుకు పెట్టారు. ఇదేమైనా భగభగమండే విమానమా? ఇలాంటి ఏదైనా వాహనంలో శివుడు భూమ్మీదకు వచ్చాడా? దీన్ని మనవాళ్లు చూసి చిత్రించారా? నటరాజమూర్తి రూపం ఎలా ఆవిష్కారమైంది? దీనికి ఇప్పటివరకూ విస్పష్టమైన సమాధానమైతే దొరకలేదు. ఇక్కడ ఉన్న స్వామి ఆకాశలింగం. ప్రపంచంలో నిరాకారుడిగా, శూన్యంగా ఉన్న శివుడి రూపం ఇక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది. దాని పక్కనే మనకు నటరాజమూర్తి ఉంటారు. ఆకాశ లింగానికి, నటరాజమూర్తికి మధ్య కార్యకారణ సంబంధం దేన్ని సూచిస్తున్నది? ఆకాశ లింగం శూన్యరూపం. నటరాజమూర్తి చుట్టూ ఉన్న జ్వాలలు స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రతిబింబిస్తున్నాయి. రోదసి నుంచి ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఈశ్వరుడు భూమ్మీదకు వచ్చివెళ్లాడు. ఇతర దేవతలు.. దేవదూతలు ప్రత్యేక విమానాల్లో భూమ్మీదకు రాకపోకలు సాగించారు. మానవులకు అసాధారణమైన విజ్ఞానాన్ని అందించి వెళ్లారు. ఇందుకు ఉదాహరణలు మనకు కొల్లలుగా కనిపిస్తాయి. మనదేశంలోనే అత్యంత అద్భుతమైన దృష్టాంతాలు కన్పిస్తాయి. వాటిలో ఒకటి భౌమాస్త్రం.

భౌమాస్త్రం

భారతదేశం.. ఔరంగాబాద్ జిల్లా.. ప్రసిద్ధమైన ఎల్లోరా గుహలు.. ఆధునిక మానవులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దేవతలు అందించారనడానికి నిలువెత్తు సాక్ష్యమిది. ఎల్లోరా గుహలు, సొరంగాలు ఇవాల్టికీ ఎవరికీ అంతుపట్టని రహస్యాలుగానే ఉన్నాయి. ముంబై నగరానికి ఈశాన్యం వైపున దాదాపు 200 మైళ్ల దూరంలో ఉన్న అత్యద్భుతమైన దేవాలయ సముదాయమిది. సుమారు మైలు పొడవున విస్తరించి ఉన్న 34 ఆలయాలు చాలా ప్రాచీనమైనవి. ప్రస్తుత రూపంలో మనకు కనిపించే ఆలయాలు క్రీస్తుశకం 600 నుంచి క్రీస్తుశకం 1000 మధ్యలో నిర్మించినట్లు ఇప్పటి చరిత్రకారులు భావించినప్పటికీ వీటి అసలు నిర్మాణం అంతకు ముందు ఎన్నో ఏండ్లకు ముందు జరిగిందని ఖగోళశాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ఎల్లోరా గుహల్లో 16వ గుహను కైలాస్ దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయంలో అత్యంత భారీ శివుడి విగ్రహం మనకు కనిపిస్తుంది. సుమారు మూడంతస్థుల ఎత్తులో.. ఏథెన్స్ లోని పార్థెనాన్ విగ్రహానికి రెండింతలు ఎత్తున ఈ విగ్రహం ఉంటుంది. నిలువెత్తు కొండను పై నుండి కిందకు చెక్కుతూ విగ్రహాన్ని రూపొందించినట్లు విగ్రహ నిర్మాణాన్ని చూస్తే అర్థమవుతుంది. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు నాలుగు లక్షల టన్నుల రాతిని పగులగొట్టి తొలగించాల్సి వచ్చిందని చరిత్రకారులు అంచనావేశారు. పురాతత్వ శాస్త్రవేత్తల నిర్ధారణ ప్రకారం ఎల్లోరాలోని కైలాస ఆలయాన్ని 18 సంవత్సరాలలో నిర్మించారు. ఆధునిక కాలంలో ప్రతిరోజూ 12 గంటలు ఎలాంటి విరామం లేకుండా 18 సంవత్సరాలు పనిచేస్తే కేవలం 1 లక్ష టన్నులకు మించి రాయిని తొలగించడం సాధ్యం కాదు. అంటే గంటకు ఐదువేల కిలోలు మాత్రమే తొలగించవచ్చు. కానీ, 4 లక్షల టన్నుల రాయిని తొలగించడం ఎలా సాధ్యమైంది? ప్రస్తుత చరిత్రకారులు చెప్పినట్లే వెయ్యేండ్ల క్రితం కైలాస దేవాలయం 18 ఏండ్లలో నిర్మించినట్లయితే.. ఎంతో కష్టపడి ఆ నాలుగు లక్షల టన్నుల రాయిని తొలగించారనే అనుకుందాం.. కానీ ఆ రాయి అంతా ఎక్కడో ఒకచోట శిథిలాలుగానైనా కనిపించాలి కదా? చుట్టుపక్కల వందల కిలోమీటర్ల దూరంలో అలాంటి ఆనవాళ్లు లేవు.

ఈ రాయిని సమీపంలోని మరేదైనా నిర్మాణానికి వినియోగించారా అంటే అందుకు సంబంధించిన ప్రతీకలు కూడా ఏవీ కనిపించడంలేదు. పోనీ ఇది సహజంగా ఏర్పడిన నిర్మాణమా అంటే కానే కాదు. స్పష్టంగా మానవ నిర్మితమేనని పురాతత్వ శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, నిర్మాణరంగ నిపుణులు తేల్చిచెప్పారు. మరి ఈ రాతి తొలగింపు ఎలా సాధ్యపడింది? రాతి గుహను తవ్వుతున్నప్పుడు రాయి ధూళిగా మారిపోయి ఉండాలి.. దీనిపై మరింత లోతుగా పరిశోధన చేసినప్పుడు వేదాలలో ఒక శక్తిమంతమైన పరికరం గురించిన ప్రస్తావన ఉన్నది. ఇది ఒక హైటెక్ మెషిన్. దీనిపేరు భౌమాస్త్రం. మహాభారత కాలంలో కూడా ఈ అస్త్రాన్ని వినియోగించినట్లు తెలుస్తుంది. ఇది రాతిని డ్రిల్ చేసుకుంటూ వెళ్తుంది. డ్రిల్ చేస్తున్నప్పుడే రాతిని ధూళిగా మార్చి గాలిలో కలిపేయగలదు. కైలాస ఆలయ నిర్మాణంలో ముఖ్యంగా గుర్తించాల్సింది రాతిని తొలిచే పని పై నుంచి కిందకు సాగింది. అంటే డ్రిల్లింగ్ జరిగిందనేది స్పష్టం. ఈ అస్త్రం గురించి వేద రచనల్లో చాలాసార్లు ప్రస్తావించారు. ఇది రాతిని మాత్రమే కాదు.. గనుల తవ్వకాలలో కూడా దీన్ని వినియోగించారు. వేల సంవత్సరాల క్రితమే కైలాస ఆలయ నిర్మాణానికి భౌమాస్త్రాన్ని వినియోగించారనే ఆస్ట్రోనాట్ సిద్ధాంతకర్తలు స్పష్టంచేస్తున్నారు.

