విశిష్ట విశ్వనాదన్‌‌

0
10

[జూన్ 24 ప్రముఖ స్వరకర్త ఎమ్.ఎస్. విశ్వనాదన్ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీ రోచిష్మాన్.]

[dropcap]సి[/dropcap]నిమా సంగీత దర్శకుడు ఎమ్.ఎస్. విశ్వనాదన్ పుట్టిన రోజు 24/6.

భారతదేశంలో వచ్చిన దార్శనిక సినిమా సంగీత దర్శకుల్లో ఒకరు ఎమ్. ఎస్. విశ్వనాదన్ (ఆయన్ను విశ్వనాథన్ అని అనరు). మన దేశంలో ఉన్నత, అత్యున్నత సంగీత దర్శకులు ఉన్నారు. ఉన్నత, అత్యున్నతతో పాటు శంకర్-జైకిషన్‌లా దార్శనికత కూడా ఉన్న సంగీత దర్శకుడు విశ్వనాదన్.

భారతదేశ చలనచిత్ర సంగీత దర్శకుల్లో‌ పుష్కలమైన సృజనాత్మకత ఉన్న‌వారు ఎమ్.ఎస్. విశ్వనాదన్.‌ ఆయన ఒక visionary music composer. ఆయన ప్రదర్శించిన వైవిధ్యం‌ దేశంలో మఱో సినిమా సంగీత దర్శకుడు ఇవ్వలేదు. తనను తాను మార్చుకుంటూ నాలుగు దశాబ్దుల కాలం పాటు వైవిధ్యవంతమైన సంగీతాన్ని‌ చేశారు.

High stratum of aesthetic sense and creativityలతో ఆయన ఎన్నెన్నో పాటలు చేశారు. Musical gap, relief-note, bridge passages, leading notesతో విశేషమైన సౌందర్యాన్ని సాధిస్తూ అద్భుతమైన పాటల్ని చేశారు విశ్వనాదన్. పాటల్లో విలంబం‌‌ అన్నదాన్ని అత్యంత గొప్పగా పొందుపఱిచేవారు విశ్వనాదన్. ఆయన చేసిన మహోన్నత స్థాయి‌ పాటలు‌ దేశంలోనే అరుదుగా వచ్చాయి.

“జగమే మాయ బ్రతుకే మాయ…” దేవదాసు (1953) సినిమాలోని పాట తెలుగునాట ఎంత జనరంజకమైందో తెలిసిందే. ఆ గొప్ప పాటను చేసింది విశ్వనాదన్. సీ.ఆర్. సుబ్బురామన్ పేరుతో ఆ పాట వచ్చింది కానీ ఆ పాట రూపొందిన నాటికి సుబ్బురామన్ జీవించి లేరు. సుబ్బరామన్‌కు సహాయకుడుగా ఉన్న విశ్వనాదన్ ఆ పాటను చేశారు. దేవదాసు సినిమాలో ఆర్. బాలసరస్వతీ దేవి పాడిన “ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా…”, “అందాల ఆనందం ఇందేనయ్యా…” పాటలు కూడా విశ్వనాదన్ చేసినవే.

చండీరాణి సినిమాలోని “ఓ జాబిలీ ఓ తారకా…” పాట మట్టు (బాణి) సుబ్బురామన్‌ది అయితే వాద్య సంగీతం విశ్వనాదన్‌దే. 1956లో వచ్చిన తెనాలి రామకృష్ణ సినిమాకు సంగీతం చేసిన విశ్వనాదన్ ఒక మలయాళీ అయుండీ తెలుగు పద్యాలకు సంగీతం చెయ్యడం విశేషం.

ఇళయరాజా, ఎ.ఆర్. రెహ్మాన్ లకు ఆదర్శం ఎమ్. ఎస్.‌ విశ్వనాథన్. ఆయన వేసిన బాటలోనే ఈ ఇద్దఱూ అత్యంత గొప్ప‌ సంగీతాన్ని సృజించారు.

విశ్వనాదన్ పాటలు ఆధారంగా ఇళయరాజా కొన్ని పాటలు చేశారు. ఇళయరాజా చేసిన “జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై…” పాటకు ఆధారం ఓ విశ్వనాదన్ పాట. దేశాన్నే అలరించిన, అంతర్జాతీయ‌ ఖ్యాతిని పొందిన ఎ.ఆర్. రహ్మాన్ పాట “చిన్ని, చిన్ని ఆశ” పాటకు మూలం‌ విశ్వనాథన్ పాటే. సత్తెకాలపు సత్తెయ్య సినిమాలో పీ.బీ. శ్రీనివాస్ పాడిన “ముద్దు‌ముద్దు నవ్వు…” పాట అది.

పీ. సుశీలతో తమిళ్‌లో ఎన్నో గొప్పపాటలు పాడించారు‌. పీ.బీ. శ్రీనివాస్, ఏసుదాస్, ఎస్‌. జానకి, ఎస్‌. పీ. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం‌, టీ.ఎమ్. సౌందరరాజన్ వంటి గాయకులతో అద్భుతాల్ని పాడించారు‌. ఎస్‌. పీ. బాలసుబ్రహ్మణ్యంకు తొలి హిట్ పాట విశ్వనాదన్ చేసిందే. పీ.బీ. శ్రీనివాస్ గాత్రంతో western flavorను ఎంతో గొప్పగా పలికించారు.‌ మంగళంపల్లి బాలకృష్ణతో విశ్వనాదన్ అభోగి వంటి‌ రాగాల్ని మహోన్నతంగా పాడించారు. కళ్యాణ వసంతం, గౌరిమనోహరి వంటి రాగాలను గొప్పగా ప్రయోగించారు. నాలుగు స్వరాలు మాత్రమే ఉండే మహతి రాగాన్ని కూడా సినిమాకు తీసుకొచ్చారు. ఠుమ్రీ వంటి పాటలు చేశారు. Western, జానపద, కర్ణాటక సంగీతాల్ని మేళవిస్తూ గొప్ప ప్రయోగాలు చేశారు విశ్వనాదన్. గజల్ గాన విధానంపై సరైన అవగాహనతో విశ్వనాదన్ 1961లోనే గజల్ వంటి పాటలు చేశారు. ఇంటికి దీపం ఇల్లాలే సినిమాలోని “కాపలా కాపలా ఎవరికి ఎవరు కాపలా…” పాట గొప్ప గజల్ వంటిది. తెలుగులో తొలిసారి గజలియత్ గానం ఈ పాటతోనే వచ్చింది. 1962లో వచ్చిన గుడిగంటలు సినిమాలో ఎస్. జానకి పాడిన “నీ కనుదోయి నిద్దురనై…” పాటా, కానిస్టేబుల్ కూతురు సినిమాలో పీ.బీ. శ్రీనివాస్, పీ. సుశీల పాడిన “ చిగురాకుల ఊయలలో ఇల మరచిన…” పాటా తొలుత తమిళ్ష్‌లో విశ్వనాదన్ చేసినవే. తాను ఈ పాటల్ని గజల్ టైప్‌లో చేశానని విశ్వనాదన్ స్వయంగా చెప్పారు. 1966లో తమిళ్ష్‌లో రాము అన్న సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఎమ్.ఎస్. విశ్వనాథన్ హిందూస్థానీ భాగేశ్రీ రాగంలో ఫక్తు గజల్ వంటి పాట

“నిలవే ఎన్నిడమ్ నెరుఙాదే…” చేశారు. (ఇది తెలుగులో ఘంటసాల పాడిన “మంటలు రేపే నెలరాజా..” పాట; సినిమా: రాము) గజలియత్‌తో ఉదాత్తంగా పాడారు పీ.బీ. శ్రీనివాస్. గానం పరంగా దక్షిణ భారత దేశంలోని ప్రముఖ గాయకులు కె.జే. ఏసుదాస్, ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం ఆపై ఇతర గాయకుల్ని ప్రభావితం చేసిన పాట అది. ప్రముఖ గజల్ గాయకుడు గులామ్ అలీ మద్రాస్ (చెన్నై) పర్యటనకు వచ్చినప్పుడు విని తన గజల్ కచేరీలో ఆ తమిళ్ష్ పాటను పాడారు. విశ్వనాదన్ ఏ మేరకు గజలియత్‌కు రూపకల్పన చేశారో ఆ పాటను గులామ్ అలీ పాడడం తెలియజేస్తోంది.