కైలాస ఆలయంలో మనం మరింత ప్రముఖంగా గుర్తించాల్సింది పెద్ద పెద్ద సొరంగాలు. కొన్ని సొరంగాలు చిత్రవిచిత్ర కోణాల్లో కనిపిస్తాయి. ఇంకొన్ని సొరంగాలు నలభై అడుగుల లోతువరకు ఉన్నాయి. కైలాస ఆలయం కింద పెద్ద సొరంగం ఉన్నది. స్థానిక అధికారులు ఇప్పుడు ఈ సొరంగాన్ని మూసివేశారు. కానీ కైలాస ఆలయం కింద సొరంగాలు నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతకీ ఆ సొరంగంలో ఏమున్నది? 1876వ సంవత్సరంలో బ్రిటన్‌కు చెందిన ఆధ్యాత్మికవేత్త ఎమ్మా హార్డింజ్ బ్రిట్టెన్.. ‘ఘోస్ట్ ల్యాండ్’ అన్న పుస్తకాన్ని రాశారు. అందులో ఈ రహస్య సొరంగం గురించి ఆమె విస్తారంగా చర్చించారు. ఆమె కేవలియర్ లూయీ అనే వ్యక్తితో మాట్లాడినప్పుడు అతను ఎల్లోరాలోని ఈ రహస్య సొరంగం గురించిన వివరాలు చెప్పినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ‘ఎల్లోరాలోని ఈ రహస్య సొరంగంలోకి లూయీ ప్రవేశించినప్పుడు అక్కడ కొన్ని ప్రత్యేకమైన జీవరాశులు కనిపించాయి. అక్కడ అండర్‌గ్రౌండ్ చాంబర్ ఉన్నది. దాన్ని ఓపెన్ చేయగానే ఎదురుగా అతిపెద్ద అత్యున్నత వేదిక కనిపించింది. దానిపై పెద్ద పెద్ద లోహరాతి వేదికలు శక్తిమంతమైన బ్యాటరీల సహాయంతో చార్జింగ్ అవుతూ వెలుగులు విరజిమ్ముతున్నాయి. అక్కడున్న ఏడు రాతి ఆసనాలపై ఏడుగురు కూర్చొని ఉన్నారు. మధ్యలో ఉన్నవారు మాత్రం అస్పష్టంగా ఉన్నారు. ఆయన శరీరం ప్రకాశిస్తున్నది. భౌతిక కాల ప్రాంతాలకు అతీతంగా ఆయన ఆకృతి వెలుగొందుతున్నది. ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరీయన? మహేశ్వరుడు స్వయంగా అక్కడ ఆవాసం ఏర్పరుచుకున్నారా? రోదసిలోని తన లోకాల నుంచి ఆయన ఈ ప్రాంతంలోకి వచ్చివెళ్తున్నారా? అలా కాకపోతే ఆలయం కింద అంత విస్తారమైన సొరంగాలను ఎందుకు తవ్వారు? పెద్ద పెద్ద గదులను ఎందుకు నిర్మించారు. ఈ సొరంగాలను ఒకరకంగా ప్రాచీన నగరాలుగా భావించవచ్చా? వేల సంవత్సరాల క్రితం గ్రహాంతర వాసులు.. లేదా దేవతలకు భూమిపై ఇవి ఆవాసాలుగా ఉపయోగపడ్డాయా? అంటే అవుననే అంటున్నారు ఆస్ట్రోనాట్ శాస్త్రవేత్తలు. భూమిపై మహా ప్రళయాన్ని సృష్టించినప్పుడు మహాదేవుడు ప్రజలను ఈ సురక్షిత సొరంగాల్లోకి తరలించి రక్షించాడా? ఈ ఆలయాన్ని ప్రస్తుత చరిత్రకారులైతే వెయ్యేండ్ల క్రితం కట్టినట్లుగా భావించడమే తప్ప స్పష్టమైన తేదీకి ఎలాంటి ఆనవాళ్లు లేవు. ఇలాంటి ఆలయాలు, సొరంగాలు మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తాయి. ప్రధాన స్రవంతిలో ఉన్న పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్పేదానికన్నా ఇవన్నీ చాలా ప్రాచీనమైనవి. వాటికి వినియోగించిన యంత్రాలు, అస్త్ర శస్త్రాలు అంతకంటే ప్రాచీనమైనవి. వాటి శక్తి అనంతమైంది. వాటి రూపకర్త ఆదిదేవుడు. ఇందులో సందేహం అక్కర్లేదు.

శివలింగం

మహాదేవుడిలో మనకు ప్రధానంగా కనిపించేది.. మిగతా దేవతలెవరిలోనూ కనిపించని రూపం శివలింగం. ముక్కోటి దేవతల్లో ఎవరికీ ఇలాంటి రూపం లేదు. ఈ రూపంలో శివుడిని కొలవడం లేదు. మహాశివరాత్రిని లింగోద్భవ దినంగా ప్రత్యేకంగా పూజాదికాలు చేస్తారు. గోళాకారంలో ఉండే శివలింగం.. ప్రత్యేకంగా ఉండే ఆధారభూమికపై స్థిరపడి ఉంటుంది. భారతదేశంలోనే కాదు, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా అంతటా శివలింగాలు మనకు కనిపిస్తాయి. చైనా, జపాన్లలో కూడా శివలింగాలు దర్శనమిస్తాయి. దాదాపు రెండువేల సంవత్సరాలకు పూర్వం శివలింగం మొదట కనిపించినట్లు పాశ్చాత్య శాస్త్రవేత్తలు చెప్తారు కానీ, ఇది అంతకుముందు వేల ఏండ్ల నాటి నుంచే మన దగ్గర పూజలందుకొంటున్నది. మన దేశంలో ఆయా దేవతాలక్షణాలకు తగినట్టు రూపలావణ్యాలు ఏర్పడ్డాయి. కానీ.. శివుడికి మాత్రం ఒక ఎక్స్‌ట్రా రూపం.. అదీ కన్నూ.. ముక్కూ… చెవీ.. కాళ్లూ చేతులూ లేని రూపం. ఒక రాయి. నదీ గర్భంలో నీళ్లలో నాని నాని నున్నగా గోళాకారంలో కనిపించే పెబ్బెల్స్ టైప్ రాయిలా ఉంటుంది. జనరల్‌గా ఓవెల్ షేప్‌లో ఉండే ఈ రాయి స్థిరంగా నిల్చోడానికి ఓ బేస్‌మెంట్.. అదికూడా వాటర్ పోస్తే బయటకు వెళ్లిపోయేలా కాలువ మాదిరి నిర్మాణం. నిరంతరం దీన్ని అభిషేకించడానికి పైన ప్రత్యేక ఏర్పాటు.. పైనున్న రాతి రూపానికి శివలింగమని పేరు. కింద ఉన్న బేస్‌కు పానవట్టమని పేరు. శివుడికి దీనికి ఉన్న సంబంధం ఏమిటి? శివుడికి ఆల్రెడీ ఒక రూపం ఉన్నప్పుడు ఆ రూపంలో విగ్రహాలు ఉండకుండా లింగరూపంలో ఆరాధించడమేమిటి? పోనీ శివలింగాన్ని అచ్చంగా శివుడికి మాత్రమే ప్రతిరూపంగా ఆరాధిస్తున్నారా? అంటే అదీలేదు. శివలింగాన్ని శృంగారానికి.. కామానికి ప్రతీక అని నిర్వచించారు. అది మనందరి మెదళ్లలోకి చెరిగిపోని విధంగా ఎక్కించారు. ఈ భావనపైనే విశ్వసనీయతను పెంచుతూ వచ్చారు. నిజంగా శివుడికి ప్రతిరూపమని శివలింగాన్ని సంభావించినప్పుడు ఆ ప్రతీకాత్మకతకు నిర్వచనం మరోవిధంగా ఉండాలి? కానీ ఆ విధంగా నిర్వచించలేదు. శివలింగాన్ని శివుడికి ప్రతిరూపంగా చెప్తూనే.. దాన్ని పూర్తిగా శృంగారానికి ప్రత్యక్షప్రతీకగా చెప్తూ వచ్చారు. శివలింగాన్ని, పానవట్టాన్ని పురుష స్త్రీ ఆర్గాన్లుగా విస్తృతంగా నిర్వచించి సృష్టి నిర్మాణ కార్యానికి గుర్తులుగా రెండున్నర వందల సంవత్సరాలుగా ప్రచారం జరిగింది. ఈ రకమైన ఇంటర్‌ప్రెటేషన్‌కు ఎక్కడైనా ఆధారం ఉన్నదా? ఆయా లక్షణాల ప్రకారమే దేవతలకు రూపాలను కల్పించారని భావించినట్లయితే, మనకున్న ముక్కోటి దేవతల్లో శృంగారానికి, ప్రేమకు ప్రతిరూపాలుగా స్పెషల్‌గా రతీ మన్మథులున్నారు. శివపార్వతులను కలిపింది కూడా వాళ్లే. యూనివర్సల్ ప్రేమకు అస్తిత్వ రూపాలుగా ఆ ఇద్దరు ఉన్నప్పుడు.. శక్తి లయకారకులైన ఆదిదంపతులకు ప్రతిరూపంగా శివలింగానికి పునర్నిర్వచనం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఎవరు ఈ విధంగా నిర్వచించారు?