“ముత్తుకుళిక్క వారియళా” అనే జానపద ఫక్కీలో విశ్వనాదన్ చేసిన పాట దేశం మొత్తం మార్మోగిపోయింది. ఆర్.డీ. బర్మన్ ఒక‌ హిందీ సినిమాలో ఈ పాటను తమిళ్ష్ మాటలతోనే వాడుకున్నారు. నొషాద్ (నౌషాద్ కాదు) చేసిన సాతి సినిమా ఒక తమిళ సినిమాకు రీమేక్. ఆ సినిమాకు విశ్వనాదన్‌ చేసిన పాటల్ని విన్నాక నొషాద్ నేను ఇంత బాగా చెయ్యలేను అని గట్టిగా చెప్పారు. కానీ బలవంతంగా నొషాద్ చెయ్యాల్సి వచ్చింది. విశ్వనాదన్‌ పాటల ముందు నొషాద్ పాటలు వెలవెలబోయాయి. పైగా నొషాద్ విమర్శల పాలయ్యారు. “పోతే పోనీ పోరా…” విశ్వనాదన్ చేసిన పాట. ఆ పాట స్ఫూర్తితో నొషాద్ ఆద్మి‌ సినిమాలో “ఆజ్ పురానీ రాహోన్ సే…” వంటి చక్కటి పాట చేశారు. విశ్వనాదన్‌ చేసిన “రోజా మలరే రాజకుమారి…” అన్న ఒక తమిళ్ పాటను విన్న సంగీత దర్శకుడు రోషన్ “క్యా గానా” అన్నారు. శంకర్-జైకిషన్‌లలో శంకర్‌కు విశ్వనాదన్ అంటే పరిగణన, అభిమానం ఉండేవి. ఎన్.టీ. రామారావు నటించిన హిందీ సినిమా నయాఆద్మీ. ఈ సినిమా 25 వారాలు ఆడిన హిట్ సినిమా. ఈ‌ సినిమాకు విశ్వనాదన్‌ సంగీతం చేశారు. ఈ సినిమాలో రెండు పాటలు మదన్ మోహన్ చేశారు. కానీ విశ్వనాదన్ చేసిన పాటలే గొప్పగా ఉంటాయి. ఈ సినిమాలో విశ్వనాదన్ చేసిన “లోట్ గయా గమ్ కా జమానా…” పాట చాల బావుంటుంది. ఉత్తరాదిలో గొప్పగా పరిగణించబడిన తొలి దక్షిణాది సంగీత దర్శకుడు ఎమ్.ఎస్. విశ్వనాదన్. విశ్వనాదన్ చెసిన కొన్ని పాటలు లతామంగేశ్కర్, ఆశా భోన్‌స్లేల కుటుంబ పాటలయ్యాయి. ఈ విషయాన్ని 2004లో విశాఖపట్నంలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆశా స్వయంగా చెప్పారు.

ఇంటీకి దీపం ఇల్లాలే సినిమాలోని “నీవే నీవే..” పాట తెలుగు సినిమాల్లో వచ్చిన ఉన్నతస్థాయి పాటల్లో ఒకటి. డబ్బింగ్ సినిమా కర్ణలోని పాటలు తెలుగుకు బాగా తెలిసినవే. మహోన్నతమైంది ఈ కర్ణ సినిమా సంగీతం. విశ్వనాదన్ ముందుగా తమిళ్ష్‌లో చేసిన ఓ పాట “రేపంటి రూపం కంటి పూవింటి…” పాటగా తెలుగు ఇంటి అభిమానాన్ని అందుకుంది. మనసే మందిరం, ప్రేమించి చూడు, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, అంతులేని కథ వంటి రీమేక్ సినిమాల్లో పాటలు తెలుగులో ఎంతో జనరంజకమయ్యాయి. రక్తసంబంధం సినిమాలోని “చందురుని మించి అందమొలికించు ముద్దు పాపాయివే…” పాట తెలుగులో ఘంటసాల పేరుతో ఉంది. ఈ పాట విశ్వనాదన్ తమిళ్ష్‌లో చేసిందే. ఈ పాట విశ్వనాదన్ కన్నతల్లికి చాల ఇష్టమైన పాట. మరో చరిత్ర సినిమా పాటలు నాణ్యత పరంగా మేలైనవై జనరంజకమూ అయ్యాయి.

పెండ్యాల వంటి వారు విశ్వనాదన్ ప్రభావంతో సంగీతం చేశారు. బందిపోటు దొంగలు సినిమాలో పెండ్యాల చేసిన “విన్నానులే ప్రియా…” పాటకు స్ఫూర్తి, ప్రేరణ విశ్వనాదన్ చేసిన ఒక తమిళ్ష్‌ పాట.