ఆదిదేవుడైన పరమేశ్వరుడు పురుషుడై.. ఆదిశక్తి అయిన అమ్మ పార్వతి ప్రకృతి స్వరూపంలో మూర్తిమంతమై అర్ధనారీశ్వరతత్తానికి ఉనికి అయి.. ఆది దంపతులుగా కొలువుదీరినప్పుడు.. శివలింగానికి చేసిన ఈ ప్రతీకాత్మక భావన వెనుక అభ్యంతరం చెప్పడానికి ఏమున్నదన్న ప్రశ్న ఉద్భవించడం వాస్తవమే. ప్రకృతి పురుషుల కలయిక ఈ సమస్త సృష్టికి ఆధారభూతమైనదన్న వాదన పై అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సైన్స్ కూడా ఈ సిద్ధాంతాన్ని అంగీకరిస్తుంది. సమస్తమైన ప్రకృతి స్త్రీ రూపమైనప్పుడు.. ప్రత్యక్షనారాయణుడైన సూర్యుడు పురుషుడై కిరణజన్య సంయోజక్రియ ద్వారా ఈ సమస్త సృష్టివికాసం జరుగుతున్నది. హేతువాదులకూ ఈ విషయంలో భిన్నాభిప్రాయాలుండే అవకాశంలేదు. ఈ ప్రకృతి పురుషుల ఏకాత్మ భావనకు శివలింగానికి సంబంధం ఏమిటి?

ఒకవేళ శివలింగాన్ని ఇన్నేండ్లుగా ప్రచారం చేసినట్టు శృంగారానికి ప్రతీకగానే ఒక్క క్షణం భావించినట్టయితే.. ఆ లింగానికి నిరంతర జలాభిషేకం చేయడం దేనికి? శివలింగానికి పైభాగాన ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పాత్ర ద్వారా అఖండ జలాభిషేకం ఎందుకు చేస్తారు. శృంగారానికి ప్రతీక అయినప్పుడు జలాభిషేకం దేనికీ గుర్తు? శివుడు అభిషేక ప్రియుడు అని అనుకొన్నప్పుడు శివుడి మూర్తరూపానికి అభిషేకం చేయవచ్చు. కానీ సంపూర్ణ వ్యక్తిరూపంలో ఉన్న శివుడికి నిత్యాభిషేకం చేస్తున్న దాఖలాలు మనకు సాధారణంగా కనిపించవు. శివలింగానికి మాత్రమే అభిషేకం తప్పనిసరి. శివలింగాన్ని.. పానవట్టాన్ని ఏకత్రితం చేసి చూసినప్పుడు అక్కడ శివపార్వతులు ఇరువురూ.. అంటే స్త్రీ పురుషులు.. ఇద్దరూ ఉన్నట్టే కదా.. అంటే శివుడితోపాటు అమ్మకు (పార్వతి) కూడా అభిషేకం చేసినట్టే కదా. అంటే.. పార్వతీదేవి కూడా అభిషేక ప్రియురాలా? సాధారణంగా ఇతర దేవతలకు అభిషేకం చేసినప్పుడు అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. కానీ శివలింగానికి అభిషేకం చేసిన జలాన్ని తీర్థంగా స్వీకరించరు. విడిగా వదిలిపెడతారు. ఎందుకు? శివలింగంలోనే ఆదిదంపతులు ఒకటిగా దర్శనమిస్తున్నప్పుడు ఆలయాల్లో పార్వతీదేవి పలు రూపాల్లో విడిగా ఎందుకు దర్శనమిస్తుంది?

కాస్మిక్ క్రియేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో మనకు త్రిమూర్తి కాన్సెప్ట్ బలంగా కనిపిస్తుంది. త్రిమూర్తితత్వం అనేది సృష్టి నిర్మాణ నిర్వహణ వ్యవస్థ. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు ఈ త్రిమూర్తి తత్త్వమే మూలం. ఇందులో బ్రహ్మ సృష్టిని నిర్మించేవాడు అయితే, విష్ణువు పరిపాలించేవాడు. లయకారుడు మహాదేవుడు. విశ్వమంతా ఈశ్వరుడిని ఈ విధంగానే దర్శిస్తుంది. కొలుస్తుంది. శివుడు లయకారుడు. అంటే గ్రేట్ డిస్ట్రాయర్ అని. శివుడి ప్రధాన కార్యనిర్వహణ లయవిన్యాసమే. అలాంటప్పుడు శివుడికి ప్రతిరూపంగా భావించే శివలింగాన్ని శృంగార భావనకు ప్రతీకగా ఎలా భావించారు? మహాశివరాత్రినాడు ఏదైతే లింగోద్భవం జరిగిందని మనం ఆరాధిస్తామో అందుకు హేతువుగా చెప్పే కథనం కూడా స్పష్టంగానే ఉంటుంది. త్రిమూర్తులలో ఆధిక్య ప్రస్తావన వచ్చినప్పుడు బ్రహ్మ విష్ణువులకు భూమ్యాకాశాలను ఏకంచేస్తూ మహాదేవుడు అత్యంత శక్తిమంతమైన జ్యోతిస్వరూప లింగంగా ఉద్భవించాడని.. దాని తుదిమొదలు తెలియక బ్రహ్మవిష్ణువులు శివలింగానికి మోకరిల్లారని చెప్తారు. లింగోద్భవ ప్రధాన కథనమే ఈ రకంగా చెప్పినప్పుడు ఇక శృంగారాత్మక ప్రతీకకు ఆస్కారమెక్కడ ఉన్నది? జనరల్‌గా మన దేవీదేవతలు, భక్తి, ఫిలాసఫీకి సంబంధించి ఎలాంటి విశ్లేషణ జరిగినా.. మౌఖిక సాహిత్యమైన వేదాలనో.. కథల రూపంలో వచ్చిన పురాణాలనో.. చరిత్ర రూపంగా వచ్చిన ఇతిహాసాలనో కోట్ చేయడం సాధారణంగా జరిగేది. కానీ.. శివలింగానికి శృంగారపరమైన ప్రతీకాత్మకత ఎక్కడా కనిపించదు.. దీనికి ఫలానా కథ.. ఫలానా పురాణం.. ఫలానా శ్లోకం దీనికి ప్రతీక అన్న భావన ప్రచారంలోకి వచ్చింది రెండున్నర వందల ఏండ్ల క్రితం బ్రిటిషోడు మన ల్యాండ్‌ను కబ్జా చేసిన తర్వాత జరిగిన పరిణామం.