విశ్వనాదన్ దగ్గర సహాయకుడుగా పని చెయ్యాలని పెండ్యాల ఒక సందర్భంలో అన్నారు. ఒక దశలో కె.వీ. మహాదేవన్ తనపై విశ్వనాదన్ ప్రభావం పడకూడదని చాల జాగ్రత్త పడేవారు. అయితే విశ్వనాదన్ ప్రభావం నుంచి కె.వీ. మహాదేవన్ తప్పించుకోలేకపోయారు‌. ఒక బహిరంగ సభలో “విశ్వనాదన్ ఎంగిలి నేను చేస్తున్న సంగీతం” అని ఇళయరాజా అన్నారు. పాడుతా తీయగా కార్యక్రమంలో ఒకసారి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం విశ్వనాదన్‌ చెప్పుల్ని తన నెత్తిపై పెట్టుకున్నారు. ఈ ఒక్క సంఘటన చాలు ఎమ్. ఎస్. వీ. ఎంత గొప్పవారో అర్థమవడానికి.

ఎమ్. ఎస్.‌ విశ్వనాదన్‌ – రామమూర్తి ద్వయంగా మొదటి సినిమా పణం అన్న తమిళ్ సినిమా, 1952లో విడుదలయింది‌. అంతకు మునుపు ఎస్. ఎమ్. సుబ్బయ్యనాయుడు పేరుపై వచ్చిన హిట్ పాటలు కొన్ని విశ్వనాదన్ చేశారు అప్పటికి రామమూర్తి కలవలేదు‌. 1953లో విడుదలయిన జెనోవా విశ్వనాదన్-రామమూర్తి తొలి సినిమా అని కొన్ని చోట్ల చెప్పబడింది; అది సరికాదు. జెనోవా సినిమాకు విశ్వనాదన్, జ్ఞానమణి, కళ్యాణం ఈ ముగ్గురూ సంగీతం‌ చేశారు. ఈ సినిమాలో రామమూర్తి లేరు. 1954లో వచ్చిన వైరమాలై సినిమాలో దక్షిణాది సినిమా పాటల్లో ఒక కొత్త flavorతో విశ్వనాదన్ “వన్‌జమిదో వాన్‌జై ఇదో…”, “కూవామల్ కూవుం కోగిలం…” పాటల్ని చేశారు. 1957లో వచ్చిన పుదయల్ అనే తమిళ సినిమాలో “విణ్ణోడుమ్ ముగిలోడుమ్ విళైయాడుమ్ వెణ్ణిలవే…” అన్న అద్భుతమైన పాట చేశారు విశ్వనాదన్. ఇది దక్షిణాది సినిమాలో వచ్చిన తొలి‌ exotic పాట. 1958లో వచ్చిన మాలైయిట్ట మంగై సినిమాతో విశ్వనాథన్ (రామమూర్తి) ఊపందుకున్నారు. 1959 నుంచి విశ్వనాథన్ యుగం మొదలయింది. 1997 వఱకూ ఉన్నతమైన పాటలు చేశారు. విశ్వనాదన్ – రామమూర్తి ద్వయంలో విశ్వనాదనే 95% సంగీతం చేసేవారు. రామమూర్తి చేసింది పెద్దగా లేదు. 1965 నుంచీ విశ్వనాదన్ తన పేరుతోనే సంగీతం చేశారు. విశ్వనాదన్ 2004-2005 వఱకూ కూడా ఆయన సినిమాలు చేశారు. విశ్వనాదన్ దాదాపుగా 800 సినిమాలకు సంగీతం చేశారు అని తమిళ్ష్ సినిమా చరిత్రకారుడు వామనన్ తెలియజేస్తున్నారు. ఎమ్.ఎస్. విశ్వనాదన్ కాలం 24/6/1928 – 14/7/2015.

విశ్వనాదన్ చేసినన్ని flavors తో సినిమా పాటల్ని దేశంలో మఱొకరు చెయ్యలేదు. ఉచ్చస్థాయి aesthetic sense, సృజనాత్మకతలతో విశ్వనాదన్ భారతదేశంలోని అత్యున్నతమైన చలనచిత్ర సంగీత దర్శకుల్లో ఒకరు. దక్షిణాది చలనచిత్ర సంగీత చరిత్ర ఎమ్. ఎస్. విశ్వనాదన్‌కు ముందు తరువాత అని చెప్పాల్సి ఉంటుంది. M.S.Viswanathan, a transitional figure in South Indian Film Music. మన దేశ సినిమాలో విశ్వనాదన్ సంగీతం ఎంతో విశిష్టమైంది. సంగీతం పరంగా ఆయన ‘విశిష్ఠ విశ్వనాదన్’.

‘Elaborate aesthetic embellishment’ – ఈ మాటను పాశ్చాత్య సంగీతంలో విశిష్టతను చెప్పాల్సి వచ్చినప్పుడు చెబుతూంటారు. మన దేశ సినిమాలో ఎమ్. ఎస్. విశ్వనాదన్ సంగీతం ‘an elaborate aesthetic embellishment’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here