హిందూయిజంలో అత్యంత వక్రీకరణకు గురైంది ఏదైనా ఉందంటే అది శివలింగం. ఏ స్థాయిలో జరిగిందంటే.. ఇదే నిజమని మనం పూర్తిగా విశ్వసించేంతగా. ఇప్పుడు దీనికి వేరే భాష్యం (ఇంటర్‌ప్రెటేషన్‌) ఇచ్చినా తోసిరాజనేంతగా వక్రీకరణ జరిగింది. 1900 సంవత్సరంలో పారిస్‌లో ప్రపంచ మత సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి స్వామి వివేకానంద హాజరయ్యారు. అదే సమ్మేళనంలో మద్రాసు నుంచి గుస్తవ్ ఒప్పర్ట్ అనే క్రైస్తవ ప్రొఫెసర్ కూడా పాల్గొన్నాడు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో తులనాత్మక అధ్యయనశాఖలో 21 ఏండ్ల పాటు పనిచేశాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి తెలుగు భాష అనువాదకుడిగా పనిచేశారు. ఇతర ద్రవిడ భాషలపై కూడా ఈయన పనిచేశాడు. ప్రభుత్వ మానుస్క్రిప్ట్ లైబ్రరీకి క్యూరేటర్‌గా కూడా వ్యవహరించాడు. రాబర్ట్ క్లాడ్‌వెల్‌తో కలిసి ద్రావిడుల ఆవిర్భావంపై పరిశోధన చేశాడు. వీరిద్దరూ కలిసి మిషనరీల కోసం పనిచేసేవారు.

వీరి రచనలన్నీ కూడా ద్రవిడ భాషలపై వ్యాఖ్యానాలే. వివరణలన్నీ కూడా విపరీతార్థాలు.. అర్థం కాని అపార్థాలతో కూడుకొన్నవే. ద్రవిడ భాషావిభాగాలను జాతిపరంగా నిర్వచించిన మేధావులు వీళ్లు. గుస్తవ్ తన రచనల్లో రాబర్ట్ క్లాడ్ మాటల్ని చాలాచోట్ల ప్రస్తావించాడు. వక్రభాష్యాలు చెప్పాడు. ద్రవిడభాషలు.. సంస్కతానికి సంబంధించి తాను అనుసరించిన విధానం సరైంది కాదని.. తర్వాతి కాలంలో తానే (గుస్తవ్) అంగీకరించాడు కూడా. తాను అనుసరించిన విధానం సరైంది కాదని ఒప్పుకొన్నాడు. ఆయా భాషలు తనకు అర్థమైన రీతిలో ఊహాజనితంగా ఒక మిథ్యా సిద్ధాంతాలను చేసుకొంటూ వచ్చానని చెప్పుకొచ్చాడు. రాబర్ట్ క్లాడ్‌వెల్ వ్యాఖ్యానాలపై తాను ఎక్కువగా ఆధారపడినట్లు చెప్పుకొచ్చాడు. కానీ సో కాల్డ్ భారతీయ చరిత్రకారులు ఈయన రచనల్లో నిజానిజాలను నిర్ధారించుకోకుండా వీటినే చారిత్రక నిజాలుగా ఫాలో అవుతూ పోయారు. వీళ్లకు ఒరిజినల్ రచనలను, ఆధారాలను చూసే ఓపికలేదు. విశ్లేషించే తీరికా లేదు. అంతకుమించి ఆసక్తి కూడా లేదు. మన చరిత్రను వక్రీకరించినవాడే గొప్పవాడు. వాడు చెప్పిందే చరిత్ర. ఈయన రచనలను తిరిగి యథాతథంగా ప్రచురించారు. కానీ.. కనీసం ఆయన ఒప్పుకొన్న నిజాలను మచ్చుకు కూడా ఆయన రచనలను పునర్ముద్రించినప్పుడు ప్రస్తావించలేదు. కనీసం అందులో ఎలాంటి కరెక్షన్స్ చేయలేదు. ఎడిటింగ్ చేయలేదు. అప్‌డేట్ కూడా చేయకుండానే వాటిని ముద్రించి సమాజం మీదకు వదిలారు. అంటేనే దాని వెనుక ఎంత కుట్ర దాగి ఉన్నదో అర్థమవుతుంది. ఈయనగారి వ్యాఖ్యానాల్లో ఒకటి శివలింగానికి సంబంధించింది. గుప్తవ్ ఒప్పర్ట్ పారిస్ కాంగ్రెస్‌లో హిందూ ధర్మానికి సంబంధించి తనదైన వ్యాఖ్యానం చేశాడు. ముఖ్యంగా సాలగ్రామ శిలపై ఒక పరిశోధనాపత్రాన్ని సమర్పించాడు. ఈయన గారి వ్యాఖ్యానం మేరకు సాలగ్రామశిల స్త్రీ యోనికి ప్రతీక అని, శివలింగం పురుషాంగమని పేర్కొన్నాడు. స్త్రీపురుష సంయోగానికి శివలింగం ప్రతీక అని సూత్రీకరించాడు. ఈయన వ్యాఖ్యానంపై సదస్సుకు హాజరైన స్వామి వివేకానంద తీవ్రంగా స్పందించారు. శివలింగం, సాలగ్రామ శిలకు సంబంధించి వాటికి సంబంధం లేని విపరీతార్థాలు తీశారని ఖండించారు. శివలింగానికి మూలం ఏమిటన్నది సోదాహరణంగా వివరించారు. అథర్వవేద సంహితలో యూప స్తుభం గురించి చర్చించింది. ఇది ఆద్యంతాలు లేనిది. అత్యంత శక్తిమంతమైనది. జగత్తుకంతటికీ ఆధారభూతమైనది.

దాన్నుంచి వెలువడే శక్తి అనంతమైనది. ఇదే శివలింగానికి ప్రతీక. ఇదే సదస్సులో మనం మహామేధావి అని కొలుస్తున్న మాక్స్ ముల్లర్ ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని కూడా స్వామీజీ విస్పష్టంగా, సహేతుకంగా తప్పని రుజువుచేశారు. 1896 మే 28న స్వామీజీ మాక్స్ ముల్లర్ ను లండన్‌లోని ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. ఆయనతో చర్చల తర్వాత ఆర్యుల సిద్ధాంతాన్ని తాను ఉపసంహరించుకుంటున్నట్లు మాక్స్ ముల్లర్ ప్రకటించాడు.

“I have declared again and again that if i say aryan, I mean neither blood nor bones, nor hair, nor skull, I mean simply those speak aryan language. To me an ethnologist who speaks of aryan race, aryan blood, aryan eyes and hair, is as great sinner as a linguist who speaks of a dolicephalic dictionary or brachycephalic grammar.”

మాక్స్ ముల్లర్ స్వయంగా వివరణ ఇచ్చిన తర్వాత కూడా భారతీయ చరిత్రలో కానీ, చరిత్రకారుల మెదళ్లలో కానీ ఆర్య ద్రావిడ సిద్దాంతం చావలేదు. దాన్ని కావాలని అదే పనిగా చర్చిస్తూ వచ్చారు. ఇదంతా ఇక్కడ అప్రస్తుతం కావచ్చు. కానీ, భారతీయ చరిత్ర, సంస్కృతి, ధర్మాలను ఎంతగా దుర్యాఖ్యానం చేశారనడానికి ఇదొక ఉదాహరణ. తాము చేసిన తప్పులను చేసిన వాళ్లు ఒప్పుకొన్నా.. వాటిని మాత్రం అదేపనిగా ప్రచారం చేసి వాటినే నిజమని నమ్మించారు. వీటిలో శివలింగాన్ని శృంగార ప్రతీకగా చెప్పటం ఈ ప్రచారానికి పరాకాష్ట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here